సీబీఐ అధికారి అవ్వాలంటే?

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. కొందరి స్ఫూర్తితో సీబీఐ ఆఫీసర్‌ కావాలనుకుంటున్నాను. అందుకు నేనేం చేయాల్సి ఉంటుంది?

Published : 23 Nov 2017 01:31 IST

సీబీఐ అధికారి అవ్వాలంటే?

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. కొందరి స్ఫూర్తితో సీబీఐ ఆఫీసర్‌ కావాలనుకుంటున్నాను. అందుకు నేనేం చేయాల్సి ఉంటుంది? - కె.వినయ్‌
జ: సీబీఐ అధికారి కావాలనుకునేవారు నిశితంగా విషయాన్ని శోధించడం, విశ్లేషణ నైపుణ్యాలు, సమస్య పరిశోధన, పరిష్కారం, బృందంతో పనిచేయగల నైపుణ్యాలు, నిజాయతీ, సమయస్ఫూర్తి, దూరదృష్టి వంటి లక్షణాలను అలవరచుకోవాలి. డిగ్రీ చదివినవారు సీబీఐ ఉద్యోగాలకు అర్హులు. ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాన్ని కల్పిస్తారు. కాబట్టి ఇప్పటినుంచే అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులపై దృష్టిసారించండి. వార్తాపత్రికలు, టీవీ వార్తలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉండండి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపైనా అవగాహనను పెంచుకోండి.


దూరవిద్యలో వ్యవసాయ కోర్సు?

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాను. నాకు వ్యవసాయ రంగంపై ఆసక్తి. దూరవిద్య ద్వారా కోర్సు అందించే సంస్థల వివరాలను తెలపండి - నాగేశ్వరరావు
జ: వ్యవసాయంపై మీకున్న ఆసక్తికి అభినందనలు. మీరు గ్రాడ్యుయేషన్‌లో ఏం చదివారో తెలియజేయలేదు. మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివివుంటే ఎంటెక్‌లో అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివి, వ్యవసాయంలో ఉపయోగపడే పరికరాల తయారీలో పాల్గొనవచ్చు. లేదా.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు కాబట్టి ఏదైనా యాప్‌ లాంటి టూల్‌ను తయారుచేసి వ్యవసాయ రంగానికి తోడ్పడే ప్రయత్నం చేయండి. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ చేయూతను ఇచ్చినవారవుతారు.

ఇక కోర్సుల విషయానికొస్తే.. వెల్లింగ్‌కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ దూరవిద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ అండ్‌ అగ్రిబిజినెస్‌, ఇగ్నో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ పాలసీ కోర్సులను అందిస్తున్నాయి. మీకు అర్హత ఉన్నదాన్ని బట్టి కోర్సును ఎంచుకోండి.


ఫోరెన్సిక్‌ లా చదవాలంటే?

ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఫోరెన్సిక్‌ లాపై ఆసక్తి ఉంది. అందించే కళాశాలలు, అర్హత వివరాలను తెలియజేయండి. - ఎస్‌. గురునాథ్‌
జ: ఫోరెన్సిక్‌ విజ్ఞానశాస్త్ర సాయంతో నేర ఘటనలపై దర్యాప్తు చేయడానికీ, న్యాయస్థానంలో నేరస్థుల ప్రాసిక్యూషన్‌లో సాక్ష్యాలను సేకరించడానికీ ఉపయోగపడే న్యాయశాస్త్ర అధ్యయనమిది. మనదేశంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వారు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారికి ఎంఏ (క్రిమినాలజీ) కోర్సును అందిస్తున్నారు. ఐఎఫ్‌ఎస్‌ ఎడ్యుకేషన్‌వారు ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ క్రిమినాలజీలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులనూ, పంజాబ్‌ యూనివర్సిటీ వారు డిప్లొమా ఇన్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ క్రిమినాలజీ కోర్సులనూ అందిస్తున్నారు.

ప్రస్తుతం మనదేశంలో కేవలం ఫోరెన్సిక్‌ లాపైనే కోర్సులు అందించే సంస్థలు తక్కువనే చెప్పాలి. విదేశాల్లో ఈ కోర్సుకు మంచి స్పందన ఉంది. మనదేశంలోని కొన్ని సంస్థలూ ఇప్పుడిప్పుడే ఈ కోర్సుపై దృష్టిపెడుతున్నాయి. త్వరలో అందుబాటులోకి రావొచ్చు.

* ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని