ఏ కోర్సుకు భవిష్యత్తు ఉంటుంది?

బీఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్‌) చేశా. సింగపూర్‌లో స్టోర్‌ కీపర్‌ ఉద్యోగం ఆరేళ్లపాటు చేసి మళ్లీ మనదేశం వచ్చాను...

Published : 18 Jul 2016 01:45 IST

ఏ కోర్సుకు భవిష్యత్తు ఉంటుంది?

* బీఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్‌) చేశా. సింగపూర్‌లో స్టోర్‌ కీపర్‌ ఉద్యోగం ఆరేళ్లపాటు చేసి మళ్లీ మనదేశం వచ్చాను. దూరవిద్యలో పీజీ చేయాలని ఉంది. ఏ పీజీ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది? పీజీ తర్వాత ఎలక్ట్రానిక్స్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని భావిస్తున్నా. ఇప్పుడు నా వయసు 32 సంవత్సరాలు. ఈ వయసురీత్యా ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశముంటుందా?

- మల్లేష్‌, కరీంనగర్‌

* స్వదేశానికి తిరిగి వచ్చి, ఉన్నత చదువులు కొనసాగించాలనే మీ ఆలోచన అభినందనీయం. పీజీ తర్వాత ఎలక్ట్రానిక్స్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని భావిస్తున్నారు కాబట్టి మీరు పీజీ కూడా ఎలక్ట్రానిక్స్‌ చేయడం మేలు. పీజీలో ఏ స్పెషలైజేషన్‌ చదివినా దానికి సంబంధించిన ఉద్యోగావకాశాలుంటాయి. ఏ పీజీ చదవాలనేది మీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తితో చదివిన ఏ కోర్సు అయినా ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది.

మీరు పీజీ దూరవిద్య ద్వారా చదవాలనుకుంటున్నారు కానీ ఎలక్ట్రానిక్స్‌ అనేది సాంకేతిక కోర్సు. కాబట్టి దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడం వల్ల సబ్జెక్టు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా సమస్యల్లేకపోతే రెగ్యులర్‌గానే విద్యాభ్యాసం కొనసాగించండి.

 

ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే ఒక్కో ఉద్యోగానికి వయః పరిమితి ఒక్కోవిధంగా ఉంటుంది. కొన్నిటికి ఈ పరిమితి ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు ఉండకపోవచ్చు. అందుకని ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ చూసి మీ వయసు దానికి సరిపోయినట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు.

* పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. తర్వాత ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటున్నా. అయితే ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరం నుంచీ చదవాలనీ, ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే రెండో సంవత్సరంలో చేర్చుకుంటారనీ విన్నాను. ఇది నిజమేనా? ప్రభుత్వ కళాశాలలకు లేటరల్‌ ఎంట్రీ వర్తిస్తుందో లేదో తెలపండి.

- శ్రీనివాస్‌, రాజమండ్రి

* పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం చదువుతున్న మీరు ఈ-సెట్‌ ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో నేరుగా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాన్ని పొందవచ్చు. కేవలం ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే రెండో సంవత్సరంలో చేర్చుకుంటారనేది అవాస్తవం. ప్రైవేటు కళాశాలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో కూడా లేటరల్‌ ఎంట్రీ వర్తిస్తుంది. మీరు ఈ-సెట్‌ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించినట్లయితే ప్రభుత్వ కళాశాలల్లో నేరుగా ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం నుంచి చదవడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని