ఏఎంఐఈ, బీటెక్‌ తేడా ఏంటి?

డిప్లొమా పూర్తిచేశాను. పై చదువులు కొనసాగించాలనుకుంటున్నా. అయితే ఏఎంఐఈ, బీటెక్‌ల్లో ఏది తీసుకుంటే మేలు? వీటి మధ్య భేదమేంటి?

Published : 02 Jul 2018 01:58 IST

ఏఎంఐఈ, బీటెక్‌ తేడా ఏంటి?

 
* డిప్లొమా పూర్తిచేశాను. పై చదువులు కొనసాగించాలనుకుంటున్నా. అయితే ఏఎంఐఈ, బీటెక్‌ల్లో ఏది తీసుకుంటే మేలు? వీటి మధ్య భేదమేంటి? 
- జె. రేవంత్‌
విద్యార్థి నాలుగేళ్ల బీటెక్‌ విద్యను కళాశాల/ యూనివర్సిటీ ద్వారా రెగ్యులర్‌ విధానంలో అభ్యసిస్తారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లపాటు ఈ కోర్సు కొనసాగుతుంది. ఏఎంఐఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు అందిస్తున్నారు. మొత్తం 11 స్పెషలైజేషన్లలో తమకు నచ్చినదాన్ని విద్యార్థి ఎంచుకోవచ్చు. ఏఎంఐఈ కోర్సును సెక్షన్‌- ఎ, బిల రూపంలో రూపొందించారు. రెండు సెక్షన్లలో కలిపి మొత్తం 19 సబ్జెక్టులు, ల్యాబ్‌ పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి. ఆరేళ్ల వ్యవధిలో ఈ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏటా జూన్‌, డిసెంబర్‌ నెలల్లో పరీక్షలు జరుగుతాయి. సంవత్సరం పొడవునా అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమాతో ఉద్యోగం పొంది, ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెగ్యులర్‌ విధానంలో బీటెక్‌ అభ్యసించలేనివారు తమ పై చదువులు కొనసాగించడానికి ఏఎంఐఈ కోర్సును ఎంచుకోవచ్చు. 
బీటెక్‌, ఏఎంఐఈ రెండు కోర్సులనూ ఉన్నత చదువులకు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సమాన అర్హతగానే పరిగణిస్తారు. అయితే వీలుంటే ప్రొఫెషనల్‌ కోర్సు అయిన ఇంజినీరింగ్‌ విద్యను రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడమే మంచిది.

ఏ స్కాలర్‌షిప్‌లున్నాయ్‌?

*  ఫార్మా-డి రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకున్న జాతీయ, అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ అవకాశాలను తెలియజేయండి. వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

- దినేష్‌, వరంగల్‌
సాధారణంగా అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు విదేశాల్లో చదువుతున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఫెలోషిప్‌/ స్కాలర్‌షిప్‌ల ద్వారా అందిస్తారు. ఉదాహరణకు- కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ ఫెలోషిప్‌ ప్లాన్‌, జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ స్కాలర్‌షిప్‌ వంటివి మెరిట్‌ ఆధారంగానే అందుబాటులో ఉంటాయి. మీరు ప్రస్తుతం మనదేశంలోనే ఉన్నారు, ఇంకా ఫార్మా-డి రెండో ఏడాది చదువుతున్నారు. ఇంకా మీ కోర్సు నాలుగేళ్లు ఉంది కాబట్టి.. ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌ స్కాలర్‌షిప్‌, నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ (ఎన్‌ఎంఎంఎస్‌), మహవీర్‌ ప్రసాద్‌ సింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌, మినిస్ట్రీ ఆఫ్‌ మైనారిటీ అఫైర్స్‌ వారి మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌, స్టేట్‌ గవర్నమెంట్‌ స్కాలర్‌షిప్స్‌ను మెరిట్‌, మీన్స్‌ విధానంలో పొందొచ్చు. దరఖాస్తు కోసం ఆయా సంస్థల వెబ్‌సైట్లను చూడొచ్చు.

ఏ దూరవిద్య కోర్సు మేలు?

  * కంప్యూటర్‌ డిప్లొమా పూర్తిచేశాను. బీటెక్‌ కాకుండా దూరవిద్య చేయగల అవకాశమున్న కోర్సుల వివరాలను తెలపండి.

- సత్య, కాకినాడ
మీరు 10+3 (పాలిటెక్నిక్‌/ డిప్లొమా) ఇన్‌ కంప్యూటర్స్‌ పూర్తిచేసి ఉంటారు. బీటెక్‌ కాకుండా దూరవిద్యలో ఏఎంఐఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు అందిస్తున్నారు. మీరు బీఎస్‌సీ కంప్యూటర్స్‌, బీఎస్‌సీ మేథమేటిక్స్‌, బీఏ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ కోర్సులను దూరవిద్య ద్వారా అభ్యసించవచ్చు. అంతేకాకుండా ఆర్ట్స్‌ కోర్సులైన బీఏ, బీకాం, బీబీఏ కోర్సులను కూడా మీ విద్యార్హతో దూరవిద్య విధానంలో అభ్యసించవచ్చు. ఈ కోర్సులను దూరవిద్య ద్వారా ఇగ్నో, ఆంధ్రా, నాగార్జున, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి. దూరవిద్య ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సులను చేయాలనుకుంటే మాత్రం ఏఎంఐఈ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ వారు అందించే ఏఎంఐఐటీఈ కోర్సులను ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని