మరింత సాధనే.. మార్కుల మంత్రం!

ఇంటర్‌ వార్షిక పరీక్షల నగారా మోగింది కానీ విద్యార్థుల మానసిక సన్నద్ధత ప్రశ్నార్థకమే

Updated : 30 Aug 2022 14:23 IST

ఇంటర్‌ పరీక్షల సన్నద్ధత 

ఇంటర్‌ వార్షిక పరీక్షల నగారా మోగింది కానీ విద్యార్థుల మానసిక సన్నద్ధత ప్రశ్నార్థకమే. ప్రస్తుత స్థితిలో పరీక్షల్లో గరిష్ఠ ప్రతిభ చూపేలా అన్ని రకాలుగా తమను తాము మలచుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు కళాశాలల అధ్యాపకులూ, తల్లిదండ్రులూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సివుంటుంది. ఈ ఏడాది ఏ సబ్జెక్టు అయినా ఐపీఈకి తొలగించిన పాఠ్యాంశాలేమిటో మొదట తెలుసుకోవాలి. ఒక్కో పాఠ్యాంశానికి కేటాయించిన వెయిటేజీ గమనించుకుని దానికి    అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని సిద్ధమవ్వాలి.   అప్పుడే మెరుగైన ఉత్తీర్ణతను సాధించుకోవచ్చు!  
ఇంతకు ముందు రోజుల్లోలా విద్యార్థులను ముఖ్యమైన ప్రశ్నలను చదవమని చెప్పి, చదువుతున్నారని భావిస్తే మాత్రం వచ్చే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. అందుకని అధ్యాపకులు వీలైనంతవరకూ బేసిక్స్‌ నుంచి మరోమారు బోధించి, సమయం తక్కువగా ఉంటే ముఖ్యమైన అభ్యాసాలను ఎంచుకుని వాటిని సాధన చేయమనడం ద్వారా పరిస్థితులను కొంత మార్చవచ్చు. తల్లిదండ్రులు సైతం పిల్లలు చదువుతున్న తీరును పరిశీలిస్తూ వారితోపాటు కూర్చుని చదివించాల్సిన అవసరం ఈ ఏడాది ఎంతైనా ఉంది. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి. 

తొలగించిన సిలబస్‌ను వెయిటేజీని మోడల్‌ పేపర్స్‌ను చూసి అధ్యాపకుల సాయంతో విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమవ్వాలి. స్వల్ప, దీర్ఘ సమాధానాల ఎంపిక 50% ఉన్న కారణంగా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశాలు ఎక్కువ. సమయాభావం లేనట్లయితే స్వల్ప, దీర్ఘ సమాధానాలు రాసేటపుడు అదనంగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. అలాంటపుడు ఏదైనా ప్రశ్నలో మార్కులు పూర్తిగా సాధించలేకపోయినా ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ విధంగా అధిక మార్కులు తెచ్చుకునే వీలుంటుంది. 

గత ఏడాది మాదిరిగా విద్యార్థులను ఉత్తీర్ణులు చేస్తారన్న భావనలో ఉండొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పరీక్షలు నిర్వహించి ఆ ఫలితాలను మాత్రమే పరిగణిస్తారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సర విద్యార్థులు వారి ప్రథమ సంవత్సరంలో వచ్చిన ఫలితాల్లో మార్పులుండవు. కాబట్టి పరీక్షలకు ప్రథమ ప్రాధాన్యంతో సన్నద్ధమవ్వాలి.

భౌతిక శాస్త్రం (ఫిజిక్స్‌)


విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా మొదలు కావడం కారణంగా సన్నద్ధతకు తక్కువ సమయం ఉంది. ఇది కొంచెం విద్యార్థులపై ఒత్తిడి పెంచే అవకాశముంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకుని గరిష్ఠ మార్కులు సాధించగల మార్గాలను పాటించగలగాలి.
ప్రథమ సంవత్సరం
ఈ ఏడాది ప్రశ్నపత్రంలో సెక్షన్‌-బి, సిల్లో 50% చాయిస్‌ ఇస్తున్నారు. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను సేకరించి, వాటిలో తొలగించిన ప్రశ్నలను వేరుచేసి సన్నద్ధమైతే సులువుగా మార్కులు సాధించవచ్చు.
ముందుగా దీర్ఘ సమాధాన ప్రశ్నలపై దృష్టిపెట్టాలి. ఎక్కువగా ‘వర్క్, పవర్, ఎనర్జీ’, ‘ఆసిలేషన్‌’ చాప్టర్లు బాగా చదవాలి. అలాగే థర్మోడైనమిక్స్‌ నుంచి ఈ ఏడాది హీట్‌ ఇంజిన్, కార్నట్‌ సైకిల్‌ను తొలగించారు. కానీ ఈ చాప్టర్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు అడిగే అవకాశముంది. రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలను కలిపి ఒక దీర్ఘ సమాధానంగానూ అడగొచ్చు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు గత ఏడాది వెయిటేజీ ప్రకారం సన్నద్ధమైతే సరిపోతుంది. మొదటగా మోషన్‌ ఇన్‌ స్ట్ర్టెయిట్‌ లైన్, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్, లాస్‌ ఆఫ్‌ మోషన్, గ్రావిటేషన్, థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మేటర్, సాలిడ్స్, సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికల్స్‌ అండ్‌ రొటేషనల్‌ మోషన్‌ చాప్టర్ల నుంచి ఏటా రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి వీటిని బాగా చదివితే సెక్షన్‌-బిలో పూర్తి మార్కులను సాధించవచ్చు. అలాగే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ముందుగా ఫిజికల్‌ వరల్డ్, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్‌ యూనిట్లు, మెజర్‌మెంట్, లాస్‌ ఆఫ్‌ మోషన్, థర్మోడైనమిక్స్, థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మ్యాటర్‌ నుంచి మంచి మార్కులు సాధించవచ్చు.

తొలగించిన అంశాలు
*లాస్‌ ఆఫ్‌ మోషన్‌ (న్యూటన్‌ నియమాలు)
*సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికల్స్‌ (సమాంతర, లంబ సిద్ధాంతాలు) ః గ్రావిటేషన్‌ (కెప్లర్‌ నియమాలు, గురుత్వ త్వరణం) ః మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్‌ (యంగ్స్, షేర్‌ మాడ్యులస్, పాయిజన్స్‌ రేషియో, పొటెన్షియల్‌ ఎనర్జీ ఇన్‌ వైర్‌)  థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మ్యాటర్‌ (హీట్‌ ట్రాన్స్‌ఫర్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్‌) ః థర్మోడైనమిక్స్‌ (హీట్‌ ఇంజిన్, రెఫ్రిజిరేటర్, కార్నట్‌ ఇంజిన్‌)

ద్వితీయ సంవత్సరం
దీర్ఘ సమాధాన ప్రశ్నలు వేవ్స్, కరంట్‌ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. వేవ్స్‌లో డాఫ్లర్‌ ప్రభావాన్ని తొలగించడంతో మిగతా ప్రశ్నలపై దృష్టిసారించాలి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎక్కువగా రే ఆప్టిక్స్, ఫిజికల్‌ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్‌ చార్జెస్‌ అండ్‌ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్‌ పొటెన్షియల్‌ అండ్‌ కెపాసిటర్స్, మూవింగ్‌ చార్జెస్‌ మాగ్నటిజమ్, ఆటమ్స్‌ సెమీ కండక్టర్స్‌ చాప్టర్స్‌ నుంచి ఏటా అడుగుతున్నారు. కాబట్టి చూసుకోవాలి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు డ్యూయల్‌ నేచర్‌ ఆఫ్‌ రేడియేషన్, మాగ్నటిజమ్, మూవింగ్‌ చార్జెస్, ఆల్టర్నేటివ్‌ కరెంట్, ఎలక్ట్రో మాగ్నటిక్‌ వేవ్స్, కమ్యూనికేషన్‌ సిస్టమ్, సెమీ కండక్టర్స్, రే ఆప్టిక్స్‌ చాప్టర్లను ఎక్కువగా చదవాలి. అలాగే సంబంధిత మాదిరి ప్రశ్నలనూ చూసుకోవాలి.
తొలగించిన అంశాలు
- వేవ్‌ ఆప్టిక్స్‌ (పోలరైజేషన్, రిజాల్వింగ్‌ పవర్‌) - వేవ్స్‌ (డాఫ్లర్‌ ఎఫెక్ట్‌) - రే ఆప్టిక్స్‌ (స్కాటరింగ్‌ ఆఫ్‌ లైట్‌) - కరెంట్‌ ఎలక్ట్రిసిటీ (రెసిస్టివిటీ, కాంబినేషన్‌ ఆఫ్‌ రెసిస్టర్‌) - మాగ్నటిజమ్‌ (ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మాగ్నటిక్‌ మెటీరియల్స్‌) - న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ (బైండింగ్‌ ఎనర్జీ, రేడియోధార్మికత) 

రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)

ప్రథమ సంవత్సరం

ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా కనీస అర్హత మార్కులు సాధించడానికి ప్రయత్నించి, ఆపై పూర్తి  మార్కుల సాధనకు కృషి చేయవచ్చు.

అటామిక్‌ స్ట్రక్చర్, కెమికల్‌ బాండింగ్, పీరియాడిక్‌ టేబుల్‌ ద్వారా (12+10+10) మార్కులు సాధించవచ్చు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కూడా చదువుకుంటే 45 మార్కులకు పైగా పొందొచ్చు. గత సంవత్సరాల ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తూ సాధన చేస్తే ప్రయోజనం ఉంటుంది. పూర్తి మార్కుల సాధనకు అన్ని చాప్టర్లపై దృష్టి సారించాలి. ప్రథమ సంవత్సరంలో ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీని తొలగించారు.
ద్వితీయ సంవత్సరం
పోటీ పరీక్షలనూ రాయాల్సి ఉంటుంది కాబట్టి, సన్నద్ధతపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. ద్వితీయ సంవత్సర రసాయన శాస్త్రంలో దాదాపుగా అన్ని చాప్టర్లూ ముఖ్యమైనవే. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్‌  కెమికల్‌ కైనెటిక్స్‌ 16, 17 గ్రూపులు, కర్బన రసాయన శాస్త్రాల నుంచి (10+12+16) మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఈ, ప్రవేశపరీక్షల నిమిత్తం ద్వితీయ సంవత్సర విద్యార్థి రసాయన శాస్త్రంపై ఎక్కువ పట్టు సాధించాలి.

ద్వితీయ సంవత్సరం సిలబస్‌ నుంచి పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్‌ డైలీ లైఫ్, మెటలర్జీలను తొలగించారు. కానీ.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తొలగించిన చాప్టర్ల నుంచి జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. - పద్మశ్రీ జాలాది  (డీన్, శ్రీ చైతన్య కళాశాల
                                                                                                                    

 
                                                                                                                                                                                                                       


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని