కెమిస్ట్రీలో విభిన్న కోర్సులేవి?

బీఎస్‌సీ (ఎంపీసీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. కెమిస్ట్రీ సబ్జెక్టుపై ఆసక్తి ఉంది. పీజీ స్థాయిలో కెమిస్ట్రీ విభాగంలో ఉన్న వైవిధ్యమైన కోర్సులేమిటి? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

Published : 19 Sep 2016 01:22 IST

కెమిస్ట్రీలో విభిన్న కోర్సులేవి?

* బీఎస్‌సీ (ఎంపీసీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. కెమిస్ట్రీ సబ్జెక్టుపై ఆసక్తి ఉంది. పీజీ స్థాయిలో కెమిస్ట్రీ విభాగంలో ఉన్న వైవిధ్యమైన కోర్సులేమిటి? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

- రమాదేవి, కరీంనగర్‌

* పీజీ స్థాయిలో కెమిస్ట్రీ విభాగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు- ఎంఎస్‌సీ- అనలిటికల్‌, ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ , బయో, ఫిజికల్‌, డ్రగ్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ ఫార్యస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ కెమిస్ట్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ కంప్యూటేషనల్‌ కెమిస్ట్రీలతోపాటుగా ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్టు చదివినవారికి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. లెబొరేటరీలు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఆయిల్‌ ఇండస్ట్రీ, పెట్రోలియం, ఫార్మాస్యూటికల్‌, రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, సీడ్‌, నర్సరీ స్కూళ్లలో, అగ్రికల్చరల్‌ రీసర్చ్‌ సర్వీసెస్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటురంగ సంస్థలైన డాబర్‌, హిందుస్థాన్‌ లివర్‌, రాన్‌బాక్సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ వంటి ప్రబుఖ సంస్థలు కూడా కెమిస్ట్రీ చదివినవారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇస్రో, బాబా అటామిక్‌ రిసర్చ్‌ సెంటర్‌, ఇండియన్‌ రైల్వే రంగాల్లోనూ అవకాశాలున్నాయి. కెమిస్ట్‌గా, లెబొరేటరీ టెక్నీషియన్‌గా, ఫార్మసిస్ట్‌గా, టాక్సికాలజిస్ట్‌లుగా కూడా అవకాశాలుంటాయి.

* మా అమ్మాయి 7 తరగతుల వరకు ముంబయిలో చదివింది. తెలంగాణలో చదవాలనుకుంటోంది. తనకు ఏ రాష్ట్రం లోకల్‌ అవుతుంది?

- ఓ పాఠకుడు

* సాధారణంగా ఏ అభ్యర్థి అయినా ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏ ప్రాంతంలో చదువుతారో దానికి లోకల్‌ అవుతారు. చదువుకి సంబంధించి ఉన్నత విద్య అభ్యసిస్తున్నపుడు ఆ విద్యార్థి ప్రస్తుతం చదువుతున్న తరగతికి ముందు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివాడో లేదా చివరి ఏడు సంవత్సరాల్లో ఎక్కువకాలం ఎక్కడ చదివారో ఆ ప్రాంతానికి లోకల్‌ అవుతారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్లు సాధారణంగా విద్యార్థి స్వస్థలంపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే స్కాలర్‌షిప్‌లు పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా రాబడి, కుల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని