GO4Youth Olympiad: ఈ ఒలింపియాడ్‌ పరీక్ష రాస్తారా? విజేతలకు నగదు ప్రైజ్‌లు!

యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా GO4Youth Olympaid నిర్వహిస్తున్నట్లు యూజీసీ వెల్లడించింది. పూర్తి వివరాలివే..

Published : 25 Jan 2024 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మీరు 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు కలిగిన విద్యార్థులా? ఏదైనా విద్యాసంస్థల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారా? అయితే, యూజీసీ నిర్వహించే ఈ గ్రీన్‌ ఒలింపియాడ్‌ ఫర్‌ యూత్‌ (GO4Youth)లో మీరూ భాగస్వామి కావొచ్చు. పర్యావరణం, సుస్థిర అభివృద్ధి అంశాలపై అవగాహనే లక్ష్యంగా నిర్వహించే ఈ ఆన్‌లైన్‌ పరీక్షలో సత్తా చాటి నగదు ప్రైజ్‌లతో పాటు ఈ-సర్టిఫికెట్లను పొందొచ్చని యూజీసీ తెలిపింది. ఈ ఒలింపియాడ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలివే..

  • యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆమోదంతో ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (TERI) ఈ పరీక్ష నిర్వహించనుంది. యువతలో పర్యావరణ పరిరక్షణ  దృక్పథాన్ని, అభిరుచిని పెంచడమే గ్రీన్‌ ఒలింపియాడ్‌ ఫర్‌ యూత్‌ 2024(GO4 Youth) లక్ష్యం.
  • GO4యూత్ ఒలింపియాడ్ 2024 వాతావరణ మార్పు, కాలుష్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, జీవవైవిధ్య పరిరక్షణ, జీవ వనరులు, జీవవైవిధ్యం నిర్వహణ, అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై విద్యార్థుల అవగాహన పెంచుతుందని యూజీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.teriin.org/olympiad/index.php క్లిక్‌ చేయండి.
  • GO4Youth Olympiad 2024 పరీక్షను ఏప్రిల్‌ 8-12 తేదీల్లో నిర్వహిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ ఒలింపియాడ్‌కు అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 31 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25 తుది గడువు. దరఖాస్తు రుసుం రూ.160. రిజిస్ట్రేషన్‌ తర్వాత విద్యార్థులకు టైమ్‌ స్లాట్‌లు తెలియజేస్తారు.
  • ఇది ఆన్‌లైన్‌ పరీక్ష (ఇంగ్లిష్‌/హిందీ మాధ్యమంలో). మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కులు లేవు. 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. 

విద్యార్థులకు వచ్చే లాభమేంటి?

  • పరీక్షకు హాజరైన అందరికీ ఈ-సర్టిఫికెట్లు ఇస్తారు.
  • ర్యాంకర్లకు స్కోరు ఆధారంగా మెరిట్‌, డిస్టింక్షన్‌ ఈ-సర్టిఫికెట్లు
  • తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు
  • TERI యూత్‌ నెట్‌వర్క్‌లో సభ్యత్వం
  • ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (TERI)తో పాటు ఇతర ప్రఖ్యాత సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం
  • పర్యావరణ సంబంధిత పోర్టిఫోలియోను పెంచుకోవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని