మెటలర్జీలో ఉద్యోగావకాశాలేంటి?

ఇంటర్‌ పూర్తిచేశాను. మెటలర్జీ కోర్సుకి సంబంధించిన వివరాలను తెలియజేయండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

Published : 05 Jun 2018 02:09 IST

మెటలర్జీలో ఉద్యోగావకాశాలేంటి?

* ఇంటర్‌ పూర్తిచేశాను. మెటలర్జీ కోర్సుకి సంబంధించిన వివరాలను తెలియజేయండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

- ఉపేంద్ర కుమార్‌ రెడ్డి

జ: ఇంటర్‌ తరువాత మెటలర్జీ ఇంజినీరింగ్‌ కానీ, డిప్లొమా ఇన్‌ మెటలర్జీ ఇంజినీరింగ్‌ కోర్సును కానీ చేయొచ్చు. జేఎన్‌టీయూ పరిధిలోని అతికొద్ది ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈ ఇంజినీరింగ్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ప్రవేశం పొందొచ్చు. పాలీసెట్‌ ద్వారా కూడా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం పొంది లేటరల్‌ ఎంట్రీ ద్వారా మూడేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో చేరొచ్చు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీ- గుజరాత్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫౌండ్రి అండ్‌ ఫోర్జ్‌ టెక్నాలజీ- రాంచీ, ఐఐటీ- మద్రాస్‌, బాంబే, రూర్కీ, కాన్పూర్‌, వారణాసి, కొన్ని ఎన్‌ఐటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఈ కోర్సు చదివినవారికి ప్రైవేటు ఉక్కు కర్మాగారాలు, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌, హిండాల్కో ఇండస్ట్రీస్‌, కేబుల్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థల్లో మెటలర్జికల్‌ ఇంజినీర్లు, టెక్నిషియన్లు, ప్రాసెస్‌ అనలిస్టులుగా ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. మెటల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌, అల్లాయ్‌ మ్యానుఫాక్చరింగ్‌, హెవీ మెషీన్‌ తయారీ కర్మాగారాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.


మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌..

* ఇంటర్‌ పూర్తిచేశాను. బీఎస్‌సీ మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌ చేయాలనుంది. కోర్సు వివరాలు, అందించే సంస్థలేవి?

- షణ్ముఖి

జ: మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇది పూర్తిగా సృజనాత్మకతకు సంబంధించింది. ఈ రంగంలోకి వెళ్లేముందు ఈ కోర్సు చదవడానికి ముందూ, చదివిన తర్వాతా రాణించడానికి కావాల్సిన లక్షణాలు మీకున్నాయో లేవో బేరీజు వేసుకోండి. సృజనాత్మకతతోపాటు కంప్యూటర్‌తో ఎక్కువసేపు పనిచేయగలిగే నేర్పు, ఓర్పు చాలా అవసరమవుతాయి.

ఈ కోర్సు చదివినవారికి గ్రాఫిక్స్‌, టీవీ, మీడియా, అడ్వర్టైజింగ్‌, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, వెబ్‌సైట్‌ డిజైనింగ్‌, యానిమేషన్‌, ప్రింట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ కంటెంట్‌ తయారీ సంబంధిత సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ కోర్సును అతికొద్ది సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. కేఎల్‌ యూనివర్సిటీ- విజయవాడ, జేవియర్‌ యూనివర్సిటీ- భువనేశ్వర్‌, వీఐటీ- వెల్లూర్‌, అమిటీ యూనివర్సిటీ- ముంబయి, మణిపాల్‌ యూనివర్సిటీ- మణిపాల్‌, లయోలా అకాడమీ- సికింద్రాబాద్‌ మొదలైనవి వాటిలో కొన్ని.

ఈ కోర్సులు చాలావరకూ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో అవకాశాలతోపాటు పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి సబ్జెక్టుపై పట్టు, నైపుణ్యాలను సాధించగలిగితే భవిష్యత్తు చాలా బాగుంటుంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌,
  కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని