ఇంజినీరింగ్‌ తర్వాత ఎంఏ చేయొచ్చా?

నేను బీఈ చదివాను. ఎంఏ హిస్టరీ చదవడానికి వీలుందా? ఓపెన్‌ యూనివర్సిటీల్లో ఈ కోర్సు చేయడానికి అవకాశం ఉందా?

Published : 27 Jun 2016 01:30 IST

ఇంజినీరింగ్‌ తర్వాత ఎంఏ చేయొచ్చా?

నేను బీఈ చదివాను. ఎంఏ హిస్టరీ చదవడానికి వీలుందా? ఓపెన్‌ యూనివర్సిటీల్లో ఈ కోర్సు చేయడానికి అవకాశం ఉందా?

- ఎన్‌. రామచంద్ర, కదిరి, అనంతపురం

బీఈ బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో ఎంఏ హిస్టరీ చదవడానికి వీలుంది. ఇందుకు విద్యాసంస్థలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (న్యూదిల్లీ) మొదలైన విశ్వవిద్యాలయాలు ఏ బ్యాచిలర్‌ డిగ్రీతోనైనా ఎంఏ హిస్టరీ చదవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.మీరు దూరవిద్య ద్వారా ఎంఏ హిస్టరీ చదవడానికి కూడా అవకాశం ఉంది. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ) వంటివి దూరవిద్య ద్వారా ఎంఏ హిస్టరీ కోర్సును అందిస్తున్నాయి. కానీ మీరు ఎంచుకున్నది మీరు చదివిన బ్యాచిలర్‌ డిగ్రీకి భిన్నమైన కోర్సు. కాబట్టి ఈ కోర్సును దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడం మేలు. ఎందుకంటే మీరు నేరుగా చదవడం వల్ల సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఏదైనా అర్థం కాని అంశాలను అధ్యాపకులతో చర్చించే అవకాశం ఉంటుంది.



ఎంబీఏ పూర్తి చేశాను. ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేయాలని కోరిక. దీనికి ఏ కోర్సు అయినా చేయాల్సి ఉంటుందా? అలాంటిది ఉంటే వివరాలు తెలుపగలరు.

- రవి, ఖమ్మం.

బ్యాంకులో ఉద్యోగం చేయడానికి కనీస అర్హత- గుర్తింపు ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఏదైనా డిగ్రీని కల్గి ఉండటం. దానికోసం తప్పనిసరిగా ఏదైనా కోర్సు చేయాలనేది ఏమీ లేదు. మీరు బ్యాంకు ఉద్యోగంపై ఆసక్తితో ఉన్నారు కాబట్టి బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన అవగాహన పెంచుకోవడం కోసం ఏవైనా సర్టిఫికెట్‌ కోర్సులు చేయాలనుకుంటే చేయవచ్చు. ఈ రోజుల్లో దాదాపు చాలా బ్యాంకులు ఐబీపీఎస్‌ పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.బ్యాంకు ఉద్యోగానికి సంబంధించిన రాత పరీక్షలో ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, లాజికల్‌ రీజనింగ్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. ఇవేకాకుండా ఇంటర్వ్యూ సమయంలో కమ్యూనికేషన్‌, జాబ్‌ నైపుణ్యాలు మొదలైనవి పరీక్షిస్తారు. మీరు పైన తెలిపిన అంశాలపై అవగాహన ఏర్పర్చుకొని రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు సిద్ధం కండి.



పదో తరగతి తర్వాత కంప్యూటర్‌ కోర్సు చేసి రెవెన్యూ విభాగంలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాను. ఆర్థిక పరిస్థితులు బాగోనందున రెగ్యులర్‌ ఇంటర్‌ చేయలేక ఎన్‌ఐఓఎస్‌ ద్వారా ఇంటర్‌ పూర్తి చేశాను. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివాను. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌కూ, రాష్ట్రస్థాయిలో గ్రూప్స్‌ ఉద్యోగాలకు అర్హుడినా? కాదా? మళ్లీ నేను రెగ్యులర్‌ ఇంటర్‌, డిగ్రీ చేయాలా?

- సి.హెచ్‌. సతీష్‌, ఆదిలాబాద్‌

ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చదువు కొనసాగించడం అభినందనీయం. మీకు ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉండి, రెగ్యులర్‌ ఇంటర్‌, డిగ్రీ చేయాలనుకుంటే చేయండి. కానీ యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌కూ, రాష్ట్రస్థాయి గ్రూప్స్‌ ఉద్యోగాలకూ దూరవిద్యలో ఇంటర్‌, డిగ్రీ చేసినవారికి కూడా అర్హత ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని నోటిఫికేషన్లలో డిగ్రీ, ఇంటర్‌ రెగ్యులర్‌గా ఉండాలని ఇస్తే తప్ప, డిగ్రీ అర్హతతో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీకు అర్హత ఉంటుంది. నిరభ్యంతరంగా గ్రూప్స్‌కూ, సివిల్స్‌కూ సన్నద్ధం అవ్వొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు