అడుగు వెనక్కి కాదు, ముందుకు వెయ్యండి!

ఎంటెక్‌ 70 శాతం మార్కులతో ఐదేళ్ళ క్రితం పూర్తిచేశాను. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, బ్యాంకు, సివిల్స్‌ పోటీపరీక్షలు....

Published : 21 Nov 2016 01:40 IST

అడుగు వెనక్కి కాదు, ముందుకు వెయ్యండి!

* ఎంటెక్‌ 70 శాతం మార్కులతో ఐదేళ్ళ క్రితం పూర్తిచేశాను. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, బ్యాంకు, సివిల్స్‌ పోటీపరీక్షలు రాశాను. ఒకటి రెండు మార్కుల తేడాతో అన్నీ చేజారాయి. ప్రస్తుతం గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాను. కష్టపడి చదివినా పరీక్షల సమయానికి మరిచిపోతున్నట్లనిపిస్తుంది. భవిష్యత్తుపై నిరాశగా, భయంగా ఉంది. నేనేం చేస్తే మంచిదో సలహా ఇవ్వగలరు.

- రాజేష్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం

* జీవితంలో విజయం సాధించడానికి ఏకాగ్రత, తదేక దీక్ష అనేవి అత్యవసరం. మీరు ఒకటి రెండు మార్కుల తేడాతో మాత్రమే పోటీపరీక్షల్లో వెనకబడుతున్నారు. అంటే విజయానికి చాలా దగ్గర్లో ఉన్నారనేగా అర్థం! ఒక్కో అడుగు వేస్తూ ఇంతదూరం ప్రయాణం చేసి గెలుపునకు అతి కొద్దిదూరంలో ఉన్న మీరు ఆ అడుగును మందుకు వేయండి! వెనక్కి వేయడం వల్ల మీ శ్రమా, కష్టం వృథా అవుతాయే తప్ప లక్ష్యం చేరుకోలేరు.

సహనం పాటించేవారే జీవితంలో అనుకున్నవి సాధించగలరు. గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం చేజిక్కించుకుంటారు.

ప్రపంచంలోని గొప్పవాళ్ళు ఎందరో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. ఎవరూ ఒక్కరోజులోనో, స్వల్పకాలంలోనో గొప్పవారు కాలేరు. కిందపడ్డా ప్రయత్నం సాగిస్తేనే విజయం వరిస్తుంది. మీ లక్ష్యసాధనకు ఇది తొలిమెట్టు అనుకుని ముందుకు సాగండి. అంతేకానీ... నిరాశ, నిస్పృహలతో సాధించేది ఏదీ ఉండదు.

మీరు పరీక్ష సమయం వచ్చేసరికి టెన్షన్‌ పడి పరీక్ష సరిగా రాస్తానో లేదో అనే భయానికి లోనవుతున్నారు. దానివల్ల చదివినది మర్చిపోయి పరీక్ష సరిగా రాయలేకపోతున్నారు. విజయానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ ధీమాతో ముందుకు వెళ్ళండి. అనుకున్నది తప్పకుండా సాధించగలరు. భవిష్యత్తు గురించి ఆందోళన పడకండి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే తప్పకుండా ఉన్నతస్థానంలో ఉంటారు. అప్పుడు మీ గతంలోని చిక్కులూ, కష్టాలను తలచుకుని ఉల్లాసపడతారు కూడా.

‘మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము. అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి’ అని అబ్దుల్‌ కలామ్‌ చెప్పారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని విజయం కోసం ప్రయత్నించాలి. సవాలు ఎదురైనపుడు మన ప్రతిభను చూపించే అవకాశంగా భావించాలి. అంతేకానీ కుంగిపోకూడదు.

మీరు ఇతర ఉద్యోగాలకు కూడా ప్రయత్నించి చూడండి. మీ చదువుకు మీకు సరిపోయే ఉద్యోగానికి అవకాశం ఉన్నట్లయితే ప్రయత్నించండి. మీ అనుభవమూ, తెలివితేటలూ అక్కడ ఉపయోగపడవచ్చు. ఒక అవకాశం చేజారితే కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. మరో అవకాశం కోల్పోకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు ఎదురవుతాయోనని భయపడుతూ బతికితే జీవితంలోని ఆనందానికి దూరం కావాల్సివస్తుంది. గెలవకపోవటం ఓటమి కాదు; మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి!

* అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా 2006లో ఎకనామిక్స్‌లో పీజీ చేశాను. పీజీ చదివేటపుడు మధ్యలో బి.ఇడిలో చేరటం వల్ల అన్ని పేపర్లూ ఒకేసారి అటెమ్ట్‌ చేయలేకపోయాను. దీంతో ఏడాదికి రెండు చొప్పున నాలుగు మార్కుల మెమోలు వచ్చాయి. ఒక్కో సంవత్సరానికి ఒక్క మార్కుల మెమోనే ఇవ్వమంటే ఆ అవకాశం లేదన్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైనా సాధ్యపడుతుందా?

- విజయ, నల్గొండ

* సాధారణంగా ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క నిబంధన ఉంటుంది. కన్సాలిడేటెడ్‌ మెమో ఇస్తారేమో విశ్వవిద్యాలయంలో మొదట కనుక్కోండి. ఒకవేళ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే దానికోసం ప్రయత్నించండి. ఆ కన్సాలిడేటెడ్‌ మెమో ఇచ్చినప్పటికీ దానిలో సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణత పొందినట్లు ఉంటుంది. చాలామంది బీటెక్‌ విద్యార్థులు కూడా మొదట రాసిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే తిరిగి పరీక్ష రాసి తర్వాత మెమో తీసుకుంటారు. కాబట్టి రెండు మెమోలు వచ్చినంత మాత్రాన దాని గురించి దిగులు చెందాల్సిన పని లేదు. మీరు ఏదైనా ఉద్యోగం చేయడానికైనా లేదా ఉన్నత చదువులకైనా మంచి పరిజ్ఞానం, సంబంధిత నైపుణ్యం ఉంటే చాలు. కాబట్టి మీరు మార్కుల మెమోల గురించి ఆలోచించి బాధపడకుండా నిశ్చింతగా ఉండండి!

* మా తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. తనకు ఖగోళశాస్త్రం (అస్ట్రానమీ) అంటే ఆసక్తి ఎక్కువ. అందులో రాణించాలంటే ఇంటర్లో ఏ గ్రూపు ఎంచుకోవాలి? ఈ సబ్జెక్టులో డిగ్రీ అందించే విద్యాసంస్థలూ, దీనిలో ఉద్యోగావకాశాలూ తెలుపగలరు.

- ప్రణయ

* ఖగోళశాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇందులో ఆసక్తి ఉండటం అభినందనీయం. అస్ట్రానమీ చదవాలనుకునేవారు ముఖ్యంగా భౌతికశాస్త్రం, గణితం సబ్జెక్టులపై పట్టు సాధించాల్సివుంటుంది. ఈ రెండూ కూడా అస్ట్రానమీ కోర్సు చదవడానికి ముఖ్యమైనవి. అందుకని ఇంటర్లో ఎంపీసీ లేదా ఎంబైపీసీ లాంటి ఈ రెండు సబ్జెక్టుల కలయిక ఉన్న గ్రూపును ఎంచుకోవాలి.

మన తెలుగు రాష్ట్రాల్లో అస్ట్రానమీ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు అతి తక్కువ. నేరుగా డిగ్రీలోనే అస్ట్రానమీ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు మనదేశంలో తక్కువే. కాబట్టి డిగ్రీలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ కలయికలో ఉన్న కోర్సును లేదా బీటెక్‌ కోర్సును చదివి ఎమ్మెస్సీ (అస్ట్రానమీ)/ ఎమ్మెస్సీ (అస్ట్రో ఫిజిక్స్‌)/ ఎంటెక్‌ (స్పేస్‌ టెక్నాలజీ)/ ఎంటెక్‌ (స్పేస్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌ లాంటివి చదవొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లోని ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు పీజీలో ఖగోళశాస్త్ర సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.

ఈ కోర్సు చదివినవారికి నాసా, బార్క్‌, ఇస్రో లాంటి ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ అస్ట్రానమీ అండ్‌ అస్ట్రో ఫిజిక్స్‌, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌, ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌ మొదలైన సంస్థల్లో కూడా ఉపాధికి వీలుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని