TSPSC: 4 నుంచి వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లను ఈనెల 4వ తేదీ (ఆదివారం) నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated : 03 Jun 2023 23:20 IST

హైదరాబాద్‌: జూన్‌ 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లను ఈనెల 4వ తేదీ (ఆదివారం) నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. గతంలో జారీ చేసిన హాల్‌ టికెట్లు చెల్లవని పేర్కొంది. 

2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఈ పరీక్ష నిర్వహణ సమయంలోనే కొన్ని లోపాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో కొందరు అభ్యర్థులకు ఉర్దూ మాధ్యమం ప్రశ్నపత్రాలు రావడంతో గందరగోళం నెలకొంది. ఆ అభ్యర్థులతో మధ్యాహ్నం పరీక్ష రాయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రిలిమ్స్‌ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో అయిదు ప్రశ్నలు తొలగించి తుది కీ ఖరారు చేశారు. పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వెలుగుచూడడంతో గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసి మరలా రీషెడ్యూల్‌ చేసి జూన్‌ 11న నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని