సివిల్‌ ఇంజినీర్‌గా.. ఆఫీసులో!

?బీటెక్‌ (సివిల్‌) 2015లో పూర్తిచేసి, కొన్ని నెలలపాటు సైట్‌ ఇంజినీర్‌గా చేశాను. కొన్ని అనారోగ్య కారణాలవల్ల ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను. సివిల్‌ ఇంజినీర్‌గా ఆఫీసు పని మాత్రమే ఉండే ఉద్యోగాలేమైనా ఉన్నాయా? భవిష్యత్తును...

Published : 11 Dec 2017 02:25 IST

సివిల్‌ ఇంజినీర్‌గా.. ఆఫీసులో!

?బీటెక్‌ (సివిల్‌) 2015లో పూర్తిచేసి, కొన్ని నెలలపాటు సైట్‌ ఇంజినీర్‌గా చేశాను. కొన్ని అనారోగ్య కారణాలవల్ల ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను. సివిల్‌ ఇంజినీర్‌గా ఆఫీసు పని మాత్రమే ఉండే ఉద్యోగాలేమైనా ఉన్నాయా? భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఇంకేమైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులు చేయాలా?

- సాయి ప్రశాంత్‌

జ: సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి ఆఫీసులో పనిచేసే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రాథమికాంశాలపై పట్టు మాత్రం సైట్‌లో అనుభవమున్న వారికి మాత్రమే ఎక్కువ. ఆన్‌సైట్‌లో పనిచేస్తున్నా లేకపోయినా సివిల్‌ ఇంజినీర్‌ ముఖ్యంగా సైట్‌కు సంబంధించిన పనికి తోడ్పడే పనులు చేయాలి. కాబట్టి సైట్‌ దగ్గర అనుభవం తప్పనిసరి.

సర్వేయర్‌, ఎస్టిమేటర్‌, కాస్ట్‌ ట్రాకర్‌/ ఆడిటర్‌, ఆర్కిటెక్చర్‌ డిజైనింగ్‌, క్యాడ్‌, క్యామ్‌ డిజైనర్‌, మేనేజ్‌మెంట్‌, బిల్లింగ్‌ విభాగాల్లో ఆఫీసులో పనిచేసే ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఈ ఉద్యోగాలు సైట్‌లో మూడు నుంచి అయిదేళ్ల పని అనుభవం ఉన్నవారికి అందుబాటులో ఉంటాయి.

కోర్సుల విషయానికొస్తే- సాఫ్ట్‌వేర్‌ కోర్సులైన ఎంఎస్‌- ప్రాజెక్ట్‌, ప్రైమావెరా, జియో స్టూడియో, 3డి, 4డి డిజైనింగ్‌, మిడాస్‌, ఆటోక్యాడ్‌, స్టాడ్‌, ప్రొ వంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను నేర్చుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు.


దూరవిద్యలో ఆర్కిటెక్చర్‌ పీజీ

?ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశాను. దూరవిద్య ద్వారా సంబంధిత కోర్సులో పీజీ చేద్దామనుకుంటున్నా. అందించే సంస్థల వివరాలను తెలపండి.

- కె.వి. నాయుడు, శ్రీకాకుళం

జ: ప్రొఫెషనల్‌ కోర్సులైన ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్యా కోర్సులను రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడమే శ్రేయస్కరం. మనదేశంలో ఆర్కిటెక్చర్‌ కోర్సులను దూరవిద్య ద్వారా ఏ విశ్వవిద్యాలయాలూ అందించడం లేదు.

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ (బైరిసర్చ్‌) (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) వారు పార్ట్‌టైం విధానంలో ఎంఆర్క్‌ కోర్సును అందిస్తున్నారు. బి.ఆర్క్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీఈసెట్‌ ద్వారా అర్హత కల్పిస్తారు. మరిన్ని వివరాలకు jnafau.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వివిధ ఆస్ట్రేలియన్‌, అమెరికా విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ దూరవిద్యా విధానంలో ఈ కోర్సును అందిస్తున్నాయి. కానీ కోర్సును ఎంచుకునే ముందు దాని వాలిడిటీ, గుర్తింపులను తెలుసుకుని నిర్ణయం తీసుకోండి.


* ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని