దూరవిద్యలో ఫైర్‌సేఫ్టీ

బీఏ చదివాను ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సును దూరవిద్య ద్వారా చదవాలనుకుంటున్నాను. కుదురుతుందా? ...

Published : 08 Jan 2018 02:07 IST

దూరవిద్యలో ఫైర్‌సేఫ్టీ

బీఏ చదివాను ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సును దూరవిద్య ద్వారా చదవాలనుకుంటున్నాను. కుదురుతుందా? అందించే సంస్థలేవి?

- కె. నాగరాజు

జ: ఫైర్‌ ఫైటింగ్‌, విపత్తును ఎదుర్కోవడం, ఆస్తి, ప్రాణనష్టాన్ని తగ్గించడం వంటి వివిధ కార్యకలాపాలను చూసుకోవడమే ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ముఖ్య ఉద్దేశం. దూరవిద్య ద్వారా ఈ కోర్సును (డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ) ఇగ్నో, దిల్లీ వారు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, నాగ్‌పూర్‌వారు అందిస్తున్నారు. పదో తరగతి, ఆపై అర్హత ఉన్నవారు ఈ కోర్సును చేయడానికి అర్హులు.


బీఆర్క్‌ ఉద్యోగాలు

బీఆర్క్‌ కోర్సులో చేరితే అవకాశాలెలా ఉంటాయి?

- శ్రీరామ్‌, సింగరాయకొండ

జ: బీఆర్క్‌ చదివినవారు వివిధ నిర్మాణాల ప్లానింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణం, సూపర్‌విజన్‌ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీళ్ల అవసరం ఎంతగానో ఉంది. ప్రధానంగా స్పెషల్‌ డిజైనింగ్‌, ఆస్థటిక్స్‌, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, వివిధ స్ట్రక్చర్‌ నిర్మాణాల్లో వీరిది ప్రధాన పాత్ర. వీరు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఆర్కిటెక్చరల్‌ ఇంజినీర్‌, డిజైనర్‌, సూపర్‌వైజర్‌, సైట్‌ ఇంజినీర్‌గా చేయవచ్చు లేదా సొంతంగా ప్రాక్టీసును కూడా పెట్టుకోవచ్చు. మనదేశంలో నాటా (నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌) పరీక్ష ద్వారా ప్రధాన విద్యాసంస్థల్లో బీఆర్క్‌లో ప్రవేశాన్ని పొందవచ్చు.


పైలట్‌ అవ్వాలంటే...?

పైలట్‌ అవ్వాలని నాకు అభిలాష. దీనికి కావాల్సిన విద్యార్హతలూ, ఫిట్‌నెస్‌ ప్రమాణాలు, శిక్షణ సంస్థలు, వాటి సుమారు ఫీజు వివరాలను తెలపగలరు.

- శ్రీకృష్ణ, వరంగల్‌

జ: పైలట్‌ అవ్వాలనుకునేవారు 10+2ను మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లతో పూర్తిచేసినవారు అర్హులు. మనదేశంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)వారు పైలట్‌ లైసెన్స్‌ను జారీ చేస్తారు. డీజీసీఏ వారి అనుబంధ, గుర్తింపు పొందిన ఫ్లయింగ్‌ స్కూల్‌ నుంచి శిక్షణ పొందినవారికి పైలట్‌ లైసెన్స్‌ను మంజూరు చేస్తారు.
పైలట్‌ అవ్వాలంటే ఫిట్‌నెస్‌పరంగా క్లాస్‌-2 మెడికల్‌ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థి ఫిట్‌గా ఉన్నట్లు తేలిన తరువాతే ఫ్లయింగ్‌ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్‌ ట్రైనింగ్‌ ఖర్చుతో కూడుకున్నది. ఫ్లయింగ్‌ స్కూల్‌నుబట్టి ఈ కోర్సుకు సుమారుగా రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఖర్చు కావచ్చు.
ఇందిరాగాంధీ ఫ్లయింగ్‌ స్కూల్‌ మనదేశంలో ప్రఖ్యాత పైలట్‌ ట్రైనింగ్‌ సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లయింగ్‌ ఏవియేషన్‌ అకాడమీ, వింగ్‌ ఏవియేషన్‌ మొదలైన సంస్థలు డీజీసీఏ అనుమతితో పైలట్‌ శిక్షణను అందిస్తున్నాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని