ఫోరెన్సిక్‌ సైన్స్‌లో పీజీ ఎలా?

పొలిటికల్‌ సైన్స్‌ లేదా ఆర్కియాలజీలో పీజీ చేయదలచుకున్నవారు ఏదేని డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. మీరు ఇంజినీరింగ్‌ బ్యాచిలర్స్‌ పూర్తిచేశారు కాబట్టి, మీకు అర్హత ఉంది. జేఎన్‌యూ దిల్లీ, దిల్లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

Published : 25 Sep 2017 02:03 IST

ఫోరెన్సిక్‌ సైన్స్‌లో పీజీ ఎలా?

* ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. పీజీ చేయాలనుంది. పొలిటికల్‌ సైన్స్‌, ఆర్కియాలజీల్లో ఆసక్తి ఉంది. చదివే అవకాశముందా? లేదంటే మ్యాథ్స్‌ తప్పనిసరి కాని ఏవైనా పీజీ కోర్సులను తెలియజేయగలరు. - పవన్‌ కుమార్‌
 పొలిటికల్‌ సైన్స్‌ లేదా ఆర్కియాలజీలో పీజీ చేయదలచుకున్నవారు ఏదేని డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. మీరు ఇంజినీరింగ్‌ బ్యాచిలర్స్‌ పూర్తిచేశారు కాబట్టి, మీకు అర్హత ఉంది. జేఎన్‌యూ దిల్లీ, దిల్లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పీజీ అభ్యసించడం శ్రేయస్కరం. మీకు ఆసక్తి ఉన్న పై రెండు కోర్సుల్లోనూ మీరు కోరుకున్నట్టుగానే మేథ్స్‌ సబ్జెక్టు ఉండదు.

 

ఫార్మా-డి మూడో సంవత్సరం చదువుతున్నాను. దీని తర్వాత ఏయే కోర్సులను ఎంచుకుంటే నా కెరియర్‌కు అనుకూలం? నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలను తెలియజేయండి. - ఎ. అఖిల్‌

ఔషధాల ప్రభావాల సేకరణ, గుర్తింపు అంచనా, పర్యవేక్షణ, నివారణలకు సంబంధించిన ఔషధ శాస్త్రమే ఫార్మా-డి. ఆరు సంవత్సరాల ఫార్మా-డిని పూర్తిచేసిన అభ్యర్థులు రెండేళ్ల పోస్ట్‌ బ్యాకులెరేట్‌ పూర్తిచేసి పీహెచ్‌డీ పట్టా అందుకోవచ్చు. ప్రస్తుతం ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఈ కోర్సును గుర్తించింది. కాబట్టి త్వరలో ప్రభుత్వ కొలువులకూ ఆస్కారం ఉంటుంది.

ఫార్మా-డి పూర్తిచేసినవారు ఔషధ, హాస్పిటల్‌, బయోటెక్నాలజీ సంస్థల్లో మెడికల్‌ రైటర్స్‌, క్లినికల్‌ రిసర్చర్స్‌, సబ్జెక్టు మ్యాటర్‌ ఎక్స్‌పర్ట్స్‌ నియంత్రణ పత్రాల డెవలప్‌మెంట్‌, కమ్యూనిటీ ప్రాక్టీషనర్‌, డ్రగ్‌ ఎక్స్‌పర్ట్‌, అకడమిక్స్‌ రంగాల్లో ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.

 

* బీఎస్‌సీ, ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ పూర్తిచేసినవారు సాప్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించాలనుకుంటే ఏయే కోర్సులను చదవాల్సి ఉంటుంది? - సురేంద్ర  

ఐటీ డేటా సంబంధిత ఉద్యోగాల్లో నిపుణులకు ఈ మధ్యకాలంలో భారీగా గిరాకీ ఏర్పడింది. డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌, బిగ్‌ డేటా ఇంజినీర్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, గణాంక శాస్త్రవేత్తల వంటి ఉద్యోగ అభ్యర్థుల కోసం కంపెనీలు వెతుకుతుంటాయి. మంచి హోదా, జీతభత్యాలను అందిస్తున్నాయి. ఆర్‌-ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, పైథాన్‌, హడూప్‌, డాటా మైనింగ్‌ కోర్సుల్లో పట్టు సాధిస్తే సాప్ట్‌వేర్‌, డేటా రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

 

* ఫోరెన్సిక్‌ సైన్స్‌లో పీజీ చేయాలనుంది. అందుకు డిగ్రీ స్థాయిలో ఏ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది? వాటిని అందించే సంస్థల వివరాలను తెలియజేయండి? - బి. సాయి సంకీర్తన, హైదరాబాద్‌

నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపచేసి సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుక్కునే శాస్త్రమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అప్లయిడ్‌ సైన్స్‌ లేదా వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివే అర్హత ఉంటుంది. డిగ్రీ స్థాయిలో బీఎస్‌సీ ఫోరెన్సిక్‌ కోర్సును అమిటీ, గల్గోతియా, డా.హరిసింగ్‌ గౌర్‌ విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్‌లోని రాజా బహదూర్‌ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల అందిస్తున్నాయి. ఆసక్తీ, పరిశీలన నైపుణ్యాలూ, పరిశోధించే సహజ స్వభావం ఉన్న అభ్యర్థులు ఈ వృత్తిలో రాణిస్తారు.

* డెంటల్‌ సర్జన్‌గా చేస్తున్నాను. డిస్కవరీ, నేషనల్‌ జాగ్రఫీ సంస్థల్లో పనిచేయాలని ఆసక్తి. కుదురుతుందా? వాటి అర్హత వివరాలను తెలియజేయండి. - డి. కమలేశ్వర్‌ 

డిస్కవరీ, నేషనల్‌ జాగ్రఫీ సంస్థల్లో వివిధ విభాగాలు ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న విభాగం ఏమిటో తెలియజేయలేదు. ముందుగా మీకు ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకోండి. ఇలాంటి సంస్థలు కొన్నిసార్లు ఫ్రీలాన్సర్‌ ఉద్యోగాలను అందిస్తుంటాయి. ఒకసారి సంస్థ వెబ్‌సైట్‌లో కెరియర్‌ పేజీని సందర్శించండి. దీనివల్ల సంబంధిత శాఖలపై మీకు అవగాహన ఏర్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని