బీడీఎస్‌ తర్వాత పీజీ ఈఎన్‌టీ చేయొచ్చా?

ఎంఏ, బీఈడీ (సోషల్‌) చేసి, స్కూలు అసిస్టెంట్‌గా (10 సం.) చేస్తున్నాను. ఇప్పుడు ఎంఈడీ చేయాలనుకుంటున్నా. దూరవిద్య ద్వారా చేసే అవకాశం ఉందా? అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలపండి. - రఫీ, కడప

Published : 02 Oct 2017 01:56 IST

బీడీఎస్‌ తర్వాత పీజీ ఈఎన్‌టీ చేయొచ్చా?

* * ఎంఏ, బీఈడీ (సోషల్‌) చేసి, స్కూలు అసిస్టెంట్‌గా (10 సం.) చేస్తున్నాను. ఇప్పుడు ఎంఈడీ చేయాలనుకుంటున్నా. దూరవిద్య ద్వారా చేసే అవకాశం ఉందా? అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలపండి. - రఫీ, కడప
అవకాశం ఉంది. ఎంఈడీ కోర్సును దూరవిద్యలో చేయదలచినవారు సంబంధిత కోర్సును అందిస్తున్న విశ్వవిద్యాలయానికి కోర్స్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి ఉందని నిర్ధారించుకున్న తరువాతే కోర్సులో చేరాలి.

ఎంఈడీ అభ్యసించాలనుకునేవారు బీఈడీని 55% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల లేదా ఎడ్యుకేషన్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి రెండేళ్ల బోధనానుభవాన్ని కలిగివుండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కుల విషయంలో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఇగ్నో (IGNOU), బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వారు దూరవిద్యలో ఎంఈడీ కోర్సును అందిస్తున్నారు. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఏటా మే/ జూన్‌ నెలల్లో ప్రకటన వెలువడుతుంది.

* * బీఎస్‌సీ (బీజెడ్‌సీ) ఈ ఏడాదే పూర్తైంది. ప్లాంట్స్‌ అండ్‌ ఫారెస్ట్రీలో ఆసక్తి ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాల వివరాలను తెలపండి. - సుశీల

అడవుల నిర్వహణ, సంరక్షణ, మొక్కల పెంపకం, సహజ వనరుల రక్షణ, పర్యావరణ పునరుద్ధరణ, ప్రభుత్వ, ప్రైవేటు అటవీ ప్రాంతాల ప్రణాళిక- వాటి అభివృద్ధి కార్యకలాపాలను చూసుకునే విభాగమే ప్లాంట్స్‌ అండ్‌ ఫారెస్ట్రీ.

ప్రభుత్వ రంగంలో యూపీఎస్‌సీ నిర్వహించే ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌) రాసి, సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాన్ని పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, నర్సరీలు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ప్రకటనల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.

ప్రైవేటు రంగంలో.. ప్లాంటేషన్‌ ఫీల్డ్‌ మేనేజర్‌, నర్సరీ అడ్మినిస్ట్రేటర్‌, ప్రైవేట్‌ ఫారెస్ట్‌ ప్లానింగ్‌ మేనేజర్‌, కన్జర్వేషన్‌ మేనేజర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

* * మా అమ్మాయి బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. తను ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవడానికి అర్హురాలేనా? - డా. వి. బాలసుభాషిణి

ఈఎన్‌టీ చెవి, ముక్కు, గొంతు రుగ్మతలకు సర్జరీ, చికిత్స అందించే శాస్త్రం. ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవాలనుకునేవారు ఎంబీబీఎస్‌తోపాటు సంవత్సరంపాటు ఏదేని ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవేశపరీక్ష ద్వారా ఎంఎస్‌లో ప్రవేశం పొందవచ్చు. కాబట్టి బీడీఎస్‌ చదువుతున్నవారు ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవడానికి అవకాశం లేదు.

* * డిగ్రీ (బీఎస్‌సీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్‌వరకూ తెలుగు మాధ్యమంలో పూర్తిచేసి, డిగ్రీ నుంచి ఆంగ్లంలో చదువుతున్నాను. సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలనుకుంటున్నా. ఏ మాధ్యమాన్ని ఎంచుకుంటే మేలు?- ఎం. నవీన్‌ కుమార్‌, కీళగరం

సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారికి విషయపరిజ్ఞానం, సమస్యను లోతుగా విశ్లేషించే నేర్పు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండాలి. తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకూ అభ్యసించి ఇంగ్లిష్‌లో, డిగ్రీ వరకూ ఆంగ్లంలో చదివి, తెలుగులో.. సివిల్స్‌ రాసి విజయం సాధించినవారూ ఉన్నారు.

ఇటీవల రోణంకి గోపాలకృష్ణ తెలుగు మాధ్యమంలో సివిల్స్‌ రాసి, ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. కాబట్టి మీరు ఏ మాధ్యమంలో భావవ్యక్తీకరణ బాగా చేయగలరో దాన్నే ఎంచుకోండి. ఇంకా డిగ్రీలోనే ఉన్నారు కాబట్టి, ఇప్పటి నుంచే సివిల్స్‌ ప్రాథమిక సన్నద్ధతను మొదలుపెట్టండి.

* * మా అమ్మాయి బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. తనకు క్లినికల్‌ సైకాలజీలో మాస్టర్స్‌ చేయాలనుంది. ఇందుకు సాధారణంగా డిగ్రీలో సైకాలజీ చదివివుండాలని విన్నాను. తనకేమో ఈ కోర్సులోనే ఆసక్తి ఉంది. వేరే ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? ఉంటే ప్రవేశపరీక్ష, అందించే కళాశాలలు, విశ్వవిద్యాలయాల వివరాలను తెలియజేయండి. - ఎం.వి.వి. సుబ్బారావు, విజయవాడ

మానసిక అనారోగ్య స్వభావం, కారణాలు, చికిత్సల అధ్యయనంపై దృష్టి కేంద్రీకరించే మనస్తత్వశాస్త్రమే క్లినికల్‌ సైకాలజీ. మీరు విన్నట్టుగా క్లినికల్‌ సైకాలజీలో మాస్టర్స్‌ చేయాలంటే డిగ్రీలో సైకాలజీ ఒక ఐచ్ఛికం లేదా సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. మీ అమ్మాయికి ఆసక్తి ఉంటే.. ఇదే సబ్జెక్టులో ఎంఎస్‌సీ లేదా ఎంఏ చేయొచ్చు. అమిటీ విశ్వవిద్యాలయం, రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా యూనివర్సిటీలు ఎంఏ/ ఎంఎస్‌సీ (సైకాలజీ) చేసినవారికి ఎంఫిల్‌ (క్లినికల్‌ సైకాలజీ) చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని