ఎంబీఏ, శాప్‌లు చేసేదెలా?

డిగ్రీ (బీకాం) పూర్తిచేసి, అకౌంటెంట్‌గా చేస్తున్నాను. ఎంబీఏ (ఫైనాన్స్‌), శాప్‌-ఫికో కోర్సుల వివరాలను అందించండి. హైదరాబాద్‌లో రెగ్యులర్‌, దూరవిద్యలో అందించే సంస్థలేవి?....

Published : 28 Aug 2018 01:38 IST

ఎంబీఏ, శాప్‌లు చేసేదెలా?

డిగ్రీ (బీకాం) పూర్తిచేసి, అకౌంటెంట్‌గా చేస్తున్నాను. ఎంబీఏ (ఫైనాన్స్‌), శాప్‌-ఫికో కోర్సుల వివరాలను అందించండి. హైదరాబాద్‌లో రెగ్యులర్‌, దూరవిద్యలో అందించే సంస్థలేవి?

- కడారి శ్రీనివాసరావు, హైదరాబాద్‌

ఎంబీఏను రెగ్యులర్‌ విధానంలో చదవాలనుకునేవారు క్యాట్‌, మ్యాట్‌, గ్జాట్‌, సీమ్యాట్‌ వంటి ప్రవేశపరీక్షలను రాయొచ్చు. వీటి ద్వారా ప్రముఖ ఐఐఎంలు, బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందే అవకాశముంటుంది. స్టేట్‌ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఐసెట్‌ ద్వారా సీటు సంపాదించొచ్చు.
శాప్‌ విషయానికొస్తే.. ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ మాడ్యూల్‌ (ఫికో)ను నేర్చుకోవడం ద్వారా బహుళజాతి సంస్థల్లో అకౌంటింగ్‌, ఫైనాన్స్‌ ఉద్యోగాలను పొందే వీలుంటుంది. ఈ కోర్సును కొన్ని ప్రైవేటు శిక్షణ సంస్థలు హైదరాబాద్‌, బెంగళూరుల్లో అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడానికి ముఖ్యంగా అకౌంట్స్‌పై మంచి పట్టు ఉండాలి. శాప్‌ ఆథరైజ్‌డ్‌ సెంటర్ల ద్వారా సర్టిఫికేషన్‌ పొందొచ్చు. దూరవిద్యలో ఎంబీఏను హైదరాబాద్‌లో తమ స్టడీ సెంటర్ల ద్వారా ఇగ్నో, ఆంధ్రా, గీతం, ఉస్మానియా, అలగప్పా వంటి యూనివర్సిటీలు అందిస్తున్నాయి.


ఏఐ ఎక్కడ? ఎలా?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులను అందించే సంస్థలేవి? ఇవి చదివినవారికి వేతనాలు ఎలా ఉంటాయి?

- వెంకటేష్‌ రామగిరి, ఖమ్మం

రానున్న కాలంలో ఐటీ, కృత్రిమ మేధ మానవ జీవనశైళిని సరళతరం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కృత్రిమ మేధ కంప్యూటర్లకు మాత్రమే పరిమితమైతే ప్రస్తుతం రోజువారీ జీవితంలో వివిధ ఎలక్ట్రానిక్‌, కమ్యూనికేషన్స్‌ డివైజెస్‌ రూపంలో భాగం అయిపోతుంది. ఉదాహరణకు- అమేజాన్‌ ఇకో, స్మార్ట్‌ కిచెన్‌, హోమ్‌, గూగుల్‌ హోమ్‌, డ్రైవర్లు లేని కార్లు, రోబోటిక్‌ ఆపరేషన్స్‌ మొదలైనవి.
ఈ కోర్సు ఇతర కోర్సులైన కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌, రోబోటిక్స్‌, మేనేజ్‌మెంట్‌, బిహేవియర్‌ వంటి ఇతర కోర్సులతో అనుసంధానమై ఉంటుంది. పలు ట్రిపుల్‌ ఐటీలు, ఐఐటీలు, ఐఏఎంలు, గ్రేట్‌లేక్స్‌, అప్‌గ్రాడ్‌ వంటి సంస్థలు పీజీ డిప్లొమా కోర్సును అందిస్తున్నాయి. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఈ కోర్సు చేసినవారికి భారీ వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని