మినహాయింపు ఇస్తారా?

ఇంటర్‌ చదవకుండా అధ్యాపక వృత్తికి అర్హత ఉండదని ఓ జీఓ గురించి మీరు ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

Published : 28 Mar 2016 02:20 IST

మినహాయింపు ఇస్తారా?

ఇంటర్‌ చదవకుండా అధ్యాపక వృత్తికి అర్హత ఉండదని ఓ జీఓ గురించి మీరు ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఏపీ సెట్‌/యూజీసీ నెట్‌లో అర్హత సాధించినవారికి ఇందులో మినహాయింపు ఇస్తారా? లేదా ఇప్పుడు దూరవిద్యలో ఇంటర్‌ పూర్తిచేయొచ్చా? అర్హత లేనట్లయితే సెట్‌, నెట్‌ రాసేందుకు అర్హత కల్పించి లెక్చరర్‌షిప్‌కు అర్హత ఉందంటూ సర్టిఫికెట్‌ ఇవ్వకూడదు కదా?

- సీహెచ్‌. శ్రీనివాస్‌

ఉపాధ్యాయ/అధ్యాపక/మరో ఉద్యోగ నియామకాలకైనా విద్యార్హతలు ఉద్యోగ ప్రకటనలో ఇచ్చిన ప్రకారమే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా కోర్టు తీర్పులను బట్టి, గత ఉద్యోగ నియామకాల్లో ఎదురైన సమస్యలను బట్టి ఎప్పటికప్పుడు సవరిస్తుంటారు. 2008లో ఉమ్మడి రాష్ట్రపు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యాపక ఉద్యోగ ప్రకటనలో పీజీలో మార్కుల శాతం, నెట్‌/సెట్‌ల ప్రస్తావన మాత్రమే ఉంది. దానికి అనుగుణంగానే నియామకాలు చేపట్టారు.

2010 యూజీసీ నియమావళి ప్రకారం ‘గుడ్‌ ఎడ్యుకేషన్‌ రికాం్డ’ అనే నిబంధనను చేర్చారు. అయితే దీన్ని వివిధ విశ్వవిద్యాలయాలు/ నియామక సంస్థలు వివిధ రకాలుగా నిర్వచిస్తున్నాయి. ఆమేరకు యూజీసీ కూడా వెసులుబాటు కల్పించింది.

దూరవిద్య ద్వారా డిగ్రీలు పొందినవారు రెండు కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేకుండా ఓపెన్‌ వర్సిటీ ద్వారా నేరుగా చేసిన పీజీ డిగ్రీ చెల్లదు. ఇటీవల వచ్చిన మద్రాస్‌ హైకోర్టు తీర్పు ప్రకారం- 10+2 చదవకుండా పొందిన డిగ్రీలు కూడా రెగ్యులర్‌ డిగ్రీలకు సమానం. అయితే ఆ డిగ్రీ చేయటానికి యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైవుండి ఆ ప్రవేశపరీక్ష రాసే సమయానికి అభ్యర్థికి 21 సంవత్సరాలు నిండివుండాలి. దూరవిద్య ద్వారా అందించే ప్రతి కోర్సూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌/డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతి పొందడం తప్పనిసరి.

మీరు డిగ్రీని పైవిధంగా పొందివుంటే, ఉద్యోగ ప్రకటనలో 10+2+3 నిబంధన లేకపోతే, నిరభ్యంతరంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఒకవేళ ఆ నిబంధన ఉంటే మాత్రం నెట్‌/సెట్‌లు ఉన్నా గానీ ఎలాంటి మినహాయింపు ఉండదు.

నెట్‌/సెట్‌ ధ్రువపత్రాల్లో ఒక గమనిక ఉంటుంది. అదేమిటంటే... ఈ ధ్రువపత్రాన్ని అభ్యర్థి దరఖాస్తులో రాసిన విషయాలకు లోబడి ఇచ్చాం కానీ వాటి నిర్థారణ చేసుకునే బాధ్యత ఉద్యోగ నియామక సంస్థలదేనని. ఇప్పుడు మీరు ఇంటర్‌ చదవాలనుకుంటే నిరభ్యంతరంగా చదవొచ్చు. కానీ దాన్ని అంగీకరించాలా లేదా అనే విషయంలో తుది నిర్ణయం మాత్రం ఉద్యోగ నియామక సంస్థలదే. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే నోటిఫికేషన్ల కోసం ఇప్పటినుంచే సిద్ధపడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని