కెమికల్‌ ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు తగునా?

అనారోగ్య కారణంగా డిగ్రీలో కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు పాసవ్వలేదు. ఫలితాలు రాకముందే రాసిన ఐసెట్‌üలో 3780 ర్యాంకు వచ్చింది. ఆగస్టులో సప్లిమెంటరీ రాశాక ఏదైనా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుందా? లేదంటే వచ్చే మార్చిలో ఐసెట్‌ రాసేంతవరకూ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో చేరడం మంచిదా?

Published : 03 Jul 2017 02:10 IST

కెమికల్‌ ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు తగునా?

* అనారోగ్య కారణంగా డిగ్రీలో కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు పాసవ్వలేదు. ఫలితాలు రాకముందే రాసిన ఐసెట్‌üలో 3780 ర్యాంకు వచ్చింది. ఆగస్టులో సప్లిమెంటరీ రాశాక ఏదైనా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుందా? లేదంటే వచ్చే మార్చిలో ఐసెట్‌ రాసేంతవరకూ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో చేరడం మంచిదా?

- బి.హెచ్‌. సతీష్‌, బొబ్బిలి

టమి గురించి బాధపడకుండా ముందుకు వెళ్దామనే మీ ఆలోచన ఆచరణాత్మకం. ముందుగా మీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మీద దృష్టిపెట్టండి. పరీక్షలు ఆగస్టులో ఉంటే ఫలితాలు వెలువడటానికి కనిష్ఠంగా నెలరోజులకుపైగా సమయం పడుతుంది. ఈలోపు ఐసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ కూడా పూర్తయ్యి తరగతులు మొదలుకావచ్చు.

ముందుగా మీకు ఆసక్తి ఉన్న కోర్సు- ఎంబీఏ/ ఎంసీఏను ఎంచుకోండి. మీకు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, మేనేజ్‌మెంట్‌ పట్ల ఆసక్తి ఉంటే ఎంబీఏను ఎంచుకోండి. ఎంబీఏ చేయాలనుకుంటే..ఐసెట్‌ కౌన్సెలింగ్‌ మీ పరీక్ష ఫలితాలు వెలువడే సరికే అయిపోతుంది కాబట్టి, క్యాట్‌కు సన్నద్ధం అవ్వొచ్చు. దీనికి ప్రకటన ఆగస్టులో విడుదలవుతుంది. పరీక్షను నవంబర్‌లో నిర్వహిస్తారు. మంచి క్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా పేరున్న సంస్థలో సీటు సంపాదించుకోవచ్చు.

కంప్యూటర్స్‌, మేథమేటిక్స్‌ పట్ల ఆసక్తి ఉంటే ఎంసీఏను ఎంచుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రసిద్ధి చెందిన జాతీయ విద్యాలయాల్లో అభ్యసించడం కెరియర్‌ పరంగా శ్రేయస్కరం. కాబట్టి, మీ పరీక్ష ఫలితాలు, ప్రవేశపరీక్ష సబ్జెక్టులపై ఉన్న పట్టు ఆధారంగా మీకు కోచింగ్‌ ఎంతవరకూ అవసరమో నిర్ణయించుకోండి.

* కెమికల్‌ ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు తగిన కోర్సేనా? నాలుగేళ్ల కోర్సు తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి?

- విశ్వనాథం శ్రీదేవి

భ్యసించే విద్యకు, చేసే ఉద్యోగానికి ఆడ, మగ అనే లింగ భేదం ఉండదు. ప్రతి మ్యానుఫాక్చరింగ్‌ సంస్థకు తమ ఫ్యాక్టరీలు, పరిశోధన కార్యకలాపాల్లో, కెమికల్‌ ఇంజినీర్లు తప్పనిసరిగా కావాలి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా పొందినవారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రాసెస్‌ డిజైన్‌ ఇంజినీర్‌, సేఫ్టీ స్పెషలిస్ట్‌, సీనియర్‌ ఇంజినీర్‌, మ్యానుఫాక్చరింగ్‌ కన్సల్టెంట్‌, పరిశోధన రంగాల్లో అవకాశాలు లభిస్తాయి.

మన దేశంలో ఈ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థుల్లో 45% నుంచి 55% అమ్మాయిలే. కాబట్టి, కోర్సు పూర్తి చేసినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, ఆంధ్ర, జేఎన్‌టీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ ప్రముఖ కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆత్మన్యూనత భావాన్ని వదిలి, ధైర్యంగా కోర్సును ఎంచుకోండి.

* ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేశాను. మెకానికల్‌ ఇంజినీర్‌ కావాలని అనుకుంటున్నాను. నా లక్ష్యం నెరవేరడానికి పాలిటెక్నిక్‌లో చేరాలా? ఇంటర్‌లో ఎంపీసీ చదవాలా? ఏది మెరుగు?

- వి. రవితేజ

పాలిటెక్నిక్‌, ఇంటర్మీడియట్‌ కోర్సులు ఇంజినీరింగ్‌ పూర్తిచేయడానికి రెండు మార్గాలు. రెండింటికీ 6 (3+3, 2+4) సంవత్సరాల సమయమే పడుతుంది. పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన తర్వాత ఏ కారణంతోనైనా బీటెక్‌ ప్రవేశం పొందలేకపోయినా ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. అయితే పాలిటెక్నిక్‌ కోర్సు చేయాలనుకున్నప్పుడు ఉత్తమ ప్రమాణాలున్న కళాశాలను ఎంచుకున్నప్పుడే విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది.

పాలిటెక్నిక్‌ పూర్తయ్యాక ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ ప్రవేశం పొందవచ్చు. అయితే రెండు కోర్సులూ మంచివే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. మెకానికల్‌ ఇంజినీర్లకు విషయ పరిజ్ఞానంతోపాటు లోతుగా ఆలోచించడం, క్రియేటివిటీ తప్పనిసరి. ఈ లక్షణాలను మీలో పెంపొందించుకోగలిగితే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు.

- ప్రొ. బి. రాజశేఖర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని