సర్టిఫికెట్ల నమోదు తప్పనిసరా?

ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజిలో సర్టిఫికెట్లను నమోదు చేయించాలని అంటుంటారు కదా? అలా చేయడం ఉద్యోగార్థులకు తప్పనిసరేనా? నమోదు చేయకపోతే సమస్యలు వస్తాయా?

Published : 16 May 2016 01:53 IST

సర్టిఫికెట్ల నమోదు తప్పనిసరా?

ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజిలో సర్టిఫికెట్లను నమోదు చేయించాలని అంటుంటారు కదా? అలా చేయడం ఉద్యోగార్థులకు తప్పనిసరేనా? నమోదు చేయకపోతే సమస్యలు వస్తాయా?

- ఎ. సుబ్రహ్మణ్యం, రాజంపేట

విద్యార్హత సర్టిఫికెట్లను ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజిలో నమోదు చేయించడం వల్ల నిరుద్యోగుల వివరాలు ప్రభుత్వానికి తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నమోదు చేయకపోతే ప్రభుత్వం దగ్గర గణాంకాలుండవు. ఈ నమోదు వల్ల ప్రభుత్వానికి భవిష్యత్తులో ఉద్యోగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికీ, పాలసీలు తయారుచేయడానికీ అనుకూలంగా ఉంటుంది.

ఇంతకుముందు అయితే కొన్నికొన్ని ఉద్యోగాలు ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజి ద్వారానే భర్తీ చేయాలనే నిబంధన ఉండేది. కాలక్రమేణా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు ఇంటర్వ్యూలు, పరీక్షలు నిర్వహించి నేరుగా కొలువులు భర్తీ చేస్తున్నారు. ఏదిఏమైనా మీ విద్యార్హతలను నమోదు చేయించుకోవటం మీకు మంచిది; ముందు తరాలకు కూడా మంచిది. ప్రభుత్వం దగ్గర స్పష్టమైన గణాంకాలు ఉండటం వల్ల ఉపాధి కల్పనకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.



ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ (బీఎస్‌సీ) వరకూ కరీంనగర్‌ జిల్లాలోనే చదివాను. ఉద్యోగరీత్యా తమిళనాడులోని సేలంలో ఉంటున్నా. పెరియార్‌ యూనివర్సిటీలో దూరవిద్యలో ఎంఎస్‌సీ (బోటనీ) చదువుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సెట్‌, జేఎల్‌ ఉద్యోగాలకు అర్హుడనవుతానా?

- కె. శ్రావణ్‌కుమార్‌, ధర్మారం

మీరు ఎంఎస్‌సీ ఇతర రాష్ట్రంలో చదివినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) రాయడానికి అర్హులే. కానీ ఉద్యోగ విషయానికొచ్చేసరికి లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణంగా నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఏ రాష్ట్రంలో అయితే చదువుతారో ఆ రాష్ట్రానికి లోకల్‌గా పరిగణిస్తారు. మీరు ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకూ కరీంనగర్‌ జిల్లాలోనే చదివారు కాబట్టి జేఎల్‌ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.

సెట్‌ను ఎవరైనా, ఎక్కడైనా రాసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో అయితే నెట్‌ రాసి అర్హత సాధిస్తారో ఆ రాష్ట్రంలోని ఉద్యోగాలకు మాత్రమే అర్హులవుతారు. సెట్‌లో అర్హత సాధించడం వల్ల జూనియర్‌ లెక్చరర్‌ నుంచి డీఎల్‌గా పదోన్నతి పొందడానికి అవకాశం ఉంటుంది.



డిగ్రీ (2013-2016) ఫైనలియర్‌ రెగ్యులర్‌గా చదువుతున్నాను. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి డి.ఇడి (టీటీసీ)లో మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరాను. ఇలా ఒకే విద్యాసంవత్సరంలో రెండు రెగ్యులర్‌ కోర్సులు చేయవచ్చునా? తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా?

- ఓ పాఠకుడు, అనంతపురం

సాధారణంగా రెండు రెగ్యులర్‌ కోర్సులను ఒకే విద్యాసంవత్సరంలో చదవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఇలా చదివినప్పటికీ భవిష్యత్తులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులుండవచ్చు. రెండు కోర్సులను రెగ్యులర్‌గా ఒకేసారి చేయడం వల్ల సాధారణంగా ఒక సర్టిఫికెట్టును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఒక కోర్సు పూర్తయిన తర్వాత మరొక కోర్సును చదవటం ఉత్తమం. రెండు కోర్సులను ఒకేసారి చదవడం వల్ల ఏ కోర్సును కూడా సరిగా అధ్యయనం చేయలేకపోవడం, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవడం.. ఇవన్నీ సమస్యలే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని