సీబీఎస్‌ఈనా? స్టేట్‌ సిలబస్సా?

జనరల్‌ బీఈడీ, స్పెషల్‌ బీఈడీ అని రెండు రకాలున్నాయి కదా! స్పెషల్‌ బీఈడీకి సంబంధించిన పుస్తకాలు....

Published : 20 Mar 2017 01:46 IST

సీబీఎస్‌ఈనా? స్టేట్‌ సిలబస్సా?

జనరల్‌ బీఈడీ, స్పెషల్‌ బీఈడీ అని రెండు రకాలున్నాయి కదా! స్పెషల్‌ బీఈడీకి సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్‌ ఎక్కడ దొరుకుతాయి? స్పెషల్‌ బీఈడీ ముగిశాక ఉద్యోగావకాశాలు ఏం ఉంటాయి? తెలుపగలరు.

- ఎస్‌. మణెమ్మ, కాజీపేట

మీకు స్పెషల్‌ బీఈడీకి సంబంధించిన పుస్తకాలు, మెటీరియళ్లు మార్కెట్‌లో దొరుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో దొరకలేదనిపిస్తే, ఆన్‌లైన్‌లో ప్రయత్నించండి. తప్పకుండా దొరుకుతాయి.
స్పెషల్‌ బీఈడీ చదివినవారు సాధారణంగా స్పీచ్‌ థెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌, ఫిజియోథెరపిస్ట్‌లాంటి వారితో పనిచేస్తారు. అంతేకాకుండా పబ్లిక్‌, ప్రైవేటు స్కూళ్లలో వినికిడి, కీళ్లు, దృష్టి సంబంధ లోపాలు, అంధత్వం, మానసిక మాంద్యం, అభ్యాసన లోపాలు, భావోద్వేగ భంగం, మెదడుకు సంబంధించిన లోపాలున్న విద్యార్థులున్న వాటిలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ విధమైన లోపాలున్న విద్యార్థులకు సంప్రదాయ బోధన పద్ధతుల ద్వారా నేర్చుకోవడం వీలుపడదు. కాబట్టి, వీరికి ప్రత్యేక విద్యాశిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది.


మా అబ్బాయి సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. ‘ఎ’ గ్రేడ్‌లోనే మార్కులు వస్తుంటాయి. తర్వాత ఇదే సిలబస్‌తో 11, 12 ఎంపీసీలో చేరుద్దామని అనుకుంటున్నాం. ఇది మంచిదేనా? లేదంటే స్టేట్‌ సిలబస్‌తో ఇంటర్‌ చదివించడం మేలా? రెండింటికీ తేడాలేంటి?

- పి. గంగాభవాని, విశాఖపట్నం

మీ అబ్బాయికి మొదట ఏ కోర్సుపై ఆసక్తి ఉందో తెలుసుకోండి. అతని ఆసక్తినిబట్టి కోర్సులో చేర్పించండి. స్టేట్‌ సిలబస్‌, సీబీఎస్‌ఈ రెంటినీ పోలిస్తే సిలబస్‌, ప్రశ్నపత్రం నమూనా మొదలైనవి భిన్నంగా ఉంటాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌ మనదేశం మొత్తానికి ఒకేలా ఉంటుంది. కానీ, స్టేట్‌ సిలబస్‌ రాష్ట్రాన్నిబట్టి మారుతుంది. సీబీఎస్‌ఈలో విద్యార్థికి ఆసక్తి ఉన్న సబ్జెక్టు చదవచ్చు. కానీ, స్టేట్‌ బోర్డ్‌లో అన్ని సబ్జెక్టులూ కలిపి చదవాలి.
సీబీఎస్‌ఈ సర్టిఫికెట్‌కు విదేశాల్లోనూ గుర్తింపు ఉంటుంది. స్టేట్‌ సిలబస్‌తో పోలిస్తే ఇది కొంచెం కఠినం. మీ అబ్బాయి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లోనే చదివాడు కాబట్టి, ఇంటర్‌ కూడా ఇదే సిలబస్‌తో కొనసాగించడం మేలు. పైగా స్టేట్‌ సిలబస్‌ కొంచెం వేరుగా ఉంటుంది; కొంచెం ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.
రెండింటిలో ఏది మెరుగో చెప్పలేం. రెండింటికీ వాటిదైన ప్రత్యేకత ఉంటుంది. ఒకవేళ మీ అబ్బాయి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే సీబీఎస్‌ఈ తోడ్పడుతుంది. మన రాష్ట్రంలో చదవాలనుకుంటే స్టేట్‌ సిలబస్‌ను ఎంచుకోవచ్చు.


తెలుగు మీడియంలో పదో తరగతి చదువుతున్నాను. వ్యవసాయ రంగంలో ఉన్నతవిద్యను అభ్యసించాలనుంది. అగ్రి బీఎస్‌సీ చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్‌ పూర్తిచేయాల్సిందేనా? అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ చేస్తే ఎలా ఉంటుంది?

- రెడ్డి అమర్‌నాథ్‌, విజయనగరం

మనదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది కదా? దానికి తోడ్పడే అగ్రికల్చర్‌ కోర్సు చేయాలనుకోవడం అభినందనీయం. మీరు వ్యవసాయ రంగంలో ఉన్నతవిద్యను అభ్యసించాలంటే మొదట అగ్రికల్చర్‌లో ఏ కోర్సు చేయాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. ఒకవేళ మీరు బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చదవాలంటే ఇంటర్‌ తప్పనిసరిగా చదవాలి. తర్వాత ఎంసెట్‌ రాసి, బీఎస్‌సీ అగ్రికల్చర్‌లో ప్రవేశం పొందవచ్చు.
అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ చదివితే, తర్వాత బీఎస్‌సీ (అగ్రికల్చర్‌) చేసి, ఉన్నత చదువులు కొనసాగించవచ్చు. ఇంటర్మీడియట్‌ చేసిన తర్వాత అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంటే, బీటెక్‌ (అగ్రికల్చర్‌) తర్వాత ఎంటెక్‌ చదివి, పీహెచ్‌డీ చేయవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని