ఆనర్స్‌ కోర్సులంటే..?

* ఇంటర్‌ (ఎంపీసీ) పూర్తిచేశాను. నా మిత్రుడు అయిదేళ్ల లా ఆనర్స్‌ చేయమంటున్నాడు....

Published : 17 Apr 2017 01:43 IST

ఆనర్స్‌ కోర్సులంటే..?

* ఇంటర్‌ (ఎంపీసీ) పూర్తిచేశాను. నా మిత్రుడు అయిదేళ్ల లా ఆనర్స్‌ చేయమంటున్నాడు. అసలు ‘లా’కూ, లా ఆనర్స్‌కూ తేడా ఏంటి? ఇంకా చాలా కోర్సుల్లో (ఉదా: బీకాం-ఆనర్స్‌) ఇలాంటివి ఉన్నాయి. అకడమిక్‌ కోర్సుల్లో ఆనర్స్‌ అంటే ఏమిటి?

- సీహెచ్‌ రఘు కిరణ్‌, నాగారం, నిజామాబాద్‌ జిల్లా

* సాధారణంగా లా అనేది మూడు సంవత్సరాల కోర్సు. దీన్ని డిగ్రీ తర్వాత చదవవచ్చు. లా ఆనర్స్‌ అయిదు సంవత్సరాల కోర్సు. దీన్ని ఇంటర్మీడియట్‌ తర్వాత చదవవచ్చు. లా ఆనర్స్‌లో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు- బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీకాం ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీఎస్‌సీ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీబీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) మొదలైన కోర్సులు అందుబాటులో ఉంటాయి.

లా అయితే 3 సంవత్సరాల లా సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. లా ఆనర్స్‌లో మొదటి రెండు సంవత్సరాలు విద్యార్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌ సబ్జెక్టులు, తర్వాతి 3 సంవత్సరాలు లాకు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. అయితే మనదేశంలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆనర్స్‌ డిగ్రీని ఇంటిగ్రేటెడ్‌ కోర్సుగా, మరికొన్ని స్పెషలైజేషన్‌తో కూడిన డిగ్రీగా అందిస్తున్నారు. ఉదాహరణకు- బీఏ డిగ్రీ + ఎంఏ డిగ్రీ లేదా ఆసక్తి ఉన్న ఒకే సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేయడాన్ని ఆనర్స్‌ అంటారు. దీన్ని 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కోర్సుగా అందిస్తారు. ఇది ఒక్కో యూనివర్సిటీని బట్టి వేర్వేరుగా ఉంటుంది.

* మా అబ్బాయి ఇంజినీరింగ్‌ (ఈసీఈ) తుది సంవత్సరం చదువుతున్నాడు. తను ఎంబీఏ/ ఎంటెక్‌లలో ఏది చేస్తే ఉత్తమం? ఏది చదివితే ఉద్యోగాలు వస్తాయి?

-కె. ప్రసాద్‌ రావు, గూడూరు, నెల్లూరు జిల్లా

* ఎంబీఏ, ఎంటెక్‌ల్లో ఏ కోర్సు ఉత్తమం అనేది చెప్పలేం. ఎందుకంటే ఏ కోర్సుకు అయినా తనదైన ప్రత్యేకతతోనే ఉంటుంది. ఇంజినీరింగ్‌ తర్వాత ఎంబీఏ లేదా ఎంటెక్‌ల్లో ఏ కోర్సు చదివినా ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానీ కోర్సు ఎంపిక చదివేవారి ఆసక్తిపై ఆధారపడితే మంచిది. మీ అబ్బాయికి ఇంజినీర్‌ అవ్వాలనుకుంటే ఎంటెక్‌ లేదా వ్యాపారం పట్ల ఆసక్తి ఉంటే ఎంబీఏ కోర్సును ఎంచుకోమనండి. అవకాశాలు రెండింటికీ పుష్కలంగానే ఉంటాయి. ఆసక్తి ఉంటేనే కదా ఎవరైనా దేనిలోనైనా రాణించేది! అందుకే ఎవరో చెప్పారని ఆసక్తిలేనిదాన్ని ఎంచుకోమనకండి.
* మా అబ్బాయి పదో తరగతి తర్వాత ఈసీఈ ట్రేడ్‌తో పాలిటెక్నిక్‌ డిప్లొమా 2016లో పూర్తిచేశాడు. బీటెక్‌ చదవడానికి ఇష్టపడటం లేదు. తను ఇంటర్‌లోకానీ డిగ్రీలోకానీ ప్రవేశం పొందవచ్చా? అలాగే డిప్లొమాతో ఏమేం ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలుపగలరు.

- ఎస్‌. రంగలక్ష్మి, అనంతపురం

* పదో తరగతి చదివినవారు ఇంటర్మీడియట్‌ చదవడానికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. పాలిటెక్నిక్‌ డిప్లొమా ద్వారా డిగ్రీ ప్రవేశం పొందవచ్చు. ఈసీఈ డిప్లొమా ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

బీహెచ్‌ఈఎల్‌, సెయిల్‌, గెయిల్‌, ఇస్రో, డీఆర్‌డీఓ, బీఈఎల్‌, బార్క్‌, హెచ్‌ఏఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు డిప్లొమా వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఎలక్ట్రానిక్‌, ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌ రంగాల్లో కూడా ఈసీఈ డిప్లొమా వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిప్లొమాతోపాటుగా ఏదైనా కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.
* ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఎంఏ ఇంటిగ్రేటెడ్‌ చేయాలనుకుంటున్నాను. దీనికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఈ కోర్సును ఏ రాష్ట్ర, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి?

- కె. రమేష్‌ యాదవ్‌, నాగర్‌ కర్నూలు జిల్లా

* ఈమధ్య కాలంలో పరభాషా మోజులోపడి యువత మాతృభాషకు దూరమవుతున్న నేపథ్యంలో మీరు తెలుగును ఎంచుకోవడం అభినందనీయం. తెలుగులో ఎంఏ చేసినవారికీ, ఇంటిగ్రేటెడ్‌ వారికీ ఉద్యోగావకాశాల విషయంలో ఎటువంటి తేడాలు ఉండవు. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏతోపాటు మీకు ఆసక్తి ఉంటే జర్నలిజంలో కూడా డిగ్రీ చేస్తే, పత్రికా రంగంలో ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ పూర్తిచేసిన తర్వాత తెలుగు పండిట్‌ శిక్షణకు వెళ్లవచ్చు. నెట్‌, సెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే డిగ్రీ కళాశాల లెక్చరర్‌ పోస్టులకు అర్హులవుతారు. అలాగే ఎంఫిల్‌, పీహెచ్‌డీ లాంటి కోర్సులు చేస్తే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.

అయిదు సంవత్సరాల ఎంఏ ఇంటిగ్రేటెడ్‌ తెలుగును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందిస్తుంది. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన వెలువడింది. దరఖాస్తు చేయడానికి చివరితేదీ- మే 5, 2017. ఈ ప్రవేశపరీక్షకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 2017 జూన్‌ 1 నుంచి 5 తేదీల మధ్య ప్రవేశపరీక్షలను నిర్వహిస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అయిదు సంవత్సరాల ఎంఏ ఇంటిగ్రేటెడ్‌ తెలుగు అందుబాటులో లేదు. ఏవైనా విశ్వవిద్యాలయాలకు ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టే ఉద్దేశం ఉంటే, ఆ విషయాలు సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి మీరు తరచుగా వివిధ విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లు, ప్రవేశ ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని