కోర్సు రద్దు చేసుకుని మళ్ళీ చదవొచ్చా?

నేను 2012-2014వరకూ మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌ కోర్సును ఏపీ పారామెడికల్‌ బోర్డు నుంచి పూర్తిచేశాను. అయితే అదే విద్యాసంవత్సరంలో డిగ్రీని రెగ్యులర్‌గా చదివాను.

Published : 24 Oct 2016 01:26 IST

కోర్సు రద్దు చేసుకుని మళ్ళీ చదవొచ్చా?

నేను 2012-2014వరకూ మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌ కోర్సును ఏపీ పారామెడికల్‌ బోర్డు నుంచి పూర్తిచేశాను. అయితే అదే విద్యాసంవత్సరంలో డిగ్రీని రెగ్యులర్‌గా చదివాను. ప్రస్తుతం ఎంఎల్‌టీ రద్దు (క్యాన్సిల్‌) చేసి, మళ్ళీ అదే కోర్సును చేయడానికి బోర్డు అనుమతి ఇస్తుందా?

- రమేష్‌కుమార్‌, గద్వాల

సాధారణంగా రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే విద్యాసంవత్సరంలో చదవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని గతంలో కూడా వివరించాం. ఒకవేళ చదివినట్లయితే ఉద్యోగ దరఖాస్తు సమయంలో గానీ, ఇంటర్వ్యూలో గానీ ఒక డిగ్రీ సర్టిఫికెట్‌ను మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

మీరు ఎంఎల్‌టీ క్యాన్సిల్‌ చేసి, మళ్ళీ అదే కోర్సును చేయడానికి బోర్డు అనుమతించకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ ఏపీ పారామెడికల్‌ బోర్డు వారు ప్రత్యేక నిబంధన ఉంచినట్లయితే అనుమతి దొరక్కపోవచ్చు. బోర్డు వెబ్‌సైట్‌ను ఒకసారి పరిశీలించండి. నిబంధనేమీ లేకపోతే మీరు మళ్ళీ ఎంఎల్‌టీ కోర్సును చేయవచ్చు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు (బీఈఎం) మూడో సంవత్సరం చదువుతున్నాను. దీని తర్వాత ఏం చదవాలో సందిగ్ధంలో ఉన్నాను. ఎంటెక్‌/ఎంఎస్సీ/ఎంబీఏ పర్యావరణ నిర్వహణ (ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌)లలో ఏది మెరుగైనది? ఎక్కడ చదివితే బాగుంటుంది? ఇవి కాకుండా మరేదైనా మంచి కోర్సు ఉందా?

- షేక్‌ రియాజ్‌ ఉద్దీన్‌, విశాఖపట్నం

మీరు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తయిన తర్వాత ఎంబీఏ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంటెక్‌ చదవాలనుకుంటే ఎమ్మెస్సీ చదివిన తర్వాత మాత్రమే చదవవచ్చు.

పర్యావరణ నిర్వహణ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు గానీ, కళాశాలలు గానీ మనదేశంలో చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉండేది. కానీ అతి తక్కువమంది విద్యార్థులు చేరుతుండటం వల్ల ఈ కోర్సును తొలగించారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో ఈ కోర్సుకు ఉద్యోగావకాశాలు కూడా తక్కువ. ఒకవేళ మీరు విదేశాల్లో చదవాలనుకుంటే ఎమ్మెస్సీ చదివిన తర్వాత ఎంఎస్‌ చేయడానికి విదేశాలకు వెళ్ళవచ్చు. మీరు ఎమ్మెస్సీ చదివినా, ఎంబీఏ, ఎంటెక్‌ ఏది చదివినా అన్నీ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించినవే కాబట్టి అన్నిటికీ దాదాపు ఒకే రకంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకుంటేనే దేనిలోనైనా రాణించగలుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని