ఏర్‌ టికెటింగ్‌.. ఎలా?

ఇంటర్‌ (సీఈసీ) పూర్తిచేశాను. ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ లేదా ఏర్‌ టికెటింగ్‌ చేయాలనుంది. వీటిలో ఏది మేలు? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఈ కోర్సులను అందించే కళాశాలల వివరాలను తెలపండి.

Published : 17 Jul 2017 01:36 IST

ఏర్‌ టికెటింగ్‌.. ఎలా? 

* ఇంటర్‌ (సీఈసీ) పూర్తిచేశాను. ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ లేదా ఏర్‌ టికెటింగ్‌ చేయాలనుంది. వీటిలో ఏది మేలు? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఈ కోర్సులను అందించే కళాశాలల వివరాలను తెలపండి.
- పి. బాబా షోయబ్‌, మదనపల్లి, చిత్తూరు

* ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్‌, ఏర్‌ టికెటింగ్‌లకు తమదైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు కోర్సులూ విమానయాన సేవలను అందిస్తున్నాయి. కాబట్టి, రెండింటిలో మీ ఆసక్తిమేరకు ఎంచుకోండి. ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్‌ కోర్సు ముఖ్యంగా విమానాశ్రయ అంతర్జాతీయ స్థాయి పర్యావరణాల్లో పనిచేయడానికి, ప్రపంచ నలుమూలలా ఉండే ప్రజలను కలుసుకుని, సాయం చేయడానికి ఇష్టపడే అభ్యర్థుల కోసం రూపొందించారు.

ఏర్‌ టికెటింగ్‌ ప్రధానంగా విమానాల బుకింగ్‌, టికెట్‌ రిజర్వేషన్‌, ప్రయాణ ప్రణాళికను రూపొందించడం, ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లను చేయడం లాంటి నైపుణ్యాలను అలవరచుకోవడం వంటివాటితో కూడి ఉంటుంది. ఐఏటీఏ (ఇంటర్నేషనల్‌ ఏర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌) జీఎంఆర్‌ వారు నాలుగు నెలల వ్యవధిగల సర్టిఫికెట్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, గ్రౌండ్‌ హాండ్లింగ్‌ డిప్లొమా ఇన్‌ ఏర్‌ టికెటింగ్‌ కోర్సులను అందిస్తున్నారు.

* బయాలజీలో దూరవిద్య ద్వారా డిగ్రీ (మూడో సంవత్సరం) చదువుతున్నాను. ఎంఎస్‌సీ జియాలజీ రెగ్యులర్‌ విధానంలో చేయాలనుంది. దీంతోపాటు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలకూ సిద్ధమవాలనుకుంటున్నాను. వీటికి సంబంధించి ఏవైనా శిక్షణ సంస్థలున్నాయా? ఉద్యోగాన్ని అందించే ఇతర పరీక్షల వివరాలూ తెలపండి.
- సాదియా సుల్తానా

* డిగ్రీ దూరవిద్యలో అభ్యసించినవారు రెగ్యులర్‌గా పీజీ చదవడానికి ఎలాంటి అవరోధం లేదు. కానీ, ఎంఎస్‌సీ (జియాలజీ) చేయాలనుకునే వారు బీఎస్‌సీ (జియాలజీ) పూర్తిచేసి ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు బీఎస్‌సీలో జియాలజీని ఒక సబ్జెక్టుగా మూడు సంవత్సరాలు చదివినవారికీ అవకాశం కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, దిల్లీ యూనివర్సిటీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇలా అందిస్తున్న వాటిలో ఉన్నాయి. దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి నగరాల్లోని కొన్ని ప్రైవేటు సంస్థలు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన శిక్షణను అందిస్తున్నాయి. డిగ్రీ పూర్తిచేశారు కాబట్టి పబ్లిక్‌ సర్వీస్‌ నియామక పరీక్షలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలు, బ్యాంకు పరీక్షలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. జియాలజీ పీజీ ఉత్తీర్ణులైనవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జియో ఫిజిసిస్ట్‌, జియాలజిస్ట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, మేనేజర్‌- మైనింగ్‌ లాంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* డిప్లొమా (ఈఈఈ) 80%తో పూర్తిచేశాను. ఆర్థిక అననుకూల పరిస్థితుల కారణంగా బీటెక్‌ చేయలేకపోతున్నాను. వన్‌ సిట్టింగ్‌లో బీటెక్‌ పరీక్షలు రాస్తే, నాకు బీటెక్‌ అర్హత ఉన్నట్లేనా? బీటెక్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు నేను దరఖాస్తు చేసుకోవచ్చా?
- ఎం. మహేష్‌

* వన్‌ సిట్టింగ్‌లో డిగ్రీ లేదా బీటెక్‌ చేయడం అసలు అందుబాటులో లేదు. ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌ లేదా కళాశాల ఇలా అందించినా దానివల్ల విద్య, ఉద్యోగపరంగా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. బీటెక్‌ అర్హత సాధించాలంటే మీరు రెగ్యులర్‌ విధానంలోనే చదవాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో దూరవిద్యలో ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఐఈ) వారు అందిస్తున్న ఏఎంఐఈ కోర్సును ఎంచుకోవచ్చు. బీటెక్‌కు సమాన అర్హతగా ఈ కోర్సును పరిగణిస్తారు. అప్పుడు బీటెక్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకూ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని