రేడియాలజీ చదవాలనుంది

రేడియాలజీ కోర్సులు చదవాలనుంది. అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి అర్హత వివరాలను తెలపండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

Published : 03 Sep 2018 01:51 IST

 

రేడియాలజీ చదవాలనుంది

రేడియాలజీ కోర్సులు చదవాలనుంది. అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి అర్హత వివరాలను తెలపండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? 

- కిశోర్‌
మీ ప్రస్తుత విద్యార్హతలను తెలియజేయాల్సింది. రేడియాలజీ/ రేడియాలజిస్ట్‌ కోర్సును... ఎంబీబీఎస్‌ పూర్తిచేసి, పీజీలో రేడియాలజీలో స్పెషలైజేషన్‌ చేయడం ద్వారా రేడియాలజిస్ట్‌ కావొచ్చు. లేదా బీఎస్‌సీలో రేడియాలజీ కోర్సును ఎంచుకోవచ్చు. రేడియాలజీలో డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు పెరగడంతో ఈ కోర్సులు చేసినవారికి చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిప్లొమా కోర్సులు చేసినవారికి రేడియో గ్రాఫర్‌, రేడియాలజీ టెక్నాలజిస్ట్‌, రేడియాలజీ టెక్నీషియన్‌, సోనోగ్రాఫర్‌, ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌, సీటీ స్కాన్‌ టెక్నాలజిస్ట్‌లుగా అవకాశాలుంటాయి.

వీటిలో ఉద్యోగావకాశాలు లేవా?

ఆటోమొబైల్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేయలనుంది. కానీ తెలిసినవాళ్లు వీటిల్లో పెద్దగా అవకాశాలు లేవంటున్నారు. నిజమేనా? వీటికి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

- వైభవ్‌
వీటిల్లో ఉద్యోగావకాశాలు తక్కువ ఉన్నాయని అనుకున్నవారిది అపోహ మాత్రమే. మనదేశంలో సర్వీస్‌ సెక్టార్‌ రంగంపై దృష్టిసారించడంతో ఐటీ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నమాట నిజమే. కానీ మేక్‌ ఇన్‌ ఇండియా ఉద్యమంతో ప్రభుత్వం తయారీ రంగంపై చొరవ తీసుకోవడంతో అవకాశాలు పెరుగుతున్నాయి. మనకున్న అధిక మానవవనరులు, సాంకేతిక సమర్థత కారణంగా విదేశీ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్కిల్‌ ఇండియా కార్యక్రమం కూడా ఈ రంగాల్లో ఉద్యోగాలకు బాట వేస్తోంది. కాబట్టి, అపోహలకు తావివ్వక మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి. ప్రభుత్వ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, రైల్వే, మెరైన్‌, బీఈఎల్‌, డీఆర్‌డీఓ సంస్థల్లో ఉద్యోగాలను పొందొచ్చు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టెక్నాలజీ జోడించి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టడం ద్వారా ఈ రంగంలో అవకాశాలను పొందొచ్చు.

ఎంఎస్‌సీ ఆక్వా ఎక్కడ? ఎలా?  

డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎంఎస్‌సీ ఆక్వాకల్చర్‌ చేయాలనుంది. దీనికున్న ప్రాధాన్యాన్ని వివరించండి. అందించే సంస్థలు, వాటి ప్రవేశ వివరాలను తెలియజేయండి.

- శరవణ, కశింమిట్ట
డిగ్రీలో బయాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ చదివినవారు ఎంఎస్‌సీ ఆక్వాకల్చర్‌, ఎంఎస్‌సీ ఫిషరీస్‌ చదవడానికి అర్హులు. ఈ రంగం మెరైన్‌ బయాలజీ, మెరైన్‌ సైన్స్‌, జలచరాలు, చేపల అభివృద్ధి, ఆనిమల్‌ ఫిజియాలజీ మొదలైన వివిధ సబ్జెక్టుల సమ్మేళనం. ఈ కోర్సు పూర్తిచేసినవారికి స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలున్నాయి. ఫిషరీస్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ ఆఫ్‌ అథారిటీ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో ఫామ్‌ సూపర్‌వైజర్‌, ఫిషరీ ఆఫీసర్‌, సీఫుడ్‌ ఆఫీసర్‌, మెరైన్‌ ఇంజినీర్‌ వంటి పోస్టులకు వీరిని ఎంచుకుంటారు. నాగార్జున యూనివర్సిటీ- గుంటూరు, వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, బక్రతుల్లా యూనివర్సిటీ-భోపాల్‌లో ఎంస్‌సీ ఆక్వాకల్చర్‌ అందుబాటులో ఉంది. ప్రవేశపరీక్ష ద్వారా వీటిల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు.
- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని