Current affairs : కరెంట్‌ అఫైర్స్‌

బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత, కౌన్సిలర్‌ మొహీందర్‌ కె. మిధా ఘనతను దక్కించుకున్నారు. ఆమె పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌

Updated : 27 May 2022 04:11 IST

బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా మిధా

బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత, కౌన్సిలర్‌ మొహీందర్‌ కె. మిధా ఘనతను దక్కించుకున్నారు. ఆమె పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాదికి (2022 - 23)కిగాను ఆ పదవి కోసం కౌన్సిల్‌ సమావేశంలో మిధాను ఎన్నుకున్నారు.


స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ తెలంగాణలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ రైల్వే కోచ్‌ల కర్మాగారం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతున్న ఫెర్రింగ్‌ ఫార్మా, విద్యుత్‌ వాహనాల సంస్థ ష్నైడర్‌లు తమ కొత్త యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు చేసుకున్నాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో దావోస్‌లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఎంవోయూలపై సంతకాలు చేశారు.


వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామంలో వీరుల ఆలయంలోని సతి శిలలు 14, 15వ శతాబ్దాల నాటివి అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. బాసర తర్వాత రాష్ట్రంలో కొత్త శైలిలో కనిపిస్తున్న సతి శిలలు ఇవేనని పేర్కొంది. యుద్ధంలో మరణించిన వీర యోధులతో సహగమనం చేస్తున్న ముగ్గురు సతులను చెక్కిన మూడు శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.


ఐసీసీ పురుషుల టెస్టు బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి విరాట్‌ కోహ్లి టాప్‌-10లో కొనసాగుతున్నారు. ఐసీసీ ప్రకటించిన జాబితాలో రోహిత్‌, కోహ్లి ఎనిమిది, పదో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, బుమ్రా వరుసగా 2, 3వ స్థానాల్లో ఉన్నారు. ఆల్‌ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా నంబర్‌ వన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని