ఫైర్‌ సర్వీస్‌ రంగంపై ఆసక్తి!

డిగ్రీ చదువుతున్నాను. ఫైర్‌ సర్వీస్‌ రంగంపై ఆసక్తి ఉంది. వీటిపై డిప్లొమా కోర్సులను అందించే సంస్థల వివరాలను తెలపండి....

Published : 26 Sep 2016 01:18 IST

ఫైర్‌ సర్వీస్‌ రంగంపై ఆసక్తి!

* డిగ్రీ చదువుతున్నాను. ఫైర్‌ సర్వీస్‌ రంగంపై ఆసక్తి ఉంది. వీటిపై డిప్లొమా కోర్సులను అందించే సంస్థల వివరాలను తెలపండి. దీనికి కావాల్సిన విద్యార్హత, ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

- టి. పాపారావు, అనంతపురం

* మన తెలుగు రాష్ట్రాల్లో ఫైర్‌ సర్వీసెస్‌పై డిప్లొమా కోర్సులను అందించే విద్యాసంస్థలు తక్కువగా ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రముఖ సంస్థలు ఫైర్‌ అండ్‌ సేఫ్టీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఉదాహరణకు- దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ ఇంజినీరింగ్‌ (న్యూదిల్లీ)లో ఒక సంవత్సర కాలపు ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, ఆరు నెలల కోర్సు అయిన ఫైర్‌ ఫైటింగ్‌ కోర్సు అందుబాటులో ఉన్నాయి.

చెన్నైలోని నేషనల్‌ సేఫ్టీ అకాడమీలో డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ ఫైటింగ్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ ఇంజినీరింగ్‌ (నాగ్‌పూర్‌) మొదలైన సంస్థలు డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.

ఈ కోర్సులను చేయడానికి పదోతరగతి లేదా ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలి. దేహదార్ఢ్య పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ డిప్లొమా కోర్సు చదివినవారికి సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌, ఫైర్‌ సూపర్‌ వైజర్‌, సేఫ్టీ ఇంజినీర్‌, ఫైర్‌మ్యాన్‌, ఫైర్‌ ప్రొటెక్షన్‌ టెక్నిషియన్‌, సేఫ్టీ అసిస్టెంట్‌, సేఫ్టీ ఆడిటర్‌, ఫైర్‌ ఆఫీసర్‌ ఉద్యోగావకాశాలుంటాయి.

* బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సును అందించే సంస్థల వివరాలేమిటి? ఈ కోర్సుకు విద్యార్హత, ఉద్యోగావకాశాలను తెలపగలరు.

- ఎల్‌. సారథి ప్రసాద్‌

* బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సును మన తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. సాధారణంగా ఈ కోర్సును (బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా) ఎక్కువగా ప్రైవేటురంగ సంస్థలు అందిస్తున్నాయి. దేశంలో నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (న్యూదిల్లీ) లాంటి అతి తక్కువ ప్రభుత్వ రంగ సంస్థలో బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సును చదవడానికి హైస్కూల్‌ డిప్లొమా లేదా బీఈడీ (జనరల్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌) టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. బాయిలర్‌ ఆపరేటర్‌ కోర్సు చదివినవారికి పేపర్‌ మిల్లుల్లో, ఉడ్‌ మానుఫాక్చరింగ్‌ (కలప తయారీ)లో, హాస్పిటల్స్‌, పాఠశాలల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

ఫ్యాక్టరీల్లో, విద్యుదుత్పత్తి కేంద్రాలు మొదలైన పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సు చదివినవారు లోప్రెజర్‌, హైప్రెజర్‌ బాయిలర్లు, పవర్‌ బాయిలర్లు, స్టీమ్‌ బాయిలర్లు, నీటిని వేడి చేసే సిస్టమ్స్‌ నియంత్రణ, నిర్వహణ బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌,
కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని