ప్రైవేటుగా బీఎడ్‌ చేయొచ్చా?

డిగ్రీ అవగానే రైల్వే గ్రూప్‌-డిలో జాయినయ్యాను. నాకు టీచర్‌ అవ్వాలని కోరిక. దాంతో ప్రైవేటుగా బీఎడ్‌ చేసే అవకాశం ఉందా? ఉంటే ఆ కోర్సును అందించే...

Published : 20 Jun 2016 01:00 IST

ప్రైవేటుగా బీఎడ్‌ చేయొచ్చా?

ప్ర: డిగ్రీ అవగానే రైల్వే గ్రూప్‌-డిలో జాయినయ్యాను. నాకు టీచర్‌ అవ్వాలని కోరిక. దాంతో ప్రైవేటుగా బీఎడ్‌ చేసే అవకాశం ఉందా? ఉంటే ఆ కోర్సును అందించే విద్యాసంస్థలు వివరాలను తెలుపగలరు.

- శ్రీనివాస్‌

జ: టీచర్‌ అవ్వాలనే మీ కోరిక అభినందనీయం. ఒకప్పుడు ప్రైవేటుగా బీఎడ్‌ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఎన్‌.సి.టి.ఈ. (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) ఇప్పుడు దాన్ని పూర్తిగా నిషేధించింది. ఇంతకుముందు డిగ్రీ తర్వాత ఇగ్నో (ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ), డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ లాంటి వాటిలో ప్రయివేటుగా బీఈడీ చేయడానికి అవకాశం ఉండేది.

కానీ ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాల్లో బీఎడ్‌ చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో ఫుల్‌టైం టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇలాంటివారికే ప్రయివేటుగా బీఈడీ చేయడానికి అవకాశం ఉంది.

మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ విశ్వవిద్యాలయం లాంటి విద్యాసంస్థలు కూడా ప్రైవేటుగా బీఈడీ కోర్సును అందిస్తున్నాయి. కానీ రెండు సంవత్సరాలు పనిచేయడం మాత్రం తప్పనిసరి. కానీ మీకు బోధన అంటే ఆసక్తి ఉంది కాబట్టి రెగ్యులర్‌ బీఈడీ కోర్సు చేయడానికి ప్రయత్నించండి. దాని వల్ల మీరు టీచింగ్‌కి కావలసిన మెలకువలు, నైపుణ్యాలు, సబ్జెక్టు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.


ప్ర: ఇంటర్‌, డీఈడీ పూర్తి చేశాను. అలాగే దక్షిణ భారత హిందీ ప్రచారసభలో డిగ్రీ పూర్తి చేశాను. దీన్ని డిగ్రీ సర్టిఫికెట్‌గా పరిగణిస్తారా? నాకు ఏయే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి?

- కె. అనూష, పాలకొండ, శ్రీకాకుళం

జ: దక్షిణ భారత హిందీ ప్రచారసభలో డిగ్రీ పూర్తిచేశాను అని తెలిపారు. కానీ మీరు ఏ కోర్సు చేశారో రాయలేదు. సాధారణంగా దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారు ప్రాథమిక్‌, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక, రాష్ట్రభాష విశారద్‌, రాష్ట్రభాష ప్రావీణ్‌ లాంటి కోర్సులను అందిస్తున్నారు. వీటిని డిగ్రీగానే పరిగణించరు. ఇవి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు. వీటితోపాటు మూడు సంవత్సరాల బి.ఎ., రెండేళ్ల ఎం.ఎ. కోర్సును అందిస్తున్నారు. మీరు మూడు సంవత్సరాల కోర్సును పూర్తిచేసినట్లయితే అది డిగ్రీ సర్టిఫికెట్‌గా పరిగణిస్తారు. లేదంటే డిగ్రీ సర్టిఫికెట్‌గా గుర్తించరు. మీరు ఇంటర్‌ చదివి, డీఈడీ పూర్తి చేశారు కాబట్టి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ అవకాశాలుంటాయి. అంతేకాకుండా మీరు ఉన్నత చదువులు అభ్యసించాలనుకుంటే పి.జి. చేసి పీహెచ్‌డీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని