Indian Economy: సహజ వనరులు.. సాంకేతికతలే ఆర్థికవృద్ధికి సోపానాలు!

ఒక దేశం ఆర్థికంగా సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలతోపాటు సుస్థిరమైన పరిపాలన, సామాజిక అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. సమాజం అనుసరించే విలువలు, సామాజిక దృక్పథాలు, సంస్థలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి.

Updated : 13 Jun 2024 01:54 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ
ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి

ఒక దేశం ఆర్థికంగా సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలతోపాటు సుస్థిరమైన పరిపాలన, సామాజిక అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. సమాజం అనుసరించే విలువలు, సామాజిక దృక్పథాలు, సంస్థలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. శాంతియుతమైన వాతావరణం, సరైన ద్రవ్య - కోశవిధానాల అమలు లాంటివి ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయి.

ల్పాభివృద్ధి చెందిన దేశాల్లో శీఘ్ర ఆర్థికాభివృద్ధికి విలువల ఆధునికీకరణను అనుసరించాలని గున్నార్‌ మిర్దాల్‌ పేర్కొన్నారు. దీనివల్ల దృక్పథాల్లో మార్పులు ఏర్పడి, అవి ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. వాస్తవ మానవ ప్రవర్తన కారణంగా ఉండే నమ్మకాలు, విలువలనే దృక్పథాలు అంటారు. 

 • ఉత్పాదకతతోపాటు జీవనస్థాయులను పెంచడానికి, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవడం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం అవసరం.
 • అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యమిత్వం లేకపోవడానికి కారణం దానికి సంబంధించి సరైన దృక్పథం ఉన్న వ్యక్తుల కొరతేనని గున్నార్‌ మిర్దాల్‌ అభిప్రాయపడ్డారు. 
 • అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక కారకాల ఆమోదయోగ్య ప్రవర్తనను ప్రేరేపించే నాణ్యమైన సంస్థలు ఉన్నాయి. అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో సామాజిక సంస్థలు ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా లేవు. 
 • సంప్రదాయ ఆచారాలు ప్రజలను బాగా ప్రభావితం చేస్తాయి. ఖాళీగా గడపటానికి, ఉన్నదాంతో తృప్తి చెందడానికి ఎక్కువ విలువనిస్తారు. ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉమ్మడి కుటుంబం, కులవ్యవస్థ అభివృద్ధికి అడ్డంకులుగా ఉంటాయి.
 • వృద్ధి ప్రక్రియ వేగవంతం కావడం అనేది జనసమూహాలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆధారపడి ఉంటుంది. వృద్ధి ఫలాలు అందరికీ సమంగా లభిస్తాయని భావిస్తే ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆసక్తి చూపిస్తారు.
 • వివిధ దేశాల అనుభవాలను పరిశీలించినప్పుడు, ఏ దేశాల్లోనైతే లోపభూయిష్టమైన సాంఘిక వ్యవస్థ అభివృద్ధి ఫలాలను ఎక్కువ శాతం ఉన్నత వర్గాలు సొంతం చేసుకోవడానికి సహకరిస్తుందో అలాంటి వ్యవస్థలో అభివృద్ధి పథకాల పట్ల సామాన్య ప్రజల స్పందన కరవవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం అమలు చేసే ప్రాజెక్టుల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటుందని ఆశించలేం.
 • పరిశ్రమల వృద్ధిలో ఏకస్వామ్య పోకడలు, ఆధునిక రంగంలో ఆర్థికశక్తి కేంద్రీకరణ అనేవి నిర్వివాదాంశాలు. అదే విధంగా ఆధునిక వ్యవసాయ వ్యూహాలను అనుసరించడం  దేశంలో ధనిక వ్యవసాయ వర్గ సృష్టికి, అసమానతల విస్తరణకు దారితీస్తుంది. సంస్థల ప్రజాస్వామీకరణ, ప్రజలు అభివృద్ధి ప్రక్రియలో సామూహికంగా పాల్గొనడం దేశంలో ఎక్కువ సమానత్వంతో కూడిన అభివృద్ధికి తోడ్పడతాయి.
 • ఆర్థిక మెరుగుదల సాధించాలనే దృఢమైన అభిలాష ప్రజల్లో ఉండాలి. ఆర్థికాభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న పాత దృక్పథాలు, విలువలు, సంస్థల్లో అవసరమైన మార్పులకు ప్రజలు సిద్ధపడాలి.

ఆర్థికాభివృద్ధి నిరోధకాలు/ అవరోధాలు

అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధికి ఆటంకాలుగా నిలిచే కారకాలను కింది విధంగా విభజించవచ్చు.

ఎ. సహజవనరుల కొరత 
బి. అల్ప మానవ మూలధన వృద్ధిరేటు
సి. అవస్థాపన సదుపాయాల కొరత
డి. పేదరికపు విషవలయం 
ఇ. అల్పమూలధన సమీకరణ రేటు
ఫ్‌. సామాజిక - సాంస్కృతిక అడ్డంకులు
జి. వ్యవసాయక అడ్డంకి
హెచ్‌. విదేశీ మారక అడ్డంకి
ఐ. మూలధన కొరత

జె. జనాభా పెరుగుదల
కె. వైవిధ్యం అభివృద్ధి అవరోధం


సహజవనరుల కొరత:

సహజ వనరులు సమృద్ధిగా ఉండటం ఆర్థిక వృద్ధికి అవసరం. వనరులు అంత్యదశలో ఉండే దేశ ఆర్థిక వృద్ధి పరిమితంగా ఉంటుంది.

అన్ని రకాల వనరులు కలిసి ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక జనాభా వల్ల భూమి కొరత తలెత్తడం సాధారణ విషయం. ఇది చాలారకాల నష్టాలకు దారి తీస్తుంది. తక్కువ భూములు అందుబాటులో ఉన్న పేద దేశాల్లో ఆదాయానికి ముఖ్య ఆధారమైన వ్యవసాయ కార్యకలాపాలు తగ్గుతాయి. అల్పస్థాయి సాంకేతికత ఈ పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తుంది. ఇలాంటి దేశాల్లో ఉత్పత్తులను భారీ స్థాయిలో పెంచాలంటే సాంకేతికత సాయం తప్పనిసరి.

అయితే సహజవనరులు లేని సింగపూర్‌ లాంటి దేశాలు, తక్కువ వనరులున్న జపాన్, అనేక పశ్చిమ దేశాలు వాటి లక్ష్యాలను సాధించడంలో విజయవంతమయ్యాయి.

వనరులను వినియోగించలేకపోవడం: చాలా పేద దేశాలల్లో (సబ్‌ సహారన్‌ ఆఫ్రికా దేశాలు) సహజవనరులు పుష్కలంగా ఉన్నా వాటిని అవి వినియోగించుకోవడం లేదు. కారణం అక్కడ పరిశోధన, అభివృద్ధి తక్కువ. సాంకేతిక పరిజ్ఞానం, మూలధనం కొరత వల్ల సహజవనరులను సక్రమంగా, సమర్థంగా వినియోగించుకోలేకపోతున్నాయి.

వనరుల నిర్వహణలో అసమర్థత: చాలా బీద దేశాలు ఉత్పాదక, ఆర్థిక వనరుల కేటాయింపు సామర్థ్యాన్ని కలిగిఉండవు.


అల్ప మానవ మూలధన వృద్ధిరేటు:

అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధి చెందని మానవ వనరులు ఆర్థికాభివృద్ధికి ముఖ్య అవరోధంగా పరిణమించాయి. ఈ దేశాల్లో విజ్ఞానం, నైపుణ్యం ఉన్న ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. శ్రామికుల ఉత్పాదకశక్తి, కారకాల గమనశీలత తక్కువగా ఉండటం, శ్రామికులు వారి వృత్తిలో పరిమిత ప్రత్యేకీకరణను కలిగి ఉండటం, సంప్రదాయ సామాజిక సంస్థలు అభివృద్ధి చెందని మానవ వనరుల రూపాలే.

 • అభివృద్ధి చెందుతున్న దేశాల బడ్జెట్‌లో విద్య, ఆరోగ్యానికి కేటాయింపులు తక్కువ. దీనివల్ల చాలామందికి నైపుణ్యాలు ఉండవు. వైద్య సదుపాయాలు అల్పస్థాయిలో ఉంటే ఆయుఃప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది. అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవులు పెట్టడం మూలంగా ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడుతుంది. ఉత్పాదక వయసులోని శ్రమశక్తి తగ్గుతుంది. దీనికి సంబంధించి అమర్త్యసేన్‌ ప్రతిపాదించిన యోగ్యతల విధానం పేర్కొనదగింది. వ్యక్తుల సామర్థ్యాలను పెంపొందించడంలో విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాలు పెరగడం వల్ల దేశాభివృద్ధికి మెరుగైన తోడ్పాటును అందిస్తారు. అల్పాభివృద్ధి చెందిన దేశాలు నైపుణ్యాలు, పరిజ్ఞానం విషయంలో కొరతను ఎదుర్కొంటున్నందున భౌతిక మూలధనాన్ని ఉత్పాదకమైందిగా ఉపయోగించలేం.

అవస్థాపన సదుపాయాల కొరత:

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవస్థాపన సౌకర్యాల వృద్ధి జరగలేదు. విద్యుత్తు, పరపతి, టెలీకమ్యూనికేషన్స్, రవాణా లాంటివి పెట్టుబడులను ఆకర్షించే కీలక రంగాలు. ఇవి అంతగా అభివృద్ధి చెందలేదు. వీటితో పాటు రోడ్లు, వంతెనలు, ఓడరేవులు, రైల్వేలు వాంఛనీయ పరిస్థితుల్లో లేనందున వస్తువులను సమయానుకూలంగా చేరవేయడంలో సమస్యలు ఎదురవుతాయి.


పేదరికపు విష వలయం 

పేదరిక విష వలయాన్ని (Vicious Circle of Poverty) రాగ్నర్‌ నర్స్క్‌ తెలియజేశారు.

 • 1950 తర్వాత వెనకబడిన దేశాలు పేదరికపు విషవలయంలో చిక్కుకుని వేగవంతమైన అభివృద్ధిని సాధించలేకపోయాయి. అభివృద్ధి చెందడానికి సాధనాలు లేక పేదవారు పేదవారిగానే మిగిలిపోతారు. అలాగే వెనకబడిన ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఆధునిక సాధనాలు కొరవడటంతో ఆ దేశాల్లో ఆర్థికాభివృద్ధి సాధన సులభం కాదు.
 • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అల్ప మూలధనం, మార్కెట్‌ అసంపూర్ణతలు, ఆర్థిక వెనకబాటుతనం, అల్పాభివృద్ధి కారణాలతో అల్ప ఉత్పాదక శక్తి ఏర్పడి విషవలయానికి దారితీస్తుంది. ఈ విష వలయాలు డిమాండ్, సప్లై ఆధారంగా పనిచేస్తాయి. 
 • డిమాండ్‌ పరంగా చూసినప్పుడు నిజ ఆదాయం తక్కువగా ఉంటే, డిమాండ్‌ తక్కువగా ఏర్పడి, అల్ప పెట్టుబడికి కారణమవుతుంది. దీని ఫలితంగా అల్ప మూలధనం, తద్వారా అల్ప ఉత్పాదకశక్తి, తక్కువ ఆదాయం ఏర్పడతాయి.
 • సప్లై ఆధారంగా చూస్తే అల్ప ఉత్పాదక శక్తి అంటే అల్ప నిజ ఆదాయం. దీని కారణంగా అల్ప పొదుపు పరిస్థితులు అల్ప పెట్టుబడికి, అల్ప మూలధనానికి దారితీస్తాయి. అల్ప మూలధనం వల్ల తిరిగి అల్ప ఉత్పాదకశక్తి, అల్ప ఆదాయం ఏర్పడతాయి. నిర్మితిపరమైన మార్పుల వల్ల అనేక అభివృద్ది చెందుతున్న దేశాల్లోని విష వలయాలను తప్పించవచ్చు. కొత్తగా స్వేచ్ఛను పొందిన కొన్ని ఆఫ్రికా దేశాలు వృద్ధి మార్గంలో నెమ్మదిగా ముందుకెళ్తున్నాయి.

అల్ప మూలధన సమీకరణ రేటు:

ఆర్థికాభివృద్ధి నిరోధకాల్లో ముఖ్యమైంది మూలధన కొరత. అల్ప మూలధన సమీకరణ రేటుకు కారణం, ఫలితం కూడా పేదరికమే. అల్పాభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు పేదవాళ్లు కాగా, ఎక్కువ మంది నిరక్షరాస్యులు, నైపుణ్యం లేనివారు. పురాతన యంత్రాలను, ఉత్పత్తి పద్ధతులను వాడుతుంటారు. ప్రజల ఉపాంత ఉత్పాదకశక్తి చాలా తక్కువ. కాబట్టి అల్ప నిజాదాయం, అల్ప పొదుపు, అల్ప పెట్టుబడి, అల్ప మూలధన సమీకరణ రేటు ఉంటాయి. కొద్దిస్థాయిలో పొదుపు చేసే మొత్తాన్ని ప్రజలు కరెన్సీ రూపంలో, లేదా బంగారం మొదలైనవి కొనుగోలు చేయడానికి వెచ్చిస్తారు. అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో అధిక మొత్తం పొదుపు అధిక ఆదాయవర్గం నుంచే వస్తుంది. అయితే ఈ పొదుపు ఉత్పాదక మార్గాల్లోకి ప్రవహించడం లేదు. అధిక ఆదాయవర్గం వారి విలాస వినియోగమే దీనికి కారణం.

రచయిత: బండారి ధనుంజయ
విషయ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని