తెలంగాణపై షట్‌ సూత్ర చక్రవ్యూహం!

విద్య, ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య తలెత్తిన తీవ్ర విభేదాలను పరిష్కరించేందుకు ఆనాటి నాయకులు ఆరు సూత్రాలను ప్రతిపాదించి అమలు చేశారు. వాటితో తెలంగాణకు అంతకు ముందున్న రక్షణలు హరించుకుపోయాయి.  

Published : 03 Jul 2022 02:32 IST

తెలంగాణ ఉద్యమం  రాష్ట్ర ఆవిర్భావం

విద్య, ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య తలెత్తిన తీవ్ర విభేదాలను పరిష్కరించేందుకు ఆనాటి నాయకులు ఆరు సూత్రాలను ప్రతిపాదించి అమలు చేశారు. వాటితో తెలంగాణకు అంతకు ముందున్న రక్షణలు హరించుకుపోయాయి.  

ఆరు సూత్రాలు

తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమని, అవి చెల్లుబాటవుతాయని 1972, అక్టోబరు 3న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ఫలితంగా ఎగిసిపడిన జై ఆంధ్రా ఉద్యమానికి ముగింపు పలకడానికి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇరుప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకుల అభిమతానికి వ్యతిరేకంగా 1973, సెప్టెంబరు 21న ఆరు సూత్రాల పథకాన్ని (షట్‌ సూత్ర పథకం) ప్రకటించారు. అది ఆంధ్రా ప్రాంత ప్రజలకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని పెద్ద ఎత్తున  విమర్శలు వెల్లువెత్తాయి. 1956 పెద్దమనుషుల ఒప్పందం కల్పించిన రక్షణలన్నీ ఈ ఆరు సూత్రాలతో ఉల్లంఘనకు గురై తెలంగాణకు అన్యాయం జరిగిందనే భావన బలంగా ముందుకొచ్చింది.

వివరంగా..!

ప్రతిపాదించిన ఆరు సూత్రాల అమలులో భాగంగా పలు రకాల చర్యలు చేపట్టాలని నాటి నాయకులు నిర్ణయించారు.

1. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి నిర్దిష్టమైన వనరులను కేటాయించడం.

దీని కోసం ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో అభివృద్ధి పథకాలను రూపొందించాలి. వాటి అమలును పర్యవేక్షించడానికి నిపుణులకు సముచిత స్థానం కల్పించి రాష్ట్ర అభివృద్ధి వ్యూహాల్లో భాగస్వాములను చేయాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలి.

2. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వడం.

విద్యా సదుపాయాల విస్తరణ లక్ష్యంగా సమగ్ర విద్యా    విధానాన్ని అమలు చేయాలి. హైదరాబాదులో కేంద్రీయ విశ్వ విద్యాలయం స్థాపించాలి.

3. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నిర్దిష్ట స్థాయి మేరకు ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వడం.

ముఖ్యంగా నాన్‌ గెజిటెడ్‌ స్థాయి ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలు, తహసీల్దార్‌, జూనియర్‌ ఇంజినీర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలు (అవి గెజిటెడ్‌ అయినప్పటికీ) స్థానికులకే ప్రాధాన్యం కల్పించాలి. అయితే వాటిని ప్రథమ, ద్వితీయ స్థాయి గెజిటెడ్‌ పోస్టులుగా వర్గీకరించాలి.

మినహాయింపులు: రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు, హైదరాబాద్‌ పోలీసు విభాగాల్లో స్థానిక ప్రాధాన్యం లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ సమాన అవకాశాలు కల్పించారు. దాంతో అంతకుముందు రాష్ట్ర సచివాలయంలో ప్రతి మూడు పోస్టుల్లో రెండో పోస్టు తెలంగాణ వారికే కేటాయించాలనే నిబంధన రద్దయ్యింది.

4. ఉద్యోగ నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకించి ఒక ఉన్నత పరిపాలనా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడం.

ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులుగా అమలు చేయాలి. ఈ ట్రైబ్యునల్‌్ పరిమితంగా హైకోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు మాత్రమే పరిమితమై ఉంటుంది.

5. పై నాలుగు సూత్రాలకు రాజ్యాంగబద్ధత కల్పించడానికి రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించడం.

పైన చెప్పిన నాలుగు సూత్రాల అమలుకు సంబంధించి ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు తలెత్తకుండా చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు కల్పించి, తదనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలి (ఆ మేరకు తర్వాత 32వ రాజ్యాంగ సవరణ చట్టం-1973 రూపొందించారు).

6. ముల్కీ నియమాలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయడం.

పైన పేర్కొన్న అయిదు సూత్రాలను అమలు చేయడం వల్ల ముల్కీ నియమాలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీల అవసరం ఉండదు కాబట్టి వాటిని రద్దు చేయాలి.


అవేమిటంటే?

* రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి.

* విద్యా సదుపాయాల విస్తరణ, స్థానికులకు ప్రాధాన్యం.

* ఉద్యోగాల్లో ఒక స్థాయి వరకు స్థానికులకు ప్రాధాన్యం (రాష్ట్ర స్థాయి, రాజధాని ఉద్యోగాలు మినహాయించి).

* ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల వివాదాల పరిష్కారానికి ఒక పరిపాలన ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడం.

* పై నాలుగు సూత్రాలకు రాజ్యాంగబద్ధత కల్పించడానికి రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించడం.

* ముల్కీ నియమాలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయడం.


నాయకుల ఆమోదం

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ ఆరు సూత్రాల పథకంపై  తెలంగాణ ప్రాంతం నుంచి పీవీ నరసింహారావు, కోదాటి రాజమల్లు, జలగం వెంగళరావు, జి. వెంకటస్వామి, జె. చొక్కారావు, ఎస్‌.జైపాల్‌ రెడ్డి, వి.వి. రాజు సంతకాలు చేశారు. వీరంతా ఇందిరాగాంధీ అనుచరులు. ఆంధ్ర నుంచి బి.వి. సుబ్బారెడ్డి, కె. రఘురామయ్య, పి. వెంకట సుబ్బయ్య తదితరులు సంతకాలు చేశారు.

ఆరు సూత్రాల పథకం తెలంగాణ ప్రజల ప్రయోజనాలన్నింటినీ హరించి వేసిందని ప్రత్యేక తెలంగాణ ఫోరం తరఫున నాటి పార్లమెంటు సభ్యుడు జి.ఎస్‌. మెల్కోటే తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణలోని అన్ని ఉద్యోగ, విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ పథకాన్ని ప్రకటించిన మరుసటి రోజు (సెప్టెంబరు 22)  ప్రధాని ఇందిరా గాంధీని మర్రి చెన్నారెడ్డి కలిసి రాష్ట్ర విభజన ఒక్కటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమస్యకు పరిష్కారమని పునరుద్ఘాటించారు.

ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగబద్ధత కల్పించి, దాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1973ను రూపొందించారు. దీని ప్రధాన లక్ష్యం నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సమాన అవకాశాలు, సౌకర్యాలను కల్పించడం.

32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 371(D), 371(E) అనే ఆర్టికల్స్‌ చేర్చారు. 371(D)(3) ప్రకారం రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ను, 371(E) ను అనుసరించి హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

371(D) ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని ఉల్లంఘనలు చట్టబద్ధత పొందాయి. రాజ్యాంగ సవరణ అమలుకు పూర్వం జరిగిన నియామకాలన్నీ సక్రమమయ్యాయి. అప్పటి వరకు అమల్లో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు నిలిచిపోయింది.

ఆ తీర్పు ద్వారా చట్ట వ్యతిరేకమైనవిగా అప్పటి వరకు భావించిన నియామకాలన్నీ ఆరు సూత్రాల అమలుతో చట్టబద్ధమయ్యాయి. ముల్కీ నిబంధనలూ రద్దయ్యాయి.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అధ్యయనంలో మొదటి ప్రాధాన్యం రక్షణరంగ సాంకేతికతకు ఇస్తే మంచిది. ఇందులో మన దేశం రూపొందించిన క్షిపణులు, యుద్ధట్యాంకులు, రాడార్‌ వ్యవస్థలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు తదితరాలను చదవాలి. వాటికి సంబంధించిన తాజా అంశాలనూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని