NEET UG Counselling: నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా..

NEET UG counselling: నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా పడింది.

Updated : 06 Jul 2024 15:44 IST

దిల్లీ: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2024 పరీక్షలో అక్రమాల (NEET Row) వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్‌ (NEET UG counselling) ప్రక్రియ శనివారం (జులై 6) నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ (NTA) వెల్లడించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. కాగా.. నీట్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 (NEET UG 2024) పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టు (Supreme Court)లో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి.

నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు

దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తోసిపుచ్చింది. మరోవైపు, సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్‌ మార్కులు కలిపిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష (NEET Exam) నిర్వహించి సవరించిన నీట్‌ ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అక్రమాల (NEET Row) ఆరోపణలపై కేంద్రం, ఎన్‌టీఏ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్లు సమర్పించాయి. నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టు (Supreme Court)కు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల వేళ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడం గమనార్హం.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని