పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పైచదువులు..

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎంచుకున్నాను. దీనిపై డిగ్రీ తరువాత అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను తెలపండి. ఉద్యోగావకాశాలేంటి?

Published : 10 Apr 2018 01:22 IST

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పైచదువులు..

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎంచుకున్నాను. దీనిపై డిగ్రీ తరువాత అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను తెలపండి. ఉద్యోగావకాశాలేంటి?
- రాజేశ్వరి సాగర్‌
జ: డిగ్రీ పూర్తిచేశాక పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌పై మక్కువ ఉంటే ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును ఎంచుకోవచ్చు. ప్రజా పరిపాలన విస్తృత జనాభాకు ఉపయోగపడే ప్రభుత్వ విధానాన్ని అమలుచేయడం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, పౌరుల శ్రేయస్సు కోసం ప్రజాకార్యక్రమాలు అభివృద్ధి చేయడం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముఖ్య లక్ష్యాలు.. సమాజం పట్ల ఆసక్తి, సమస్య పరిష్కరణ, సమాజ బాధ్యత పట్ల ఆసక్తి ఉంటే ఈ కోర్సు చేసినవారు తమ పరిజ్ఞానంతో ప్రభుత్వ గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలు, పాలసీ రూపకర్తలకు సలహాదార్లుగా ఉన్నతి పొందే అవకాశాలున్నాయి. ప్రెసిడెన్సీ కాలేజ్‌-చెన్నై, నిజాం కాలేజ్‌- హైదరాబాద్‌, లఖ్‌నవూ యూనివర్సిటీ- లఖ్‌నవూ, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి-ముంబయి.. ఈ కోర్సులో పీజీ చేయడానికి ప్రముఖ విశ్వవిద్యాలయాలు. ప్రైవేటు ఎన్‌జీఓ సంస్థల్లో ఈ కోర్సు చేసినవారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

డిగ్రీలో ఏ కోర్సు?

ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీలో ఏ కోర్సు ఎంచుకుంటే మేలు?

- సుభాష్‌
జ: ఇంటర్‌లో ఏ ఒకేషనల్‌ కోర్సు చదువుతున్నారో తెలుపలేదు. మీరు అకౌంట్స్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సు చదువుతున్నట్లయితే డిగ్రీలో బీకాం, బీకాం- టాక్స్‌, బీబీఎం వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి (క్రాప్‌ మేనేజ్‌మెంట్‌), బీఏ రూరల్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ కోర్సులను ఎంచుకోవచ్చు. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సును చదువుతున్నట్లయితే బీఎస్‌సీ లేదా బీటెక్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. మీరు మీ ఇంటర్‌ ఒకేషనల్‌  విద్యకు సంబంధించిన కోర్సునే డిగ్రీలో ఎంచుకోవడం మంచిది.

యోగా టీచర్‌ కావాలంటే?

బొటానికల్‌ సైన్స్‌లో పీజీ చేశాను. యోగా ఉపాధ్యాయుడు కావాలనుంది. సంబంధిత కోర్సులు, అందించే కళాశాలల వివరాలను తెలియజేయండి.

- సురేష్‌
జ: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. డబ్బు, ఉద్యోగం పరుగులో ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గింది. యోగా మనిషి శరీరాన్ని, మనసును ఏకం చేసే సాధనం. యోగా సాధన, శిక్షణలో ఉన్నత స్థానాలు చేరుకోవడానికి ఏకాగ్రత, సాధన ఎంతో ఆవశ్యకం. ఈ యోగా శిక్షణలో ఉపాధ్యాయుడిగా మారాలనుకునేవారు మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా (మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌) వారు అందిస్తున్న వివిధ సర్టిఫికెట్‌ కోర్సులను పూర్తిచేసి అడ్వాన్స్‌డ్‌ యోగా సాధన కోర్సును ఎంచుకోవచ్చు. యోగా టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు, అందిస్తున్న నగరాల్లో రుషికేష్‌, ధర్మశాల ప్రముఖమైనవి. ఈ కోర్సును పూర్తిచేసినవారు సర్టిఫైడ్‌ యోగా టీచర్‌ అవుతారు. ఎస్‌-వ్యాసా యూనివర్సిటీ వారు బీఎస్‌సీ, ఎంఎస్‌సీ యోగా కోర్సులను రెగ్యులర్‌, దూరవిద్య విధానంలో అందిస్తున్నారు.
ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని