రెండు కోర్సులూ ఒకేసారి చేయొచ్చా?

టెన్త్‌ తర్వాత ఇంటర్‌ చదవకుండా 2012లో అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఏ పూర్తి చేశా. తర్వాత భద్రాచలం...

Published : 04 Jul 2016 01:39 IST

రెండు కోర్సులూ ఒకేసారి చేయొచ్చా?

టెన్త్‌ తర్వాత ఇంటర్‌ చదవకుండా 2012లో అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఏ పూర్తి చేశా. తర్వాత భద్రాచలం గిరిజన సంక్షేమ కళాశాలలో బీఈడీ శిక్షణ పొందాను. ఓపెన్‌ ఇంటర్‌, రెగ్యులర్‌ పీజీ(ఎకనామిక్స్‌) ఒకేసారి చేయవచ్చా? అలా కుదరకపోతే ఈ ఏడాది పీజీ ఆపివేసి, ఓపెన్‌ ఇంటర్‌ చదవడం మంచిదా? లేకపోతే పీజీయే చేయడం మేలా? ఇంటర్‌ లేనందున డిగ్రీపై బీఈడీపై వచ్చే ఉద్యోగాలకు సమస్యలుంటాయా?

- పి.వెంకటేష్‌, భద్రాచలం

మీరు ఓపెన్‌ ఇంటర్‌, రెగ్యులర్‌ పీజీ ఒకేసారి చేయడానికి అవకాశం ఉంది. ఇంటర్‌ సబ్జెక్టునూ, పీజీ సబ్జెక్టునూ ఒకేసారి చదివే సామర్థ్యం ఉన్నట్లయితే రెండు కోర్సులనూ ఒకేసారి చదవచ్చు. ఒకవేళ మీరు ఈ రెండింటికీ ఒకేసారి న్యాయం చేయలేను అనుకుంటే ఒక కోర్సు తర్వాత మరొకటి చదవడం మేలు.

ఇంటర్‌ అనేది డిగ్రీ, పీజీలకు పునాది కాబట్టి మొదటి ఇంటర్‌ చదివి ఆ తర్వాత పీజీ చేయడం మంచిది. ఇంటర్‌ లేనందున డిగ్రీ, బీఈడీపై వచ్చే ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన, సమాచారం లేదు. ఒకవేళ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లో 10+2+3 ఉండాలని ఇచ్చినట్లయితే టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ తప్పకుండా అవసరం ఉంటుంది. నోటిఫికేషన్లలో లేనట్లయితే ఎలాంటి సమస్యా ఉండదు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం బీఈడీ చదవాలంటే 10+2+3 చదివి ఉండాలన్న నిబంధన ఉంది.



* పీజీ పూర్తి చేసి, నెట్‌ అర్హత సంపాదించాను. అయితే ఇంటర్మీడియట్‌ పూర్తి చేయలేదు. డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు అర్హుడినేనా?

- సురేష్‌యాదవ్‌

ఇంటర్మీడియట్‌ పూర్తి చేయకపోయినప్పటికీ, మీకు డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు అర్హత ఉంటుంది. ఇంటర్మీడియట్‌ చదవకుండా డిగ్రీ, పీజీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా కొంతమంది ఉన్నారు. మీరు కూడా డిగ్రీ లెక్చరర్‌ పోస్టుకు అర్హులవుతారు. మీరు ఎంచుకున్నది ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీలను అన్నింటినీ పూర్తిగా చదవడం వల్ల సబ్జెక్టు పట్ల పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. ఇది బోధనా రంగంలో రాణించడానికి దోహదపడుతుంది. బోధనారంగంలో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తిగా చదవడం మేలు. ఎందుకంటే జె.ఎల్‌., డి.ఎల్‌. లాంటి ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.



* మా అబ్బాయి ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నాడు. తనను ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేయించాలని నా కోరిక. ఇంటర్‌ తర్వాత ఏ రకంగా ముందడుగు వేయాలి? ఈ కోర్సు ద్వారా ఉపాధి అవకాశాలు బాగుంటాయా?

- జె. లక్ష్మీ భవానీ, సికింద్రాబాద్‌

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివించాలనే మీ కోరిక అభినందనీయం. కానీ ఆ కోర్సు చదవడం మీ అబ్బాయికి ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. అతడి సామర్థ్యం, నైపుణ్యాలు ఈ కోర్సు చదవడానికి సరిపోతాయో లేదో చూసుకోవాలి. అతనికి ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మీ కోరిక ప్రకారమే ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివించండి. ఈ కోర్సును మనదేశంలో అతి తక్కువ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అందిస్తున్నాయి.

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి వివిధ విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలలు ఎంసెట్‌ ద్వారా కానీ జేఈఈ ద్వారా కానీ ప్రవేశాలు కల్పిస్తాయి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తున్న చాలా విద్యాసంస్థలు ఐఐటీలు నిర్వహించే జేఈఈ ద్వారానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఇంటర్‌ తర్వాత మీ అబ్బాయిని ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయండి.

ఈ కోర్సు ద్వారా ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువే. ఏర్‌ ఇండియా, ఇండియన్‌ ఏర్‌లైన్స్‌, హెలికాప్టర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన ఏర్‌లైన్స్‌కి ఏరోనాటికల్‌ ఇంజినీర్ల అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా విమాన భాగాలను తయారుచేసే సంస్థలు హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, నేషనల్‌ ఏరోనాటికల్‌ ల్యాబ్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ లాబొరేటరీస్‌, సివిల్‌ ఏవియేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఏరోనాటికల్‌ డెవెలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ లాంటి సంస్థల్లో, ఇస్రో లాంటి పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని