మీపై మీకుందా నమ్మకం?

సమర్థులైన, ఉత్సాహవంతులైన యువతను ఉద్యోగులుగా ఎంపిక చేసుకునే క్రమంలో యాజమాన్యాలు ఇతర లక్షణాలు, నైపుణ్యాలతో పాటు వారి ధీమా స్థాయిని పరిశీలిస్తాయి. అందుకే విద్యార్ధి దశలో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాదులు వేసుకోవటం చాలా అవసరం. అందుకు ఏ మెలకువలు పాటించాలో చూద్దాం!

Updated : 09 Jun 2022 01:35 IST

సమర్థులైన, ఉత్సాహవంతులైన యువతను ఉద్యోగులుగా ఎంపిక చేసుకునే క్రమంలో యాజమాన్యాలు ఇతర లక్షణాలు, నైపుణ్యాలతో పాటు వారి ధీమా స్థాయిని పరిశీలిస్తాయి. అందుకే విద్యార్ధి దశలో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాదులు వేసుకోవటం చాలా అవసరం. అందుకు ఏ మెలకువలు పాటించాలో చూద్దాం!

పుస్తక పరిజ్ఞానంతో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థి కొన్నిసార్లు క్షేత్ర స్థాయి విధుల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలను పరిష్కరించలేకపోవచ్ఛు అకడమిక్‌ సామర్థ్యాలకతీతంగా ఆత్మవిశ్వాసంతో సమస్యలను పరిష్కరించే వీలుంటుంది. మనో ధైర్యం, ప్రతికూల పరిస్థితుల్లో కుంగుబాటుకు లోనవకుండా పరిస్థితులను సమర్థంగా నిర్వహించగలిగిన ఆత్మవిశ్వాసం ఉన్న అభ్యర్థులకే నియామకాల్లో పెద్దపీట వేస్తారు!

కళాశాల జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థికి తన స్కూల్‌ వాతావరణంతో పోలిస్తే ఈ వాతావరణం ఎంతో తేడా కనిపిస్తుంది. విద్యాపరమైన సవాళ్ళు ఎదురవుతాయి. కొత్త జీవితంలో ఇమడడానికీ, కొత్త సవాళ్ళను స్వీకరించడానికీ ఆత్మవిశ్వాసం అవసరం. కళాశాల జీవితమంటేనే కొత్త వ్యక్తులను కలవడం, కొత్త సవాళ్ళను స్వీకరించడం, కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడం. ఇది భవిష్యత్తులో ఉద్యోగ జీవితంలోనూ ఉపకరిస్తుంది.

సానుకూల దృక్పథంతో ఆలోచించడం

ప్రతి అంశాన్నీ సానుకూలంగా ఆలోచించడం, ప్రతి చర్యలోనూ ప్రతికూలతలను దరిచేరనీయకపోవడం అవసరం. మీపై మీకు నమ్మక స్థాయి తగ్గితే ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. నమ్మకమే ఆత్మవిశ్వాసానికి మూలం.

మీకు మీరే పోటీ

మీరు టాపర్‌గా ఉన్నారు, ఉత్తమ పర్ఫార్మర్‌ అయినప్పటికీ ఎవరితోనూ పోల్చుకోవద్ధు మీరు మరింత ఉత్తమంగా, నాణ్యతతో కృషి చేయడానికి అవసరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించండి. మీకు ఇతరులెవరో కాకుండా మీకు మీరే పోటీగా భావించండి. విద్యా, విద్యేతర అంశాల్లో మరింత శక్తిమంతంగా తయారయ్యేందుకు ప్రయత్నించండి.

నిర్మాణాత్మక విమర్శలు

మీ సామర్థ్యాన్ని ఇతరులు విమర్శించినా ఆయా అంశాలను నిర్మాణాత్మకంగా స్వీకరించండి. వ్యక్తులను కాకుండా ఆయా అంశాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని విమర్శలను స్వీకరించండి. ఇది మనుగడతో పాటు అభివృద్ధికీ కీలకమైన అంశం.వృత్తినైెపుణ్యం పెంచుకునే మార్గాలు అనుసరించడం, మీ శక్తిసామర్థ్యాలపై నమ్మకం పెంచుకోవడం వల్ల కెరియర్‌లో అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి. అయితే ఆత్మవిశ్వాసం అతివిశ్వాసమయితే అహంకారానికి దారితీయవచ్ఛు అది రాకుండా జాగ్రత్త పడాలి.

బలాలను బలపరచండి

మీ బలాలను గుర్తించి వాటిపై దృష్టి కేంద్రీకరించండి. మీ దైనందిన కార్యక్రమాల్లో, ఇతర కార్యకలాపాల్లో గమనించిన మీ బలాలను క్రోడీకరించి వాటిని మీ లక్ష్య సాధనకు అనుసంధానం చేయండి. అలా చేయడం ఒక మంచి నైపుణ్యం.

లక్ష్య సాధనకు ఎదురయ్యే అవరోధాలను తగ్గించుకోండి. అంటే బలాలను బలపరచడం, బలహీనతలను బలహీనపరచడం. మీ బలాల ఆధారంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

అభినందనల మననం

నిత్యజీవితంలోనూ, విధుల నిర్వహణలోనూ మీరు సాధించే చిన్న చిన్న విజయాలను పరిశీలించండి. చేయవలసిన పనులు, చేయకూడని పనులను ప్రాధాన్య క్రమంలో రాయండి. జాబితాలోని పనులు పూర్తి అవుతుంటే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. మిమ్మల్నీ, మీ విజయాలనూ ఇతరులు అభినందించిన సందర్భాలనూ, అభినందనలకు కారణమైన అంశాలనూ ఒకచోట రాసుకోండి. వాటిని మననం చేసుకున్నా, అవసరాన్ని బట్టి సమీక్షించుకున్నా మీలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి.

గుర్తుంచుకోండి

* వృత్తి నెపుణ్యాలు పెంచుకునేందుకు అవసరమైన శిక్షణ తరగతులకు హాజరవ్వండి.

* స్వల్పకాలిక,, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయండి.

* నమ్మకంగా ఉన్న సహచరులను ఎంచుకోండి. వారి సలహాలు అడగండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని