బోధనపై ఆసక్తి... ఏం చేస్తే మేలు?

మా అమ్మాయికి 2017 మే నెలలో బీటెక్‌ (ఈసీఈ) ఫైనలియర్‌ పూర్తవుతుంది. ఎంబీఏ ఫైనాన్స్‌ చేయాలనివుంది. ఈ కోర్సు చదువుతూనే బ్యాంకు పరీక్షలకు...

Published : 09 Jan 2017 01:35 IST

బోధనపై ఆసక్తి... ఏం చేస్తే మేలు?

 

* మా అమ్మాయికి 2017 మే నెలలో బీటెక్‌ (ఈసీఈ) ఫైనలియర్‌ పూర్తవుతుంది. ఎంబీఏ ఫైనాన్స్‌ చేయాలనివుంది. ఈ కోర్సు చదువుతూనే బ్యాంకు పరీక్షలకు సిద్ధం కావాలని తన ఆలోచన. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఎంబీఏ అందించే మంచి కళాశాల ఎక్కడుంది? బ్యాంకులో ఉద్యోగం కూడా ప్రాక్టికల్‌ అనుభవం కోసమే. ఆ తర్వాత సొంతంగా బిజినెస్‌ ప్రారంభించాలనేది తన లక్ష్యం. వివరాలు తెలుపగలరు.

- కె. శ్రీనివాసరావు, విజయవాడ

* సొంతంగా బిజినెస్‌ చేయాలనే అభిలాష అభినందనీయం. ఎంబీఏ చదవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా, జేఎన్‌టీయూ, ఆంధ్ర, గీతం, ఆచార్య నాగార్జున, కాకతీయ మొదలైన విశ్వవిద్యాలయాలు ఎంబీఏను అందిస్తున్నాయి. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం వారు క్యాట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన వర్సిటీలు ఐసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి.

అంతేకాకుండా బిజినెస్‌ స్కూళ్ళు కూడా మన రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. బీ స్కూళ్ళలో ఎంబీఏ చదవాలంటే ఎక్కువ ఫీజు చెల్లించాల్సివుంటుంది. కాబట్టి ఏ విశ్వవిద్యాలయంలోనైనా చదవొచ్చు. సొంతంగా బిజినెస్‌ చేయాలనే అభిలాష ఉంది కాబట్టి బిజినెస్‌ పరిజ్ఞానం ఎక్కువగా పెంచుకోవాలి. బ్యాంకు పరీక్షలక్కూడా సరైన సమయాన్ని కేటాయించాలి. ఏకాగ్రత, అంకితభావాలతో చదివితే అనుకున్నది తప్పకుండా సాధిస్తారు.


* ఓయూ క్యాంపస్‌లో ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ విత్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను. డిగ్రీ.. బీఎస్‌సీ (ఎంపీసీ), బీఈడీ పూర్తిచేశాను. గురుకులంలో పీజీటీ పోస్టుకు అర్హత ఉంటుందా? నాకు బోధన ఇష్టం. నా కోర్సుకు ఉన్న అవకాశాలు తెలుపగలరు.

- ప్రశాంతి

* అందరూ కంప్యూటర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బోధన రంగంపై ఆసక్తి చూపుతున్నందుకు అభినందనలు. మీరు నెట్‌/సెట్‌ ఉత్తీర్ణులైతే డిగ్రీ కళాశాల అధ్యాపక ఉద్యోగాలకు అర్హులవుతారు. ఎమ్మెస్సీతో జేఎల్‌ ఉద్యోగాలకు అర్హులు. ఎమ్మెస్సీ, బీఈలతో పీజీటీకి అర్హత ఉంటుంది. మీ కోర్సు సిలబస్‌ను గమనిస్తే... సగం సిలబస్‌ మ్యాథ్స్‌, మిగతా కంప్యూటర్‌ సైన్స్‌ల కలయికతో ఉంది. మీ కోర్సు చదివినవారు మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌.. రెండిటినీ బోధించగలరు. గురుకుల కళాశాలల్లో కంప్యూటర్‌ సబ్జెక్టును కూడా బోధిస్తారు. కాబట్టి మీరు రాతపరీక్షలో ఉత్తీర్ణులైతే ఇంటర్వ్యూలో ఉద్యోగం పొందే అవకాశాలుంటాయి.


* ఇంటర్‌ ఎంపీసీ సెకండియర్‌ చదువుతున్నాను. జీఈఈ మెయిన్‌ పరీక్ష రాస్తే దాని ద్వారా ఉద్యోగావకాశాలుంటాయా? ఎంసెట్‌ ద్వారా చేరే ఇంజినీరింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగం త్వరగా రావాలంటే ఈఈఈ, ఈసీఈ, సివిల్‌ బ్రాంచిల్లో ఏది తీసుకుంటే మంచిది?

- యశస్వి

జేఈఈ మెయిన్‌ పరీక్ష ఉద్యోగాల కోసం కాదు. దీని ద్వారా ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. పేరున్న సంస్థల్లో చదివితే నిష్ణాతుల బోధన వల్ల విషయ పరిజ్ఞానం మెరుగవుతుంది. అక్కడ ప్రాంగణ నియామకాలు ఎక్కువగా ఉంటాయి. జేఈఈ మెయిన్‌ స్కోరు ద్వారా జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందితే భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాల విద్యార్థుల పరిచయాలతో వ్యక్తిత్వం, భావ ప్రకటన సామర్థ్యం మెరుగవుతాయి. ఉన్నత విద్య పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఎంసెట్‌ ద్వారా అయితే ఇంజినీరింగ్‌ను మన తెలుగు రాష్ట్రాల్లోనే చదవొచ్చు. అధ్యాపకులు, సహ విద్యార్థులు కూడా మన ప్రాంతం వారే అయివుంటారు కాబట్టి ఆంగ్లభాషలో సామర్థ్యం పెరిగే అవకాశం తక్కువ. ఎంసెట్‌ ద్వారా ప్రవేశం కల్పించే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో కొద్దికళాశాలల్లోనే మెరుగైన బోధన, ప్రయోగశాలలు ఉన్నాయి. అందుకని ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటే మంచి ర్యాంకుతో, మంచి కాలేజీలో ప్రవేశం పొందే ప్రయత్నం చేయండి.

ఏ బ్రాంచి మెరుగైనదో విద్యార్థి అభిరుచి, ఆసక్తులతో సంబంధం లేకుండా చెప్పడం చాలా కష్టం. ఇంజినీరింగ్‌ పూర్తిచేసేనాటికి ఉండే మార్కెట్‌ అవకాశాలు, సాంకేతిక అవసరాలు లాంటి ఎన్నో విషయాలు ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ఇవెలా ఉన్నా విద్యార్థిలో కష్టపడే తత్వం, విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన సామర్థ్యం, సమస్యా పరిష్కార లక్షణాలు, ఆత్మవిశ్వాసం మొదలైనవి చాలా ముఖ్యం. కాబట్టి ఉద్యోగం కోసం కాకుండా పరిజ్ఞానం పెంచుకోవడం కోసం కోర్సును అభ్యసించాలి. అప్పుడే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని