ఐదో తరగతి చదవకపోతే...

నాలుగోతరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ముంబయికి వలస వెళ్లి, అక్కడ ఆరు నుంచి పదివరకు చదివాను. నా సందేహం ఏంటంటే...

Published : 13 Jun 2016 01:13 IST

ఐదో తరగతి చదవకపోతే...ప్రభుత్వోద్యోగం రాదా?

ప్ర: నాలుగోతరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ముంబయికి వలస వెళ్లి, అక్కడ ఆరు నుంచి పదివరకు చదివాను. నా సందేహం ఏంటంటే ఐదో తరగతి చదవలేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిని కాకపోయే అవకాశం ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లోకల్‌ అని ఏ నిబంధన ప్రకారం నిర్ణయిస్తారు?

- క్రాంతికుమార్‌, బోధన్‌

జ: నాలుగోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన మీరు ఐదో తరగతి చదవకుండా 6 నుంచి 10 వరకు ముంబయిలో చదివారు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు (దాదాపు ఏడు సంవత్సరాలపాటు) ఏ ప్రాంతంలో చదువుతారో వారిని ఆ ప్రాంతానికి చెందినవారిగా (లోకల్‌) పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఇదే నిబంధన వర్తిస్తుంది.

ఐదో తరగతి చదవకపోవడం వల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకపోవడం అనేది ఏమీ ఉండదు. సాధారంణంగా పాఠశాలలో చదువుతున్నప్పుడు కొంతమంది ఒకటి రెండు తరగతులు దాటేసి చదువుతూ ఉంటారు. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఎలాంటి ప్రభావమూ ఉండదు. కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.

లోకల్‌, నాన్‌లోకల్‌ విషయానికి వస్తే ఉద్యోగరీత్యా బదిలీ అయ్యేవారి పిల్లలు ఆ ప్రాంతాల్లోనే చదువుతుండటం చాలాచోట్ల జరుగుతుంది. ఎక్కువకాలం చదివిన ప్రాంతానికి వారిని లోకల్‌గా పరిగణిస్తారు.


ప్ర: ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివినవారు తమ ఉద్దేశం మార్చుకుని, మెడికల్‌ వైపు వెళ్లాలనుకుంటే ఏం చేయాలి? ఎంపీసీ చదివినా వైద్యవిద్యలో ప్రవేశం కల్పించే వెసులుబాటు దేశంలో ఏ విద్యా సంస్థలోనైనా ఉందా?

- టి. రమణి, సామర్లకోట

జ: ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ (మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) చదివినవారికి మెడికల్‌ కోర్సులు చేయడానికి అర్హత ఉండదు. వైద్యవిద్యను అభ్యసించడానికి ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివివుండాలి.

ఎంపీసీ అనేది నాన్‌మెడికల్‌ కోర్సులు చేయడానికి ఉపయోగపడుతుంది. మెడికల్‌ కోర్సులు చదవడానికి జీవశాస్త్రం (బయాలజీ) తప్పనిసరి సబ్జెక్టు. ఇతర దేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలన్నా ప్లస్‌ టూ (ఇంటర్మీడియట్‌)లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (తప్పనిసరి), ఇంగ్లిష్‌ సబ్జెక్టులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాలల్లో చదివి ఉండాలి.

ఒకవేళ ఎంపీసీ చదివి మెడికల్‌వైపు వెళ్లాలనుకుంటే మాత్రం మళ్లీ బైపీసీ చదివి, వైద్యవిద్యను అభ్యసించవచ్చు. ఎందుకంటే బైపీసీ చదవడంవల్ల వైద్యవిద్యకు కావలసిన మౌలికాంశాలను నేర్చుకుంటారు కాబట్టి. బయాలజీ... మెడికల్‌ కోర్సులకు పునాది లాంటిది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని