సర్టిఫికెట్లలో పొరపాట్లు సవరించుకోవచ్చా..?

పదో తరగతి చదివాక, అనివార్య కారణాలవల్ల ఇంటర్‌ మధ్యలోనే ఆపేశాను. 2012లో పోటీపరీక్ష రాసి...

Published : 13 Mar 2017 02:07 IST

సర్టిఫికెట్లలో పొరపాట్లు సవరించుకోవచ్చా..?

పదో తరగతి చదివాక, అనివార్య కారణాలవల్ల ఇంటర్‌ మధ్యలోనే ఆపేశాను. 2012లో పోటీపరీక్ష రాసి, వీఆర్‌ఏగా ఎంపికై ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ తరువాత గ్రూప్‌-2 పరీక్ష రాయడానికి నేను అర్హుడినేనా? కౌన్సెలింగ్‌ సమయంలో ఇంటర్‌ సర్టిఫికెట్లు అడుగుతారా? ఇతర బ్యాంకు పరీక్షలను రాయడానికి నాకు అర్హత ఉంటుందా?

- ఓ పాఠకుడు

గ్రూప్‌-2 పరీక్షలో వివిధ రకాల పోస్టులకు, వాటికి తగిన విద్యార్హతలను అడుగుతున్నారు. కాబట్టి, మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగిన విద్యార్హతలు ఉన్నాయో, లేవో చూసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్‌లో ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలని ఇస్తే, ఆ పరీక్ష రాయడానికి మీకు అర్హత ఉండదు. లేకపోతే మీరు రాయవచ్చు.
కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్హతలు పరిశీలించేటప్పుడు ఒకవేళ ఆ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ అవసరం ఉన్నట్లయితే, సర్టిఫికెట్లు అడుగుతారు. ఇతర బ్యాంకు పరీక్షల విషయంలో కూడా నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతల ప్రకారం మీకు దాన్ని రాయడానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది. నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హత అడగకపోతే మీరు బ్యాంకింగ్‌ పరీక్షలు రాయవచ్చు.


ఓపెన్‌ ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌) చేస్తున్నాను. నా మొదటి సంవత్సరం పరీక్ష మేలో పూర్తవుతుంది. జూన్‌లో జరిగే నెట్‌ పరీక్షను నేను రాయవచ్చా? జేఆర్‌ఎఫ్‌ వచ్చాక సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసుకోవచ్చా? రెగ్యులర్‌ వారికీ, మాకూ ఉద్యోగావకాశాల్లో తేడా చూపిస్తారా?

- భుక్యా రాములు, ఖమ్మం

ప్రస్తుతం నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)ను సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) వారు నిర్వహిస్తున్నారు. వారి నిబంధనల ప్రకారం నెట్‌ రాసే అభ్యర్థి తుది సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా చివరి సంవత్సరం పూర్తయి ఉండాలి. మీరు ఇప్పుడు మొదటి సంవత్సరం చదువుతున్నారు కాబట్టి, సీబీఎస్‌సీ నిబంధనల ప్రకారం మీరు నెట్‌ను రాయడానికి అనర్హులు. మీరు మీ రెండో సంవత్సరంలోకానీ, రెండో సంవత్సరం పూర్తయిన తరువాత కానీ రాయవచ్చు. జేఆర్‌ఎఫ్‌ వచ్చాక సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసుకోవచ్చు.
రెగ్యులర్‌ వారికీ, మీకూ ఉద్యోగావకాశాల్లో ఎలాంటి తేడా ఉండదు. మీరు పట్టుదలతో ప్రయత్నించండి, తప్పకుండా జేఆర్‌ఎఫ్‌ వస్తుంది.


ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇస్రోలో చేరాలని ఆసక్తి. దానికి ఏ ప్రవేశపరీక్ష రాయాలి? ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చేయాలని అనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఏ కళాశాలలోనైనా ఈ బ్రాంచి ఉందా?

- నోవా పీటర్‌ (ఈ-మెయిల్‌)

ఇస్రోలో చేరాలన్న మీ ఆసక్తి అభినందనీయం. ప్రతి సంవత్సరం ఇస్రో సెంట్రలైజ్‌డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) వారు రాతపరీక్ష నిర్వహిస్తారు. దాదాపు అన్ని బ్రాంచిలవారూ ఈ పరీక్షను రాయవచ్చు. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి మన తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏరోక్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌, హైదరాబాద్‌ గీతం యూనివర్సిటీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


నేను బీఏ, ఎంఏ (తెలుగు)ను దూరవిద్యలో చదివాను. బీఈడీని రెగ్యులర్‌ పద్ధతిలో పూర్తిచేశాను. టీచర్‌, వార్డెన్‌, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?
నా పేరు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లలో తప్పుగా పడింది. వాటిలో నా పేరును సరిచేసుకోవడానికి వీలవుతుందా?

- నవీన్‌, శ్రీధర్‌

సాధారణంగా టీచర్‌, జూనియర్‌ లెక్చరర్‌, వార్డెన్‌ వంటి పోస్టులకు దూరవిద్య ద్వారా చదివినప్పటికీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ నోటిఫికేషన్‌లో రెగ్యులర్‌ డిగ్రీ, పీజీ చదివినవారే అర్హులు అని ఇస్తే మాత్రం మీకు అవకాశం ఉండదు. నోటిఫికేషన్‌లో ప్రస్తావించకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు.
పది, ఇంటర్‌ సర్టిఫికెట్లలో తప్పుగా ప్రింట్‌ అయిన మీ పేరును సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ పాఠశాల ఉపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్‌ను సంప్రదించి వివరాలను అడగండి. వారి సూచనల ప్రకారం పాఠశాల/ కళాశాల బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే వారు సరిచేసే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని