TS EXAMS-2022: అర్ధశుష్కం... అధిక వర్షం!

ఒక ప్రాంత వాతావరణం, మృత్తికలు అక్కడి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి.  అందుకే వాటి గురించి సరైన అవగాహన ఏర్పరుచుకుంటే మిగతా అంశాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రధానంగా అర్ధశుష్క

Updated : 28 May 2022 06:21 IST

తెలంగాణ భూగోళ శాస్త్రం

ఒక ప్రాంత వాతావరణం, మృత్తికలు అక్కడి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి.  అందుకే వాటి గురించి సరైన అవగాహన ఏర్పరుచుకుంటే మిగతా అంశాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రధానంగా అర్ధశుష్క శీతోష్ణస్థితిని కలిగి ఉంది. అత్యధిక వర్షపాతం, అత్యల్ప ఉష్ణోగ్రతలూ నమోదవుతుంటాయి. రాష్ట్రంలో ఎక్కువగా ఎర్రనేలలు ఉన్నాయి. వైవిధ్యభరితమైన ఈ శీతోష్ణస్థితి వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.  

తెలంగాణ శీతోష్ణస్థితి - మృత్తికలు

వాతావరణంలోని ఉష్ణోగ్రత, ఆర్ధ్రత, వర్షపాతం, పవన వేగం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సంబంధిత ప్రదేశపు శీతోష్ణస్థితిని అంచనా వేస్తారు.  
రోజులో/ కొన్ని గంటల్లో ఉష్ణోగ్రత, పీడనం, వర్షపాతం లాంటి అంశాల్లో కలిగే మార్పు రేటునే ఆ ప్రదేశ వాతావరణం అంటారు.

ప్రపంచ వాతావరణ ప్రధాన కేంద్రం - స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.

తెలంగాణలో భారత వాతావరణ శాఖ కేంద్రం - హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉంది.

తెలంగాణలో భారత వాతావరణ శాఖ (ఇండియా మెటియోరొలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌-ఐఎమ్‌డీ)కి చెందిన 12 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌లు (ఏడబ్ల్యూఎస్‌), మరో 53 ఆటోమేటిక్‌ రెయిన్‌ గేజ్‌ స్టేషన్‌లు   (ఏఆర్‌జీ) ఉన్నాయి.
రోజులో కలిగే మార్పురేటు కొన్నేళ్లకు (35 సంవత్సరాలు) లెక్కించగా వచ్చే సంగ్రహ సగటును ఆ ప్రాంతపు శీతోష్ణస్థితి అంటారు.

ఉదా: * భారతదేశ రుతుపవన శీతోష్ణస్థితి
తెలంగాణ అర్ధశుష్క శీతోష్ణస్థితి

తెలంగాణ ప్రధానంగా రుతుపవనాల మీద ఆధారపడింది. హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ కార్యాలయం ప్రకారం తెలంగాణలో నాలుగు కాలాలున్నాయి.
1) శీతాకాలం: డిసెంబరు - ఫిబ్రవరి
2) వేసవి:  మార్చి - మే
3) నైరుతి రుతుపవన కాలం: జూన్‌ - సెప్టెంబరు
4) ఈశాన్య రుతుపవన కాలం: అక్టోబరు - డిసెంబరు

శీతాకాలం: అల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడాన్ని శీతాకాలం అంటారు. తెలంగాణలో శీతాకాలం సాధారణంగా డిసెంబరులో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. అత్యధిక ప్రభావం జనవరిలో నమోదవుతుంది. సముద్ర మట్టానికి దాదాపు  600 మీ. ఎత్తులోని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో  10-15°C ఉష్ణోగ్రత ఉంటే రాష్ట్ర శీతాకాల సగటు ఉష్ణోగ్రత 22-23°C ఉంటుంది. శీతాకాలంలో ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇటీవల సంగారెడ్డి కోహీర్‌ -2.0°C, కుమురం భీం లింగాపూర్‌ 2.4°C; ఆదిలాబాద్‌ భీమ్‌పేట, కామారెడ్డి మధునూర్‌లో 2.6°C గా నమోదయ్యాయి.

వేసవికాలం: తెలంగాణ రాష్ట్రం అర్ధశుష్క శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది. మార్చి - మే మాసాల మధ్యకాలాన్ని వేసవి కాలం అంటారు. ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ సమయంలో క్యుములోనింబస్‌ మేఘాల వల్ల సంవహన వర్షపాతం ద్వారా తొలకరి జల్లులు కురుస్తాయి. రాష్ట్రంలో సూర్యుడి కిరణాలు నిటారుగా ప్రసరించడం వల్ల మే సగటు ఉష్ణోగ్రతలు 32°C ఉంటే, అత్యధిక ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటాయి. రాష్ట్రంలో అత్యధిక సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి జిల్ల్లా కొత్తగూడెం, భద్రాచలంలో 48°C గా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు 48.9°C మంచిర్యాల దండెపల్లి, జగిత్యాల ధర్మపురి, సూర్యాపేట చింతలపాలెం, జయశంకర్‌, ఘనపుర్‌-ములుగులలో గుర్తించారు.
వర్షాకాలం: దీన్నే నైరుతి రుతుపవన కాలం అంటారు. ఇది వేసవి కాలం చివర్లోనే ఆరంభమవుతుంది. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖ దాటగానే కొరియాలిస్‌ సూత్రం ఆధారంగా సవ్య దిశగా (కుడి వైపు) గాలి వీచడం వల్ల నైరుతి రుతుపవనాలకు ఆ పేరు వచ్చింది. ఈ కాలం తెలంగాణలో జూన్‌ మొదటి వారంలో ప్రారంభమై సెప్టెంబరు చివరి వరకూ వర్షం కురుస్తుంది. తెలంగాణలో అత్యధికంగా 80% నైరుతి రుతుపవనాల వల్లే వర్షాలు కురుస్తున్నాయి. 2019 ఐఎమ్‌డీ న్యూదిల్లీ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు వార్షిక వర్షపాతం 90.54 సెం.మీ. ఉంటే అత్యధిక వార్షిక వర్షపాతం ములుగులో 129.2 సెం.మీ., ఆదిలాబాద్‌ 119.8 సెం.మీ., కుమురం భీం 119.5 సెం.మీ.గా నమోదైంది. అత్యల్ప వర్షం జోగులాంబ 53.3 సెం.మీ., నారాయణపేట 56.1 సెం.మీ.గా రికార్డు అయ్యింది.

తుపాను కాలం: దీన్నే ఈశాన్య రుతుపవన కాలం అంటారు. ఈ కాలంలో పశ్చిమ సముద్ర వాయుగుండాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో తుపాను వర్షం కురుస్తుంది. అయితే తెలంగాణ ఖండాంతర్గత రాష్ట్రం కావడంతో సగటున 12.49 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరానికి సమీపంలోని ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, సూర్యాపేట ప్రాంతాల్లో అత్యధిక వర్షం నమోదైతే, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లిల్లో అత్యల్ప వర్షం 10 సెం.మీ. నమోదవుతుంది.


దక్కన్‌లో అత్యధిక లావా నేలలు

భూఉపరితల పలుచటి పొరలనే ‘హారిజన్‌ మట్టి పొరలు’ అంటారు. ఇవి 20-30 సెం.మీ. మందం ఉంటాయి. శీతోష్ణస్థితి, నీరు, శిలా శైథిల్యం వల్ల మృత్తికలు ఏర్పడతాయి. మృత్తికల అధ్యయనాన్ని ‘పెడాలజీ’ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో పురాతన ప్రి-కాంబ్రియన్‌ యుగంలో ఆర్కియన్‌ శిలలు, అగ్నిపర్వత ప్రక్రియ ద్వారా లావాపైకి ఉబికి వచ్చి, రూపాంతరం చెంది దక్కన్‌ ప్రాంతంలో పెద్దమొత్తంలో ఈ నేలలు ఏర్పడ్డాయి. న్యూదిల్లీలోని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌’ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మృత్తికలను వర్గీకరించింది.అవి 1) రెడ్‌లోమ్‌సాండ్‌ - దుబ్బ నేలలు 2) రెడ్‌సాండ్‌లోమ్‌ - చల్క నేలలు 3). లేటరైట్‌ నేలలు 4) గాదా - మాధ్యమిక నల్లరేగడి 5) లోతైన నల్లరేగడి 6. లవణ ప్రభావిత నేలలు 7. ఒండ్రు నేలలు ప్రధానంగా తెలంగాణలో మృత్తికలు శాతం పరిశీలిస్తే ఎర్రనేలలు - 64% నల్ల రేగడి - 26% నల్ల-ఎర్రమిక్స్‌డ్‌ నేలలు - 7% లేటరైట్‌ నేలలు - 2% ఇతర-ఒండ్రునేలలు - 1% ఉన్నాయి రాష్ట్రంలో ఎర్రనేలలు కరీంనగర్‌ జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని