ఎం.పి.ఇ.సి. చదివే వీలుందా?

ఎంబీఏ చదువుతున్నాను. బహుళజాతి సంస్థల్లో పనిచేయడానికి కొన్ని నైపుణ్యాలు అవసరమని విన్నాను. అవేమిటి? వాటినెలా పెంచుకోవాలి?

Published : 07 Nov 2016 00:52 IST

ఎం.పి.ఇ.సి. చదివే వీలుందా?

1. ఎంబీఏ చదువుతున్నాను. బహుళజాతి సంస్థల్లో పనిచేయడానికి కొన్ని నైపుణ్యాలు అవసరమని విన్నాను. అవేమిటి? వాటినెలా పెంచుకోవాలి?

-నాగేంద్రకుమార్‌, ఎన్‌.

జ: ఎంబీఏ చదివినవారు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే వారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, మార్పును స్వీకరించే సామర్థ్యం, పర్యవేక్షక నైపుణ్యాలు, పరస్పర సంబంధాలు, చర్చించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, విశ్లేషణాత్మక అభిప్రాయం, వృత్తినైపుణ్యం, సమయ వినియోగం, బృందంతో కలిసి పనిచేయడం, వ్యూహాత్మక ఆలోచన మొదలైనవి ఉండాలి.

ఇంకా వివిధ దేశాలకు చెందినవారితో పనిచేయాల్సివుంటుంది. అందుకే ఇతర భాషలను మాట్లాడటం, భిన్న దేశాల సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడం అవసరం. ఎంబీఏ చదువుతున్నపుడు వివిధ నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అధ్యాపకుల, నిపుణుల సలహాలను తీసుకోవడం, చేసే పనుల్లో స్నేహితుల, సహోద్యోగుల అభిప్రాయాలు తీసుకోవడం వల్ల నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. తోటివారితో సత్సంబంధాలు, వివిధ భాషలు తెలిసినవారితో మాట్లాడుతూవుండటం వల్ల భావవ్యక్తీకరణలోనూ నైపుణ్యాలు పెరుగుతాయి. కొన్ని సంస్థలు వివిధ నైపుణ్యాలు పెంపొందడానికి శిక్షణను కూడా ఇస్తున్నాయి. అలాంటి సంస్థల్లో చేరి కూడా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు.



2. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను (బీజడ్‌సీ గ్రూపు). సివిల్స్‌కూ, గ్రూప్స్‌కూ తయారై ఆ పరీక్షలు రాయాలనే ఆసక్తి ఉంది. నా లక్ష్యం చేరడానికి ఏ మార్గాలు అనుసరించాలో సూచించగలరు.

- మౌనిక

జ: లక్ష్యం నిర్దేశించుకుని, దాన్ని చేరుకోవాలనే ఆక్షాంక్ష, ఆసక్తితో ఉండటం అభినందనీయం. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలు రాయాలంటే ముఖ్యంగా జనరల్‌ నాలెడ్జ్‌, కరంట్‌ అఫైర్స్‌లకు సంబంధించిన అంశాలను క్రమం తప్పకుండా చదువుతుండాలి. వార్తాపత్రికల్లో వచ్చే తాజా వార్తలు, సంపాదకీయాలను ఎప్పటికప్పుడు అనుసరించాలి. దేశంలోని వివిధ రంగాలపట్ల పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆ రంగాల్లోని పరిణామాలను గ్రహిస్తూవుండాలి.

గ్రూప్స్‌, సివిల్స్‌ పరీక్షలను రాసి విజయాన్ని సాధించినవారి విజయగాథలు చదవటం, వారి సన్నద్ధత పద్ధతిని తెలుసుకోవడం చేయాలి. ఓరియంటేషన్‌ కార్యక్రమాలకు హాజరుకావడం వల్ల కొంత మేలు ఉంటుంది. ఆప్షనల్‌గా తీసుకోదల్చిన సబ్జెక్టులో పీజీ కూడా చదివితే దానిపై పట్టు లభిస్తుంది. లేదంటే డిగ్రీ పూర్తయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు పట్టుదలతో సన్నద్ధమైనా కూడా ఫలితం ఉంటుంది.



3. ఎంబైపీసీ మాదిరిగా ఎం.పి.ఇ.సి. (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఎకనమిక్స్‌, కామర్స్‌) గ్రూపును అందించే ఇంటర్‌ బోర్డు/కళాశాలలు ఎక్కడున్నాయో తెలుపగలరు.

- కె.వి.ఆర్‌. రావు, ఖమ్మం

జ: మన తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్‌ బోర్డు వారు ఈ ఎం.పి.ఇ.సి. గ్రూపును అందించడం లేదు. ఈ గ్రూపును అందించే కళాశాలలూ లేవు. కొన్ని కళాశాలల్లో ఎం.ఇ.సి. గ్రూపు అందుబాటులో ఉంది.

సీబీఎస్‌ఈ వారు ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయాలజీ, బయో టెక్నాలజీ, హిస్టరీ, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ మొదలైన సబ్జెక్టులను కోర్సులో భాగంగా బోధిస్తారు. కానీ ప్రత్యేకంగా ఎం.పి.ఇ.సి. కోర్సును అందించడం లేదు. మీకు ఒకవేళ ఈ సబ్జెక్టులను చదవాలనే ఆసక్తి ఉంటే ముందుగా ఎం.ఇ.సి. కోర్సును చదివి, తర్వాత ఫిజిక్స్‌ సబ్జెక్టు ఉన్న కోర్సును చదవొచ్చు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని