ఫుడ్‌ టెక్నాలజీలో అవకాశాలేమిటి?

ప్రస్తుతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాను. దూరవిద్య విధానంలో బయాలజీ, ఇంగ్లిష్‌, మెథడాలజీలతో బీఈడీ చేయాలని ఉంది. అందించే విశ్వవిద్యాలయాలు, వాటి ప్రకటన వివరాలను తెలియజేయండి.

Published : 12 Jun 2017 02:12 IST

ఫుడ్‌ టెక్నాలజీలో అవకాశాలేమిటి?

* ప్రస్తుతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాను. దూరవిద్య విధానంలో బయాలజీ, ఇంగ్లిష్‌, మెథడాలజీలతో బీఈడీ చేయాలని ఉంది. అందించే విశ్వవిద్యాలయాలు, వాటి ప్రకటన వివరాలను తెలియజేయండి.

- జి. విశాల్‌, జగిత్యాల

* * మన తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, అంబేడ్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయం మొదలైనవి దూరవిద్య ద్వారా బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) ని అందిస్తున్నాయి. కనీసం రెండు సంవత్సరాల బోధనానుభవం ఉన్న అధ్యాపకులకు ఈ విశ్వవిద్యాలయాల్లో దూరవిద్య ద్వారా బీఈడీ చేయడానికి అర్హత ఉంటుంది.

ఈ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కోసారి విడుదల చేస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం జూన్‌లో, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం జనవరిలో, అంబేడ్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయం డిసెంబర్‌లో ప్రకటనలు విడుదల చేస్తారు. ఉస్మానియా మాత్రం ఇతర దూరవిద్య కోర్సులకు ఏప్రిల్‌లో, బీఈడీ, ఎంఫిల్‌ లాంటి కోర్సులకు యూనివర్సిటీ సూచన మేరకు ప్రకటనలు విడుదలచేస్తుంది. కాబట్టి తరచూ వెబ్‌సైటü చూస్తూ ఉండటం వల్ల నోటిఫికేషన్‌ వచ్చినపుడు తెలిసే అవకాశం ఉంది.

* ఎంఏ (ఇంగ్లిష్‌) తర్వాత బీఈడీ చేశాను. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచుకోవాలని ఉంది. ఇందుకు నేనేం చేయాలి? ఇంగ్లిష్‌లో పీజీ డిప్లొమా, టీచింగ్‌లో డిప్లొమా లాంటివి చేయవచ్చా? అందించే విశ్వవిద్యాలయాలేవి? వాటి ప్రకటనలు ఎప్పుడు ఉండొచ్చు?

- జి. ప్రశాంత్‌, హైదరాబాద్‌

* * ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం, బోధనా పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ఒక అధ్యాపకుడికి ఎంతో అవసరం. మన తెలుగు రాష్ట్రాల్లో ఇఫ్లూ (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ) వారు సంవత్సర కాలవ్యవధి గల పీజీసీటీఈ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ టీచింగ్‌ ఇంగ్లిష్‌) కోర్సును అందిస్తున్నారు. ఈ కోర్సుకి డిసెంబర్‌లో ప్రకటన విడుదలవుతుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా సీసీపీఈ (సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ప్రాక్టికల్‌ ఇంగ్లిష్‌), సీసీఈటీ (సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ టీచర్‌) లాంటి కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు ఆరు నెలల స్వల్ప కాలవ్యవధితో ఉంటాయి. ప్రకటన సంవత్సరానికి రెండుసార్లు వెలువడుతుంది. వీటితోపాటు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీడీసీఈ (పీజీ డిప్లొమా ఇన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌) కోర్సు అందుబాటులో ఉంది. జనవరి/ ఫిబ్రవరి నెలలో ఈ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ)లో ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలవ్యవధితో సీటీఈ (సర్టిఫికెట్‌ ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌) కోర్సు అందుబాటులో ఉంది. దీని ప్రకటన మే/ జూన్‌లో వస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే చాలా కోర్సులు కూడా ఉన్నాయి.edx, courseera లాంటి వెబ్‌సైట్లలో నమోదు చేసుకుంటే ఎక్కడినుంచైనా ఉచితంగా కోర్సులను చేయవచ్చు. వీటిలో చాలారకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి.

* బీటెక్‌ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ) 80%తో పూర్తిచేశాను. ఈ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలను తెలియజేయండి. ఒకవేళ నేను ఎంటెక్‌ చేయాలనుకుంటే వేటిని ఎంచుకోవచ్చు? తెలియజేయండి.

- షేక్‌ హుస్సేన్‌

* * బీటెక్‌- ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు చాలానే ఉంటాయి. ఈ కోర్సు చదివినవారికి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ), నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌, సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది.

మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వారు ఈమధ్యే 500 ఫుడ్‌ పార్కులను నెలకొల్పడానికి ప్రణాళిక ప్రకటనను విడుదల చేశారు. కాబట్టి మీకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ చదివినవారు క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌, ఫుడ్‌ ప్యాకింగ్‌ మేనేజర్‌, బ్యాక్టీరియాలజిస్ట్‌, లేబొరేటరీ సూపర్‌వైజర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌, ఫుడ్‌ టెక్నాలజీ లాంటి ఉద్యోగాలను పొందవచ్చు.

ఎంటెక్‌ చేయాలనుకుంటే.. ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌ బయోటెక్నాలజీ, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌, ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌ లాంటి స్పెషలైజెషన్లలో ఆసక్తి మేరకు ఎంచుకోవచ్చు.

ఎంటెక్‌ చదవడానికి కొన్ని విశ్వవిద్యాలయాలు గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ను, మరికొన్ని వాటి ప్రత్యేక పరీక్షల ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని