సైన్స్‌లో బోధనకు.. పరిశోధనకు!

దేశవ్యాప్తంగా సైన్స్‌, దానికి సమానమైన కోర్సులకు సంబంధించి జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, లెక్చరర్‌షిప్‌ అర్హతలకు నిర్వహించే పరీక్ష సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌. దీని ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలో ఉన్న ప్రయోగశాల్లో గానీ, ప్రసిద్ధ యూనివర్సిటీల్లో గానీ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్ఛు లెక్చరర్‌ షిప్‌ అర్హత పొందితే విశ్వవిద్యాలయాల్లో లేదా డిగ్రీ కాలేజీల్లో, యూజీసీ గుర్తింపు ...

Updated : 22 Jan 2024 18:28 IST

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ప్రకటన విడుదల

దేశవ్యాప్తంగా సైన్స్‌, దానికి సమానమైన కోర్సులకు సంబంధించి జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, లెక్చరర్‌షిప్‌ అర్హతలకు నిర్వహించే పరీక్ష సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌. దీని ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలో ఉన్న ప్రయోగశాల్లో గానీ, ప్రసిద్ధ యూనివర్సిటీల్లో గానీ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్ఛు లెక్చరర్‌ షిప్‌ అర్హత పొందితే విశ్వవిద్యాలయాల్లో లేదా డిగ్రీ కాలేజీల్లో, యూజీసీ గుర్తింపు పొందిన సంస్థల్లో అధ్యాపకులుగా చేరవచ్చు.

నదేశంలో శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక మానవ వనరులను అభివృద్ధి చేస్తున్న అతిపెద్ద సంస్థ సీఎస్‌ఐఆర్‌. బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌, ఇతర బేసిక్‌ సైన్స్‌ అభివృద్ధి చెందటానికి కృషి చేస్తున్న సంస్థ ఇది. దీని కోసం ఎన్‌టీఏ సంస్థ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ స్ట్రీమ్‌లో అయిదు సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహిస్త్తోంది.

1. కెమికల్‌ సైన్సెస్‌, 2. ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌, ప్లానెటరీ సైన్సెస్‌, 3. లైఫ్‌ సైన్సెస్‌, 4. మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, 5. ఫిజికల్‌ సైన్సెస్‌

ఎవరు అర్హులు?

ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ లేదా బీటెక్‌ లేదా బి.ఫార్మసీ లేదా ఎంబీబీఎస్‌ మొదలైన కోర్సుల్లో 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్‌, ఓబీసీ విద్యార్థులు ( 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్‌.సి., ఎస్‌.టి., పి.హెచ్‌. అభ్యర్థులు) ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ అర్హులే.

జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించడానికి జనరల్‌ కేటగిరి విద్యార్థులకు గరిష్ఠ వయః పరిమితి 28 సంవత్సరాలు (ఎస్‌.సి., ఎస్‌.టి., పి.హెచ్‌., మహిళా విద్యార్థులకు 5 సంవత్సరాలూ, నాన్‌ క్రీమీలేయర్‌ ఓబీసీ విద్యార్థులకు 3 సంవత్సరాలూ వయసు సడలింపు ఉంటుంది).

లెక్చరర్‌షిప్‌కు గరిష్ఠ వయసు పరిమితి లేదు.

జేఆర్‌ఎఫ్‌కి ఎంపికై పరిశోధన చేసే అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాలు ప్రతి నెలా రూ. 31,000 చొప్పున స్టైపెండ్‌ ఇస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం రూ. 20,000 చొప్పున అభ్యర్థి పరిశోధన చేసే సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి కంటింజెంట్‌ గ్రాంటుగా అందిస్తారు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఎఫ్‌ అర్హత సాధిస్తే ప్రతి నెలా రూ. 35,000 చొప్పున స్టైపెండ్‌ లభిస్తుంది.

పరీక్ష విధానం?

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌లో అన్ని ప్రశ్నలూ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. గరిష్ఠ మార్కులు 200. కాలవ్యవధి 3 గంటలు. పరీక్షలో మూడు విభాగాలుంటాయి.

పార్ట్‌- ఎ: అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌తో కూడిన లాజికల్‌ రీజనింగ్‌, గ్రాఫికల్‌ ఎనాలిసిస్‌, ఎనలిటికల్‌- న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్‌, సిరీస్‌ ఫార్మేషన్‌, పజిల్స్‌ మొదలైనవాటికి సంబంధించిన 20 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. మొత్తం 30 మార్కులను కేటాయించారు.

పార్ట్‌- బి: ఈ విభాగంలో సంబంధిత సబ్జెక్టు నుంచి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. 20- 35 ప్రశ్నలు అడగవచ్ఛు 70 మార్కులు కేటాయించారు.

ఈ విభాగంలో బెసిక్‌ కాన్సెప్ట్స్‌, డిగ్రీ సిలబస్‌ నుంచి కొన్ని ప్రశ్నలను అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన డిగ్రీ సిలబస్‌ను క్షుణ్ణంగా చదవాలి.

పార్ట్‌- సి: ఈ విభాగంలో అభ్యర్థుల సైంటిఫిక్‌ కాన్సెప్ట్‌ల అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాలను పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కుల్లో దీనికి 100 మార్కులు కేటాయించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ సిలబస్‌ను అనువర్తన కోణంలో చదివితే ఉపయోగం ఉంటుంది. సిలబస్‌లో కొన్ని ముఖ్యమైన 10- 15 టాపిక్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అధిక వెయిటేజీ ఉన్న ఈ విభాగం సిలబస్‌ ప్రకారం ప్రామాణిక రిఫరెన్స్‌ పుస్తకాలు, రిసెర్చి జర్నళ్లను అనువర్తన ధోరణిలో చదవాలి.

నెగిటివ్‌ మార్కులున్నాయి. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలి. నెట్‌ పరీక్షను గత డిసెంబర్‌ నుంచీ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు ఎన్‌టీఏ కొన్ని ఆన్‌లైన్‌ ఉచిత మోడల్‌ పరీక్షలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఎలా సిద్ధం కావాలి?

కెమికల్‌ సైన్స్‌స్‌: ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎస్‌మెట్రిక్‌ సింథసిస్‌, కన్ఫ్‌ర్‌మేషనల్‌ అనాలిసిస్‌, ఆర్గానిక్‌ స్పైక్ట్రోస్కోపి,, రియేజెంట్స్‌, పెరిసైక్లిక్‌ చర్యలు, కాంతి రసాయన శాస్త్రం తదితర అంశాలు; ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, బయోఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెడల్‌ క్లస్టర్స్‌; ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, సాలిడ్‌స్టేట్‌, మాలిక్యులార్‌ స్పైక్ట్రోస్కోపి, స్టాటిస్టికల్‌ థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కైనెటిక్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ మొదలైన అంశాలను బాగా చదవాలి. సిలబస్‌ పరిధిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెస్సీలో చదవని కెమిస్ట్రీ విభాగాల్లోని ముఖ్యమైన టాపిక్‌లను అధ్యయనం చేయాలి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ముగింపు: ఏప్రిల్‌ 15, 2020

పరీక్ష తేదీ: జూన్‌ 21, 2020

https://csirnet.nta.nic.in

లైఫ్‌ సైన్సెస్‌: ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ జువాలజీ చేసి లైఫ్‌ సైన్స్‌ విభాగంలో ఈ పరీక్ష రాసే విద్యార్థులు ఆధునిక బయాలజీ (మాలిక్యులర్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్‌, బయోఫిజిక్స్‌, స్పైక్ట్రోస్కోపి)లపై దృష్టి కేంద్రీకరించాలి.

ఆధునిక బయాలజీలో పీజీ చేస్తే ఆప్షనల్‌తో పాటు క్లాసికల్‌ బయాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఇకాలజీ, ఎవల్యూషన్‌, బయోడైవర్సిటీ మొదలైనవాటినీ చదవాలి.

ఫిజికల్‌ సైన్సెస్‌: మోడరన్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ అండ్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌, (క్లాసికల్‌ & స్టాటిస్టికల్‌), ఎలక్ట్రోమాగ్నిటిక్‌ థియఫఫరీ, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మెథడ్స్‌, ఆప్టిక్స్‌, మెకానిక్స్‌ సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.

మ్యాథమేటికల్‌ సైన్సెస్‌: స్టాటిస్టిక్స్‌, ఎక్స్‌పోలేటరీ డేటా ఎనాలిసిస్‌, కాంప్లెక్స్‌- డిఫరెన్షియల్‌ ఎనాలిసిస్‌, మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, వెక్టర్‌, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలను ప్రధానంగా చదవాలి.

ఒకవేళ జేఆర్‌ఎఫ్‌ రాకపోయినప్పటికీ ప్రిపరేషన్‌ వృథా కాదు. అదే సిలబస్‌, సన్నద్ధత ఇతర పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఐఐఎస్సీ, ఐఐటీ, టీఐఎఫ్‌ఆర్‌, జేఎన్‌సీఎస్‌ఐఆర్‌, బార్క్‌, హెచ్‌సీయూ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, ఏపీ సెట్‌, టీఎస్‌ సెట్‌, డీఎల్‌, పేటెంట్‌ ఆఫీసర్‌, జెన్‌కో, డీఆర్‌డీవో, ఎన్‌ఎఫ్‌ఎల్‌, యూపీఎస్సీ, జెస్ట్‌, వివిధ యూనివర్సిటీల పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ల్లో, ఇంటర్వ్యూలకు మంచి ఫలితాలు సాధించడానికి ఈ ప్రిపరేషన్‌ సాయపడుతుంది.

- ఎస్‌.కిరణ్‌ కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని