దూరవిద్యలో ఎంఏ ఆంగ్లం.. ఎలా?

ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాను. భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలను పొందడానికి అనుబంధంగా ఏయే కోర్సులను నేర్చుకుంటే మేలు? - అఖిలేష్‌ ఏ ఉద్యోగం చేయడానికైనా ప్రాథమికాంశాలపై పట్టు, సూత్రాలు, భావనలపట్ల సూక్ష్మజ్ఞానం అవసరం. మీరింకా ప్రథమ సంవత్సరంలోనే ఉన్నారు కాబట్టి, సబ్జెక్టు పట్ల అవగాహన ఏర్పరచుకోండి. లోతుగా సబ్జెక్టులను నేర్చుకోవడానికి ఎన్‌.పి.టెల్‌, edx, course era వెబ్‌సైట్లను సందర్శించడి. తరగతి గది బోధన, చర్చలను శ్రద్ధగా అనుసరించండి.

Published : 09 Oct 2017 01:58 IST

దూరవిద్యలో ఎంఏ ఆంగ్లం.. ఎలా?

  ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాను. భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలను పొందడానికి అనుబంధంగా ఏయే కోర్సులను నేర్చుకుంటే మేలు? - అఖిలేష్‌


ఏ ఉద్యోగం చేయడానికైనా ప్రాథమికాంశాలపై పట్టు, సూత్రాలు, భావనలపట్ల సూక్ష్మజ్ఞానం అవసరం. మీరింకా ప్రథమ సంవత్సరంలోనే ఉన్నారు కాబట్టి, సబ్జెక్టు పట్ల అవగాహన ఏర్పరచుకోండి. లోతుగా సబ్జెక్టులను నేర్చుకోవడానికి ఎన్‌.పి.టెల్‌, edx, course era వెబ్‌సైట్లను సందర్శించడి. తరగతి గది బోధన, చర్చలను శ్రద్ధగా అనుసరించండి. స్కాడా, మ్యాట్‌ లాబ్‌, ఎంబెడెడ్‌-సి, పీసీబీ డిజైనింగ్‌ వంటి అదనపు కోర్సులను మీ అభిరుచికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. సాధారణంగా మూడో/ నాలుగో సంవత్సరంలో అనుబంధ కోర్సుల్లో శిక్షణ వల్ల ప్రాజెక్ట్‌ వర్క్‌, కోర్‌ కంపెనీల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు. ప్రస్తుతం మీ సెమిస్టర్‌ కోర్సులపై దృష్టిసారించడం మేలు.


బీఎస్‌సీ (బీజెడ్‌సీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఆ తర్వాత మెడిసినల్‌ బోటనీ (ఆయుష్‌/ ఆయుర్వేదిక్‌) చేయాలనుంది. అందించే కళాశాలల వివరాలను తెలియజేయండి.- రమ్య

మొక్కల ద్వారా మానవ ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఎన్నో. మొక్కల పెంపకం, సంరక్షణ, గుర్తింపు, నాణ్యత నియంత్రణ, కొత్త మొక్కల ఉత్పత్తి, వాటి వైద్య సామర్థ్యం, మేధోసంపత్తుపై దృష్టిసారించే విజ్ఞానశాస్త్రమే మెడిసినల్‌ బోటనీ.

సాధారణంగా పీజీ ఆయుష్‌ కోర్సులు చేయడానికి బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ చేసినవారు అర్హులు. కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా ఎంఎస్‌సీ మెడిసినల్‌ ప్లాంట్స్‌ కోర్సును ఎంచుకోవచ్చు. బుందేల్‌ఖండ్‌ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న ఎంఎస్‌సీ (ఆయుర్వేద ఆల్టర్నేట్‌ మెడిసిన్‌) కోర్సును అయినా ఎంచుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు అందించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెడిసినల్‌ బోటనీ కోర్సును కూడా అభ్యసించవచ్చు.


బీటెక్‌ చదువుతున్నాను. ఇంజినీరింగ్‌పై ఆసక్తి లేదు. ఎకనామిక్స్‌, సివిల్స్‌ సర్వీసుల్లో ఆసక్తి. నాకు ఎంఏ (ఎకనామిక్స్‌) చదివే అవకాశం ఉందా? నేరుగా సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవడం మేలా? పీజీ కానీ, ఉద్యోగంకానీచేసి ఆపై సన్నద్ధమవడం మంచిదా? - అరుణ్‌, హైదరాబాద్‌

మంచి విశ్వవిద్యాలయాల్లో ఎంఏ (ఎకనామిక్స్‌) చేయాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో ఎకనామిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయ ఎంట్రన్స్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు- 

క్రయిస్ట్‌ యూనివర్సిటీ- బెంగళూరు, గీతం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లు ఏదైనా డిగ్రీ చేసినవారికీ ఎంఏ (ఎకనామిక్స్‌) చదవడానికి అర్హత కల్పిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల ప్రవేశ వివరాలను తెలుసుకుని, మీకు అనుకూలంగా ఉన్నవాటికి దరఖాస్తు చేసుకోండి.

ఇక సివిల్స్‌ సన్నద్ధత విషయానికి వస్తే.. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు సివిల్స్‌ పరీక్ష రాయడానికి అర్హులు. పీజీ చదువుతూ, ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ఎంపికైనవారు చాలామందే ఉన్నారు. సాధారణంగా సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారికి విషయాన్ని లోతుగా విశ్లేషించడం, వివిధ కోణాల్లో సమస్యను పరిష్కరించగల నేర్పు, ప్రజాసంక్షేమం పట్ల ఆసక్తి ఉండాలి.

కాబట్టి అందుకు తగిన లక్షణాలు మీలో ఉంటే.. సమయం, ఆర్థిక స్థితులను దృష్టిలో ఉంచుకుని మీ సన్నద్ధతను ఎప్పుడు ప్రారంభించుకోవాలో నిర్ణయించుకోండి.


బీటెక్‌ (ఈఈఈ) 2015లో పూర్తిచేశాను. గత రెండు సంవత్సరాలుగా పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఎంఏ ఇంగ్లిష్‌ దూరవిద్య ద్వారా చేయాలనుంది. నాకు అర్హత ఉందా? అందించే కళాశాలల వివరాలను తెలపండి. - వీరా, కాకినాడ

దూరవిద్యలో ఎంఏ (ఇంగ్లిష్‌) చేయాలనుకునేవారు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ (3 లేదా 4 సంవత్సరాలు) పూర్తిచేసి ఉండాలి. మీది బీటెక్‌ పూర్తైంది కాబట్టి, మీకు అర్హత ఉన్నట్టే. మన తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, ఇఫ్లూ, గీతం విశ్వవిద్యాలయం వారు తమ అనుబంధ స్టడీసెంటర్ల ద్వారా ఎంఏ (ఇంగ్లిష్‌)ను దూరవిద్యలో అందిస్తున్నారు. మీ వీలును బట్టి మీకు సరైనదాన్ని ఎంచుకోండి. అలాగే సమయపాలన, ఆత్మవిశ్వాసం, సరైన సన్నద్ధతతో పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని