డిప్లొమా... ఇంటర్‌తో సమానమా?

రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ)లో బి.ఇడి చేయాలని ఉంది

Published : 13 Feb 2017 02:04 IST

డిప్లొమా... ఇంటర్‌తో సమానమా?  

* రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ)లో బి.ఇడి చేయాలని ఉంది. దీని ప్రవేశాల ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది? మనదేశంలో ఆర్‌ఐఈ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

- ఎ. గీతాంశ్‌ శాయి, కుస్తాపూర్‌, జగిత్యాల జిల్లా

* రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో బి.ఇడి చేయాలనే మీ ఆకాంక్ష అభినందనీయం. మనదేశంలో ఆర్‌ఐఈ కేంద్రాలు ప్రధానంగా అజ్మీర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూర్‌లలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఇన్‌ సర్వీస్‌, ప్రీ సర్వీస్‌ వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తారు. వీటితో పాటు నార్త్‌ఈస్ట్‌ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (షిల్లాంగ్‌)లో ఇన్‌సర్వీస్‌ ప్రోగ్రాములు అందుబాటులో ఉంటాయి. ఆర్‌ఐఈ ప్రవేశాల ప్రకటన ఫిబ్రవరి/మార్చి నెలల్లో వెలువడుతుంది. మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

* అగ్రికల్చర్‌ డిప్లొమా చేశాను. కారణాంతరాల వల్ల బీఎస్‌సీ (అగ్రికల్చర్‌) చేయలేకపోయాను. అగ్రి డిప్లొమా ఇంటర్‌తో సమానమేనా? నేను గ్రూప్‌-4, కానిస్టేబుల్‌, సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ లాంటి పరీక్షలకు అర్హుడనేనా?మా డిప్లొమా వారికి ఏఈఓ కాకుండా వేరే ఏవైనా ఉద్యోగావకాశాలున్నాయా?

- కృష్ణపాల్‌, సోనాల, ఆదిలాబాద్‌ జిల్లా

* అన్ని డిప్లొమాలూ ఇంటర్‌తో సమానం కావు. అయితే ఇటీవల మూడు సంవత్సరాల పాలిటెక్నిక్‌ డిప్లొమా చదివినవారికి ఇంటర్మీడియట్‌తో సమానంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించారు. రెండు సంవత్సరాల అగ్రికల్చర్‌ డిప్లొమా ఇంటర్‌తో సమానమో, కాదో అనే విషయంలో స్పష్టత లేదు. గ్రూప్‌-4 లాంటి పరీక్షల్లో కొన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ అర్హతనూ, కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి అర్హతనూ అడుగుతుంటారు. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలని అడిగినట్లయితే ఆ ఉద్యోగాలకు మీకు అర్హత ఉండదు.

* అప్పుడు మీరు పదో తరగతి అర్హతతో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ లాంటి పరీక్షలకు పదో తరగతి అర్హతతో కూడా పోటీపడవచ్చు.

చి అగ్రికల్చర్‌ డిప్లొమా చదివినవారికి అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌ సేల్స్‌మెన్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌, రీజనల్‌ సర్వీస్‌ మేనేజర్‌, కౌంటర్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌... మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి. నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, స్టేట్‌ ఫార్మ్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ లాంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలుంటాయి.

* నాకు కిందటి సంవత్సరం బీటెక్‌ (మెకానికల్‌) పూర్తయింది. కానీ కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్‌ ఉండిపోయాయి. ఏర్‌క్రాఫ్ట్‌ రంగంలో స్థిరపడాలనుకున్నాను. కానీ బ్యాక్‌లాగ్స్‌ పాసవడానికి ఏడాది పడుతుంది. డిగ్రీ లేదా ఉద్యోగానికి అర్హత లేకపోతోంది. ఏం చేయాలో తోచడం లేదు. నాకు ఆసక్తి ఉన్న ట్రావెల్‌ అండ్‌ టూరిజం దూరవిద్యలో చేయవచ్చా?

- ఎం. వినోద్‌కుమార్‌, కరీంనగర్‌
* మీకు కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. కాబట్టి మొదట వాటిపై శ్రద్ధ వహించండి. మీరు అన్ని సబ్జెక్టులూ పాసైతే ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. చాలామంది విద్యార్థులు తాము ఏదైనా కోర్సు చదువుతున్నపుడు కాలాన్ని వృథా చేయడం వల్ల లేదా సరిగా వినియోగించుకోకపోవడం వల్ల తక్కువ మార్కులు పొందడం గానీ, సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవడం గానీ జరుగుతోంది.

* మీ లక్ష్యం ఏర్‌క్రాఫ్ట్‌ రంగంలో స్థిరపడటం. మీరు మీ లక్ష్యంవైపే అడుగులు వేయండి. కొన్నిసార్లు ఏవో పరిస్థితుల ప్రభావం వల్లనో, కారణాంతరాల వల్లనో ఆటంకాలు ఏర్పడవచ్చు. అంతమాత్రాన లక్ష్యాన్ని వదిలిపెట్టి ఇతర అంశాలపై దృష్టిపెట్టనక్కర్లేదు. బాగా చదివి, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందడానికి ప్రయత్నించండి. తప్పకుండా అనుకున్న రంగంలో స్థిరపడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని