ఆర్కియాలజిస్ట్‌ అవ్వాలని ఉంది!

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో పాలిటెక్నిక్‌ ద్వారా డిప్లొమా పూర్తిచేశాను. ఉద్యోగం చేస్తూ బీటెక్‌/ ఏఎంఐఈ...

Published : 22 May 2017 01:44 IST

ఆర్కియాలజిస్ట్‌ అవ్వాలని ఉంది!

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో పాలిటెక్నిక్‌ ద్వారా డిప్లొమా పూర్తిచేశాను. ఉద్యోగం చేస్తూ బీటెక్‌/ ఏఎంఐఈ చేయడానికి అవకాశం ఉందా? ఉంటే, ఆ కోర్సులను అందిస్తున్న విశ్వవిద్యాలయాలు ఏవి? ఏఎంఐఈకి, రెగ్యులర్‌ బీటెక్‌తో సమాన గుర్తింపు ఉంటుందా?

- భీమిరెడ్డి నిఖిల్‌ కుమార్‌ రెడ్డి, అనంతపురం

పాలిటెక్నిక్‌ చదివినవారికి కూడా ఏఎంఐఈ, రెగ్యులర్‌ బీటెక్‌ చేసినవారితో సమానంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఏఎంఐఈ కోర్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందింది. కాబట్టి బీఈ/ బీటెక్‌ చదివిన వారితో సమానంగా వీరు కూడా యూపీఎస్‌సీ, గేట్‌ లాంటి పరీక్షలు రాయడానికి అర్హులే. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సుకి సంబంధించిన స్టడీ సెంటర్లు జేఎన్‌టీయూ-కాకినాడ, జేఎన్‌టీయూ-అనంతపురం, ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌)లోని విశ్వేశ్వరయ్య భవన్‌, తెలంగాణ స్టేట్‌ సెంటర్‌, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఎన్‌ఐటీ-వరంగల్‌ మొదలైన విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి.


మా అబ్బాయి ఇంటర్‌ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ (మ్యాథ్స్‌) చేసింది. ఎడ్‌సెట్‌ రాయడానికి అర్హత ఉంటుందా?

- కె. అప్పారావు, శ్రీకాకుళం

ఇప్పటివరకూ ఇచ్చిన ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌లో దూరవిద్య చదివినవారికి అర్హత ఉండదని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మీ అమ్మాయికి అర్హత ఉంది. ఒకవేళ నోటిఫికేషన్‌లో దూరవిద్య ద్వారా డిగ్రీ చదివినవారికి అర్హత లేదు అని ఇస్తే అప్పుడు మాత్రమే ఉండదు. ఇవ్వనంతవరకు అర్హత ఉంటుంది.


ఇంటర్‌ (బైపీసీ), బీఏ తర్వాత బీఈడీ పూర్తిచేశాను. ఆర్కియాలజిస్ట్‌ అవ్వాలని ఉంది. దీనికి ప్రత్యేకంగా ఏదైనా కోర్సు చేయాలా? ఉంటే ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలియజేయండి. ప్రవేశపరీక్ష, భవిష్యత్‌ ఉద్యోగావకాశాల గురించి తెలియజేయండి.

- కంటు త్రివేణి, సూర్యాపేట

ఆర్కియాలజిస్టు కావాలనే మీ ఆసక్తి అభినందనీయం. ఇందుకు మీరు డిగ్రీలో (బీఏ స్థాయిలో) హిస్టరీ/ ఆర్కియాలజీ సబ్జెక్టును చదివి ఉండాలి. ఆ తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా డిగ్రీ కోర్స్‌ ఇన్‌ ఆర్కియాలజీ చదవాలి. నుమిస్మాటిక్స్‌, ఎపిగ్రఫీ, ఆర్కివ్స్‌, మ్యూజియాలజీ అనేవి ఆర్కియాలజీ ముఖ్య బ్రాంచీలు. దీనిలో వివిధ రకాల స్పెషలైజేషన్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు జియో ఆర్కియాలజీ, బయో ఆర్కియాలజీ, హిస్టారికల్‌ ఆర్కియాలజీ, ఎత్నో ఆర్కియాలజీ, కంప్యూటేషనల్‌ ఆర్కియాలజీ.
వీటిల్లో మీకు ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోవచ్చు. తర్వాత పీహెచ్‌డీని మీకు నచ్చిన స్పెషలైజేషన్‌లో చేయవచ్చు. అయితే ఈ కోర్సుకు ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రకమైన ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు రాష్ట్రస్థాయి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఆర్కియాలజీ చదివినవారు యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించవచ్చు. ఆర్కియాలజిస్ట్‌లకు రక్షణ రంగం, మ్యూజియాలు, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, కల్చరల్‌ సెంటర్లలోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.
వీరు సెట్‌, నెట్‌ ద్వారా అధ్యాపకులు, పరిశోధకులుగా కూడా స్థిరపడవచ్చు. వీటితోపాటు టూరిజం రంగం, క్యూరేటర్స్‌, హెరిటేజ్‌ కన్సర్వేటర్స్‌, ఆర్కివిస్ట్‌లుగా కూడా వీరికి అవకాశాలుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని