స్టాటిస్టిక్స్‌లో పీజీ

బీఎస్‌సీ (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. తరువాత ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ చేద్దామనుకుంటున్నా...

Published : 27 Feb 2018 01:44 IST

స్టాటిస్టిక్స్‌లో పీజీ

బీఎస్‌సీ (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. తరువాత ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ చేద్దామనుకుంటున్నా. నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలూ, ఎంపిక ప్రక్రియనూ తెలపండి. 
- సందీప్‌, మహబూబ్‌నగర్‌  
జ: ప్రస్తుత సాంకేతిక, డేటా విప్లవంతో స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసినవారికి స్టాటిస్టీషియన్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, యూపీఎస్‌సీ వారు నిర్వహించే ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌లో ఆఫీసర్‌, డిగ్రీ లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (యూనివర్సిటీల్లో) వంటి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
ప్రైవేటు రంగంలో డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌, లెక్చరర్‌, స్టాటిస్టిక్స్‌, ట్రైనర్‌ వంటి అవకాశాలు ఉన్నాయి. అనలిటిక్స్‌ రంగంలో ఆసక్తి ఉన్నవారు ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైథాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అదనపు కోర్సులను నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగంతోపాటు మంచి వేతనాన్నీ పొందగలరు.

ఫొటోగ్రఫీలో భవిత ఎలా?

 ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దీనిలో కెరియర్‌ నిర్మించుకోవాలనుంది. ప్రవేశపరీక్షలు, అందించే కళాశాలలేవి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? 
జ: వెయ్యి పదాలకంటే ఒక చిత్రం ఎక్కువ మాట్లాడుతుంది. ఫొటోగ్రఫీలో ఆసక్తి ఉన్నవారు వైవిధ్యంగా చిత్రాన్ని చూడగల నేర్పు, సృజనాత్మకత, వృత్తిపట్ల అంకిత భావం కలిగివుండాలి. ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణె, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌- కోల్‌కతా, కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌- దిల్లీ, ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్‌ వారు మూడేళ్ల బ్యాచిలర్‌ ఇన్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (ఫొటోగ్రఫీ), బ్యాచిలర్‌ (ఫొటోగ్రఫీ) కోర్సులను అందిస్తున్నారు.
తమ సొంత ప్రవేశపరీక్షల ద్వారా ఈ కోర్సుల్లోకి ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. 10+2 చదివినవారు అర్హులు. ఫొటోగ్రఫీ చేసినవారికి ఫ్యాషన్‌, టీవీ, సినిమా, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ రంగాల్లో మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

- దిషిత, విశాఖపట్నం  

ఇస్రోలో చేరాలంటే...  

తొమ్మిదో తరగతి చదువుతున్నాను. స్పేస్‌పై ఆసక్తి. ఇస్రోలో చేరాలనుంది. పై చదువుల్లో ఏ గ్రూపులను ఎంచుకోవాలి? వేటిని చదివితే నా లక్ష్యాన్ని చేరుకోగలను?

- వంశీతేజ  
జ: స్పేస్‌ సైన్స్‌పై ఆసక్తి, ఇస్రోలో చేరాలనే కోరిక ఉన్న ఔత్సాహికులు/ విద్యార్థులు గణితం, భౌతికశాస్త్రం పట్ల ప్రజ్ఞావంతులై ఉండాలి. అందుకు మీరు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ ఎంచుకోవడం మంచిది. డిగ్రీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, బీఎస్‌సీ ఫిజికల్‌ సైన్సెస్‌, జియో ఫిజిక్స్‌ వంటి సబ్జెక్టులను ఎంచుకుని వాటిలోనే పైచదువులు ఎంఎస్‌సీ లేదా ఎంటెక్‌ చేయడం ద్వారా స్పేస్‌ సైన్సెస్‌/ ఇస్రో వంటి సంస్థల్లో టెక్నికల్‌ ఉద్యోగాలను పొందవచ్చు.
ఇస్రోలో నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు. కాబట్టి మీరు టెక్నికల్‌/ నాన్‌ టెక్నికల్‌ రంగాల్లో వేటిలో ఉద్యోగాలను పొందాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ముందుకు అడుగు వేయండి.
- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని