ఇంటర్‌ లేకుండా ఎల్‌ఎల్‌బీ?

బీఎస్‌సీ (ఎంపీసీఎస్‌) 2017లో పూర్తైంది. ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌) చేయాల....

Published : 14 Aug 2017 02:13 IST

ఇంటర్‌ లేకుండా ఎల్‌ఎల్‌బీ? 

బీఎస్‌సీ (ఎంపీసీఎస్‌) 2017లో పూర్తైంది. ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌) చేయాలనుంది. విశ్వవిద్యాలయాన్ని ఎలా ఎంచుకోవాలి? పరిశోధనలోనూ ఆసక్తి ఉంది. అందుకు నేను ఏయే అంశాలపై దృష్టిసారించాలి?

- వీరేంద్ర, విజయవాడ

ఎంఎస్‌సీ అభ్యసించాలనుకునే విద్యార్థులు ఐఐటీవారు నిర్వహించే జామ్‌ (JAM)పరీక్ష లేదా వివిధ ఎన్‌ఐటీలు నిర్వహించే ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. బోధన, పరిశోధనలపరంగా అత్యున్నత ప్రమాణాలున్న, పీజీలోనే పరిశోధనలను ప్రోత్సహించే విశ్వవిద్యాలయాల్లో పీజీ చేయడం వల్ల పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకోవచ్చు. లోతుగా అధ్యయనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతోపాటు సీఎస్‌ఐఆర్‌ నెట్‌- జేఆర్‌ఎఫ్‌ పరీక్షకు సిద్ధం కావడం ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందవచ్చు.

దూరవిద్య ద్వారా బీకాం చేసి, ఎంబీఏ (2008) రెగ్యులర్‌ విధానంలో పూర్తిచేశాను. కానీ, నేను ఇంటర్మీడియట్‌ చదవలేదు. ఎల్‌ఎల్‌బీ చేయాలనుంది. నాకు రెగ్యులర్‌ విధానంలో చేసే వీలుందా?
- ఎస్‌. కిరణ్‌ కుమార్‌
మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ చేయదలచిన అభ్యర్థులు ఏపీ లాసెట్‌ లేదా తెలంగాణ లాసెట్‌ నిబంధనల ప్రకారం 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ 45% మార్కులతో పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. క్లాట్‌ ద్వారా ఎల్‌ఎల్‌బీ చేయాలనుకుంటే 10+2 పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. గరిష్ఠ వయఃపరిమితి జనరల్‌ వారికి 20 ఏళ్లు, రిజర్వ్‌డ్‌ వారికి 22 ఏళ్లు. మీరు ఇంటర్‌ పూర్తిచేయలేదు కాబట్టి, ప్రస్తుతం మీకు ఎల్‌ఎల్‌బీ అభ్యసించడానికి అర్హత లేదు.
విదేశీ కళాశాలలతో సంబంధమున్న వాటిల్లో సైబర్‌లా లేదా హ్యూమానిటీస్‌ చదవాలనుంది. అటువంటి కళాశాలలు, వాటి అడ్మిషన్‌ల వివరాలను తెలియజేయండి.
- ఎం. లావణ్య
మీరు మీ విద్యార్హతలను తెలియజేయలేదు. సాధారణంగా సైబర్‌లా కోర్సును ఐటీ సంస్థల్లో పని చేసేవారు, ప్రాక్టీసింగ్‌ న్యాయవాదులు తమ అర్హతను పెంపొందించుకోవడానికి అభ్యసిస్తారు. నల్సార్‌ యూనివర్సిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీ, సింబయాసిస్‌ లా స్కూల్‌ వంటివి తమ విద్యార్థులకు అనుబంధ విదేశీ కళాశాలల్లో ఒక సెమిస్టర్‌ లేదా ఒక సంవత్సరంపాటు ఒక ఐచ్ఛికంగా సైబర్‌లా కోర్సును అభ్యసించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ విద్యాలయాల్లో క్యాట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు.
హ్యూమానిటీస్‌ విషయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎరాస్మస్‌ ప్రోగ్రాం ద్వారా విదేశంలో కొంతకాలం విద్యనభ్యసించే ఏర్పాటును కల్పిస్తున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలైన ఎస్‌ఆర్‌ఎం, గీతం వర్సిటీ, క్రయిస్ట్‌ విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు విదేశీ కళాశాలల్లో ఒక సెమిస్టర్‌ విద్యను పూర్తిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సంబంధిత వర్సిటీలు తమ సొంత ప్రవేశపరీక్ష ద్వారా హ్యూమానిటీస్‌ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.
డిగ్రీ (బీజెడ్‌సీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. సైకాలజీలో పీజీ చేయాలనుంది. నాకు అర్హత ఉందా? వాటికి ఉండే ప్రవేశపరీక్షలు, ఏయే అంశాల్లో వాటికి సన్నద్ధమవాల్సి ఉంటుంది?
- కృష్ణ
సైకాలజీలో పీజీ చేయాలనుకునేవారు డిగ్రీ సైకాలజీ చదివివుండాలి. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు ఏదైనా డిగ్రీ చదివినవారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ తమ సొంత ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నాయి.
సైకాలజీ అంటే మానసిక ప్రవర్తన, మనస్తత్వ శాస్త్ర అధ్యయనం, విశ్లేషణాత్మక ఆలోచన, సహనం వంటి అంశాల్లో అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని