డబ్ల్యూహెచ్‌ఓ అధినేతగా మరోసారి టెడ్రోస్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ పదవికి టెడ్రోస్‌ అథనోమ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. టెడ్రోస్‌ మరో ఐదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

Published : 26 May 2022 00:53 IST

కరెంట్‌ అఫైర్స్‌ 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ పదవికి టెడ్రోస్‌ అథనోమ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. టెడ్రోస్‌ మరో ఐదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటక సూచీలో 2021కి సంబంధించి భారతదేశం స్థానం 54కి పడిపోయిందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక వెల్లడించింది. 117 దేశాల్లో చేసిన అధ్యయనం ఆధారంగా డబ్ల్యూఈఎఫ్‌ ఈ వివరాలను ప్రకటించింది. జపాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో ఇప్పటికీ మనదేశమే అగ్రస్థానంలో ఉంది. 2019లో భారత్‌ 46వ స్థానంలో ఉంది.  

పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను అంచనా వేసి ర్యాంకులు ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్‌ జోషి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు ‘ఆర్‌’లకు (రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్‌) ప్రాధాన్యం ఇస్తారు. వ్యర్థాల ద్వారా సంపద సృష్టించి సర్క్యులర్‌ ఎకానమీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘వ్యర్థం నుంచి అర్థం’ అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. 

చిన్నపిల్లల్లో ఆటిజం, హైపరాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) సమస్యలపై పరిశోధనలు చేయడంతో పాటు ప్రత్యేక పుస్తకాన్ని రచించిన తెలుగు వైద్యుడు ఏఎంరెడ్డికి యూకే పార్లమెంట్‌ అవార్డు దక్కింది. 

జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. క్వాడ్‌ నేతలు సభ్యదేశాలకు చెందిన విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల దిశగా ప్రోత్సహించేందుకు కొత్త ఫెలోషిప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. క్వాడ్‌ నేతల తదుపరి ముఖాముఖి సదస్సు ఆస్ట్రేలియాలో 2023లో జరగనుంది. 

ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ కమిటీ (బి) ఛైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నియమితులయ్యారు. ఈ కమిటీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన పరిపాలన, ఆర్థిక వ్యవహారాలను చర్చించి నివేదిక రూపొందిస్తుంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని