సైబర్‌ క్రైం పోలీస్‌ కావాలంటే..

పదోతరగతి చదువుతున్నాను. సైబర్‌ క్రైం పోలీస్‌ కావాలనుంది. ఇంటర్‌ నుంచి ఏ కోర్సులు ఎంచుకోవాల్సి ఉంటుంది...

Published : 31 Jul 2018 01:44 IST
 

సైబర్‌ క్రైం పోలీస్‌ కావాలంటే..  

పదోతరగతి చదువుతున్నాను. సైబర్‌ క్రైం పోలీస్‌ కావాలనుంది. ఇంటర్‌ నుంచి ఏ కోర్సులు ఎంచుకోవాల్సి ఉంటుంది.

- జయవర్ధన్‌ నారాయణ 
ఇంటర్‌నెట్‌, ఆధునిక టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ద్వారా వ్యక్తిగతంగా, పరోక్షంగా లేదా మానసికంగా హాని కలిగించే ప్రక్రియనే సైబర్‌ క్రైంగా పరిగణిస్తారు. ఇదే కాకుండా మోసపూరిత ఆర్థిక లావాదేవీల (ఆన్‌లైన్‌) ద్వారా వ్యక్తికి నష్టం కలిగించడం కూడా దీనికిందకే వస్తుంది. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని బీఎస్‌సీ కంప్యూటర్స్‌ లేదా బీటెక్‌ (ఐటీ/ సీఎస్‌సీ) తీసుకుని ఎథికల్‌ హ్యాకింగ్‌, డిప్లొమా ఇన్‌ సైబర్‌ క్రైం వంటి కోర్సులు చేయాలి. ఆ విధంగా సైబర్‌ క్రైం పోలీసు వ్యవస్థలోకి ప్రవేశించొచ్చు.

ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదవాలంటే..?  

ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. డిగ్రీ (కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదవాలనుంది. డిగ్రీ తరువాత ఏది ఎంచుకోవాలి? నేను చదివేవాటిల్లో ఏ సబ్జెక్టు ఎక్కువ ఉపయోగకరం?

- దిషిత  
నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపజేసి సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుక్కునే శాస్త్రమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అప్లైడ్‌ సైన్స్‌ లేదా వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినవారికి ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివే అర్హత ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు చేయడానికి మీరు అర్హులే. పీజీ స్థాయిలో ఈ కోర్సును అందిస్తున్న సంస్థల్లో కొన్ని విద్యాసంస్థలు: అమిటీ యూనివర్సిటీ, గల్గోతియా యూనివర్సిటీ, డా. హరిసింగ్‌ యూనివర్సిటీ.
సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు పరిశీలన నైపుణ్యాలు, సహజంగా పరిశోధించే స్వభావం, ఆసక్తి ఉన్నవారు ఈ వృత్తిలో రాణిస్తారు. ఆధునిక నేర పరిశోధనలో మీరు చదువుతున్న కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ మూడూ అవసరమే, ప్రధానమే.

పెట్రోలియం టెక్నాలజీలో అవకాశాలెలా?

పదోతరగతి పూర్తిచేశాను. పెట్రోలియం టెక్నాలజీ కోర్సు చేద్దామనుకుంటున్నాను. దీనిపై అవకాశాలెలా ఉంటాయి? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

- మనోజ్‌  
పెట్రోలియం టెక్నాలజీ చేయాలనుకునేవారు 10+2లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ చదివుండాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ద్వారా ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ- విశాఖపట్నం, రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ- అమేథి, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, ఐఐటీ-బాంబే, ఐఐటీ- ధన్‌బాద్‌ వంటి ప్రముఖ విద్యాలయాల్లో బీటెక్‌ (పెట్రోలియం ఇంజినీర్‌) కోర్సుల్లో ప్రవేశాన్ని పొందొచ్చు.
వీరికి డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, రిజర్వాయర్‌ ఇంజినీర్‌, ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌ వంటి ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌ పెట్రోలియం, ఎస్సార్‌ ఆయిల్‌ వంటివి మంచి వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.
-ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని