overreacting: అతిగా స్పందిస్తున్నారా?

కోరుకున్న కోర్సు లేదా కాలేజీలో సీటు రాలేదని ఆందోళన చెందే విద్యార్థులూ... పరీక్షల తేదీ దగ్గరపడుతున్నప్పుడు విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాళ్ల్లూ... తరచి చూస్తే వీరందరిలోనూ ఒక పోలిక కనిపిస్తుంది

Published : 19 Jun 2024 00:47 IST

కోరుకున్న కోర్సు లేదా కాలేజీలో సీటు రాలేదని ఆందోళన చెందే విద్యార్థులూ... పరీక్షల తేదీ దగ్గరపడుతున్నప్పుడు విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాళ్ల్లూ... తరచి చూస్తే వీరందరిలోనూ ఒక పోలిక కనిపిస్తుంది. అదే.. అతిగా స్పందించడం! 

ఇలాంటివాళ్లు చిన్న విషయాలనే పెద్దగా ఊహించుకుని భయపడుతుంటారు. ఫలితాలు ఊహించిన దానికంటే భిన్నంగా వచ్చినప్పుడూ, వైఫల్యంపై విమర్శలు విన్నప్పుడూ అతిగా స్పందిస్తారు. సమస్యలన్నీ తమను మాత్రమే చుట్టుముడుతున్నాయనే ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతారు. పరిసరాల, పరిస్థితుల ప్రభావం ప్రతి ఒక్కరి మీదా ఉంటుంది. దీనికి విద్యార్థులూ అతీతులు కాదు. కానీ అతిగా స్పందించడం వల్ల ఇబ్బంది పెరుగుతుందేగానీ తగ్గదు. దీన్నుంచి బయటపడటానికి ఏం చేయాలో చూద్దాం.

  • వార్షిక, ప్రవేశ, పోటీ పరీక్షల్లో అంచనాలూ తలకిందులై.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. సంపాదించిన మార్కులు అసంతృప్తినీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అయోమయ పరిస్థితినీ కలిగించొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాటి ప్రభావం ఆలోచనలు, ప్రవర్తన మీద పడకుండా ఉండటానికి భావోద్వేగ నియంత్రణను అలవర్చుకోవాలి. 
  • ‘ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటున్నా.. ఎవరూ మెచ్చుకోరు. అందరూ విమర్శిస్తూనే ఉంటారు’.. అని ఆలోచించే విద్యార్థులూ ఉంటారు. ఇతరులు ప్రశంసించడం లేదా నిందించడం అనేది మన చేతుల్లోలేని విషయం. కాబట్టి ఇలాంటి వాటి గురించి పదేపదే ఆలోచించడం మానేయాలి. దీని బదులుగా మనం చేస్తున్న కృషి.. స్నేహితుల నుంచీ, కుటుంబ సభ్యుల నుంచీ ఎలాంటి సాయం తీసుకోవచ్చనే దిశగా ఆలోచించాలి. 
  • గతంలో జరిగిన విషయాలనూ, భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించీ ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందడం సరికాదు. గతంలో బాధపెట్టిన అంశాలు ఎన్నో ఉండొచ్చు. భవిష్యత్తులో ఏం జరగనుందోననే భయంతో ఆందోళనా ఆవహించవచ్చు. ఇవన్నీ మానసిక ప్రశాంతతను దూరం చేసే విషయాలే. వర్తమానంలో జీవించడం వల్ల చేసే పని మీదే ధ్యాసను నిలుపగలుగుతారు. 
  • ప్రతికూల ఫలితాలు రావడానికి ఇతరులే కారణమని నిందించడం, నెపాన్ని ఎదుటివారి మీదకు నెట్టేయడం వల్ల అతిగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పట్ల మనమే బాధ్యత తీసుకోవాలి. అనుకున్నది చేయడంలో విజయం వరించినా.. వైఫల్యం ఎదురైనా.. దానికి పూర్తి బాధ్యత మనదే కావాలి. అప్పుడు అతిగా స్పందించడానికి బదులుగా పరిష్కార మార్గాల గురించి మాత్రమే ఆలోచిస్తాం.  
  • మోతాదుకు మించి స్పందించినప్పుడు... మనం మాట్లాడే విధానం, ప్రవర్తనా పూర్తిగా మారిపోతాయి. దాంతో ఇతరుల మనసును అనవసరంగా నొప్పించినవాళ్లమవుతాం. ఇది మనం ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. 
  • ఆలోచనలను ఒకచోట రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. వాటిలో ఆలోచింపజేసేవీ, ఆవేశపరిచేవీ, అనవసరమైనవీ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల ఒత్తిడీ తగ్గుతుంది. ఎదుటివారితో మనుసులోని బాధలను పంచుకున్న అనుభూతీ కలుగుతుంది. ఆ తర్వాత వాటిలోంచి అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకుని.. ఆచరణలో పెడితే అతిగా స్పందించే అవకాశమే ఉండదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని