మెరైన్‌ ఇంజినీరింగ్‌.. అమ్మాయిలకు తగినదేనా?

బీఈఎం (బ్యాచులర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నాను. పీజీ లేదా ఎంటెక్‌ చేయాలనుంది.

Published : 03 Oct 2016 01:19 IST

మెరైన్‌ ఇంజినీరింగ్‌.. అమ్మాయిలకు తగినదేనా?

* బీఈఎం (బ్యాచులర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నాను. పీజీ లేదా ఎంటెక్‌ చేయాలనుంది. నాకు అందుబాటులో ఉన్న కోర్సులేవి? అందించే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగావకాశాల వివరాలు తెలపండి.

- ఎస్‌.కె. రియాజుద్దీన్‌

బీఈఎం పూర్తిచేసిన తరువాత మీరు ఎంబీఏ, ఎంఎస్‌సీ కోర్సుల్లో వివిధ విభాగాలు చదవడానికి అవకాశం ఉంటుంది. ఎంబీఏ చదవాలనుకుంటే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, మేనేజీరియల్‌ కమ్యూనికేషన్‌ లాంటి విభాగాల్లో చేయవచ్చు. ఎంఎస్‌సీ చేయాలనుకుంటే కోస్టల్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల్లో చదవడానికి అవకాశముంటుంది.

ఎంటెక్‌ చేయడానికి ఇంటర్మీడియట్‌లో మేథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. మీకు అర్హత ఉంటే ఎంటెక్‌- ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్‌సీ- ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, యూనివర్సిటీ ఆఫ్‌ పుణెలు ఎంఎస్‌సీ- ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌లను అందిస్తున్నాయి.

ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశముంది. వీరికి నేచురల్‌ రిసోర్సెస్‌ స్పెషలిస్ట్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌, కోస్టల్‌ అండ్‌ మెరైన్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, రిసోర్స్‌ ఫారెస్టర్‌, వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌, చీఫ్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ అండ్‌ హార్టీకల్చర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌లుగా ఉద్యోగావకాశాలుంటాయి.

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ అగ్రికల్చర్‌, ఫారెస్ట్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఫెర్టిలైజర్‌ ప్లాంట్స్‌, టెక్స్‌టైల్స్‌ మిల్స్‌, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్స్‌ లాంటి జాతీయ స్థాయి సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.



* మా అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడు. తనకు అగ్రి బీఎస్‌సీపై ఆసక్తి ఉంది. ఉద్యోగావకాశాలను వివరించండి. ఈ కోర్సు చదివితే బ్యాంకు, ఇతర ఉద్యోగాలకు అర్హుడేనా?

- సి. పార్వతి, అనంతపురం

వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉండడం అభినందనీయం. వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యమున్న మనదేశంలో అగ్రికల్చర్‌ కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువే. మీ అబ్బాయికి అగ్రికల్చర్‌ బీఎస్‌సీపై ఆసక్తి ఉంది కాబట్టి ఉన్నతవిద్యను కూడా దానిలోనే కొనసాగించడం మంచిది. ఆసక్తి ఉన్న కోర్సు చదివితే భవిష్యత్తులో రాణించగలుగుతారు.

అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చదివినవారికీ బ్యాంకు ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. ఐబీపీఎస్‌ వారు నూతనంగా ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం బ్యాంకు పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్స్‌), క్లర్క్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి ఏదైనా డిగ్రీ (ప్రభుత్వ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలు/ కళాశాలలు) కలిగినవారు అర్హులు. అయితే క్లర్క్‌ ఉద్యోగానికి కంప్యూటర్‌ నైపుణ్యం కూడా ఉండాలి. ఇతర ఉద్యోగాల విషయానికి వస్తే కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లలో ప్రత్యేకంగా ఒక డిగ్రీని కలిగినవారు అర్హులు అని ఇస్తుంటారు. అలాంటి సందర్భాల్లోనే అనర్హత ఉంటుంది.

కొన్ని నోటిఫికేషన్లలో ఏదైనా ఒక డిగ్రీని ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాల నుంచి పొందినవారు అర్హులు అని ఇస్తుంటారు. ఇలాంటి ఉద్యోగాలకు నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చదివినవారికి రీసర్చ్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ లోన్‌ ఆఫీసర్‌ (బ్యాంకులో), ప్రొడక్షన్‌ మేనేజర్‌, ఆపరేషన్స్‌ మేనేర్‌, ఫార్మ్‌ మేనేజర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. అంతేకాకుండా ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ చదివి పీహెచ్‌డీ చేసినవారికి కళాశాలలు/ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుడిగా ఉద్యోగావకాశాలుంటాయి.



* మా అమ్మాయి ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మెరైన్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటోంది. ఇది అమ్మాయిలకు తగినదేనా? అందించే విశ్వవిద్యాలయాలేవి? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

- శివ

మెరైన్‌ ఇంజినీరింగ్‌ ఒక విభిన్న కోర్సు. దీనికి ఆదరణ, విద్యార్థుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంది. ఈ రోజుల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో తమని తాము నిరూపించుకుంటున్నారు. మీ అమ్మాయికి ఈ విభాగంలో ఆసక్తి ఉంది కాబట్టి ప్రోత్సహించండి. దాని వల్ల ఆమె భవిష్యత్తులో రాణించగలుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. దేశంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఉదాహరణకు- చెన్నైలోని ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ అకాడమీ, ముంబయిలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు. కొచ్చి, మంగళూరు విశ్వవిద్యాలయాలు, మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కోల్‌కతా) లాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది.

మెరైన్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సు చదివినవారికి షిప్పింగ్‌, కన్సల్టెన్సీ సంస్థలు, తయారీ రంగం, షిప్‌ బిల్డింగ్‌ సంస్థలు, ఆయిల్‌- గ్యాస్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగావాకాశాలుంటాయి. ఈ విభాగంలో జీతభత్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని