Updated : 03 Mar 2021 10:15 IST

పదితో రిజర్వ్‌ బ్యాంకు ఉద్యోగం   

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. పదో తరగతి ఉత్తీర్ణతతో ఈ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష, స్థానిక భాషా నైపుణ్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. దేశవ్యాప్తంగా 841 ఖాళీలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ కేంద్రానికి 57 పోస్టులు కేటాయించారు.

పదో తరగతి విద్యార్హతతోనే రిజర్వ్‌ బ్యాంకులో ఉద్యోగం పొందడాన్ని గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు పోటీపడడానికి ఉన్నత విద్యావంతులకు అవకాశం లేదు. అందువల్ల గ్రాడ్యుయేట్లు, ఆ పై కోర్సులు చదువుకున్నవారు పోటీకి దూరంగా ఉంటారు. దీంతో పోటీ తీవ్రత కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు.

అలాగని సులువుగానే ఉద్యోగం సాధించడానికి అవకాశం లేదు. పరీక్ష రాయడానికి గరిష్ఠంగా 40 రోజులే ఉన్నాయి అందువల్ల ఇప్పటికే పోటీ పరీక్షల కోణంలో చదవడం ప్రారంభించినవారూ, ఎస్‌ఎస్‌సీ - మల్టీ టాస్కింగ్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ ఆ సన్నద్ధతతో ఆఫీస్‌ అటెండెంట్‌ పరీక్షను ఎదుర్కోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారికి అన్నీ కలుపుకుని ప్రారంభంలో నెలకు రూ.26,508 వేతనంగా లభిస్తుంది. విద్యార్హతలు, అనుభవం ఉన్నవారికి అంతర్గత పరీక్షల ద్వారా భవిష్యత్తులో పదోన్నతులకు అవకాశం లభిస్తుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఖాళీలు ప్రాంతాల వారీ ఉన్నాయి. అభ్యర్థులు ఏ ప్రాంతం/శాఖలోని ఖాళీలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ కార్యాలయం ఉన్న ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చుండాలి. ఇందుకోసం నిర్వహించే లాంగ్వేజీ ప్రొఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించాలి.     

ఆన్‌లైన్‌ పరీక్షలో మొత్తం 120 మార్కులకుగాను 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. రీజినింగ్‌-30, జనరల్‌ ఇంగ్లిష్‌-30, జనరల్‌ అవేర్‌నెస్‌-30, న్యూమరికల్‌ ఎబిలిటీ-30 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. పరీక్షలో ఎంపిక కావడానికి అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత కటాప్‌ మార్కులు సాధించడం తప్పనిసరి. ఇలా కనీస మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం తర్వాత దశకు తీసుకుంటారు. వీరికి లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అర్హులకు మెడికల్‌ పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి.

గమనించండి..
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: మార్చి 15
ఆన్‌లైన్‌ పరీక్షలు: ఏప్రిల్‌ 9, 10

https://ibpsonline. ibps.in/
rbirpoafeb21/

మొత్తం పోస్టులు: 841
శాఖల వారీగా ఖాళీలు: హైదరాబాద్‌-57, బెంగళూరు-28, భోపాల్‌-25, భువనేశ్వర్‌-24, చండీగఢ్‌-31, చెన్నై-71, తిరువనంతపురం-26, న్యూదిల్లీ-50, ముంబయి-202, అహ్మదాబాద్‌-50, సిమ్లా-47, గువాహటి-38, జమ్మూ-9, కోల్‌కతా-35, నాగ్‌పూర్‌-55, జయపుర-43, కాన్పూర్‌-69, పట్నా-28
విద్యార్హత: పదోతగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేట్లు అనర్హులు.

వయసు: ఫిబ్రవరి 1, 2021 నాటికి 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఫిబ్రవరి 2, 1996 - ఫిబ్రవరి 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ఠ వయః పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.   

మెరవాలంటే..
ఈ పరీక్షను ఆర్‌బీఐ తరఫున ఐబీపీఎస్‌ నిర్వహిస్తోంది. అందువల్ల ప్రశ్నపత్రం ఐబీపీఎస్‌ క్లరికల్‌ ప్రిలిమినరీ స్థాయికి దగ్గరలో ఉండవచ్చు. ఆ స్థాయిలో సన్నద్ధమైనవారు ప్రశ్నలు ఎదుర్కోవడం తేలికవుతుంది.
అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ- మల్టీ టాస్కింగ్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పాత ప్రశ్నపత్రాలు సాధనచేయడం మంచిది.

పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జవాబులు సరిచూసుకుని, తప్పులు పునరావృతం కాకుండా సిద్ధపడాలి.

వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో పరీక్ష పూర్తి చేయడం సాధ్యమవుతుంది.

రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీల్లో కొన్ని ప్రశ్నలకు జవాబు రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. అలాంటివాటిని ఆఖరులో, సమయం ఉంటేనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున అసలేమాత్రం తెలియని, అవగాహన లేని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.

120 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. అంటే ఒక్కో ప్రశ్నకు గరిష్ఠంగా 45 సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. రీజనింగ్‌ ప్రశ్నలకు ఈ సమయం సరిపోకపోవచ్చు. అందువల్ల జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్‌ సెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. ఈ విభాగాల్లో మిగిల్చిన సమయాన్ని రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీలకు ఉపయోగించుకోవాలి.  

ప్రశ్నలిలా..
రీజనింగ్‌: ఈ విభాగంలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు రావచ్చు. నంబర్‌ ఎనాలజీ, నంబర్‌ క్లారిఫికేషన్, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, నంబర్‌ సిరీస్, కోడింగ్‌-డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. తార్కిక పరిజ్ఞానంతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధన ద్వారా తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం అలవడుతుంది.
జనరల్‌ ఇంగ్లిష్‌: ఈ విభాగంలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తారు. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు పొందడానికి 8, 9, 10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి. నమూనా ప్రశ్నలు సాధన చేయాలి.
న్యూమరికల్‌ ఎబిలిటీ: కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలతోపాటు శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘన పరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు రావచ్చు. ఇవన్నీ దాదాపు దిగువ తరగతుల్లో చదువుకున్నవే. అందువల్ల వీటిని మరోసారి బాగా అభ్యాసం చేయాలి. అంకెలపై పట్టు పెంచుకోవాలి. అలాగే ముఖ్యమైన సూత్రాలు, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌: సాధారణ పరిజ్ఞానంతో ఈ విభాగంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి. చుట్టూ జరుగుతోన్న సంఘటనలపై అవగాహన ఉన్నవారు సులువుగానే సమాధానాలు గుర్తించగలరు. ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ వ్యవస్థల గురించి కొన్ని ప్రాథమిక స్థాయి ప్రశ్నలు అడగవచ్చు. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. 8,9,10 తరగతుల సైన్స్, సోషల్‌ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకోవాలి. వర్తమాన వ్యవహారాల నుంచీ కొన్ని ప్రశ్నలు ఆశించవచ్చు. అందువల్ల ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 వరకు ముఖ్య సంఘటనలు మననం చేసుకోవాలి. ముఖ్యాంశాలు ఒకదగ్గర రాసుకుంటే గుర్తుంచుకోవడం తేలికవుతుంది. అలాగే పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి చదువుకోవడానికి అవకాశముంటుంది. నియామకాలు, అవార్డులు, విజేతలు, రచయితలు... ఈ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఒకసారి మననం చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts