Self Confidence: అద్భుత అస్త్రం.. ఆత్మవిశ్వాసం!

ఉద్యోగం సంపాదించడంలో చెందుతున్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉండే లోపాలూ, వాటిని అధిగమించే మెలకువలు ఇవీ...

Updated : 23 Oct 2023 20:12 IST

ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్షతో అకడమిక్‌ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటారు కాబట్టి.. బృందచర్చ, ఇంటర్వ్యూల్లో దానికి ప్రాధాన్యం తక్కువే. వీటిలో అభ్యర్థుల తీరు, వారు విభిన్న    పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నారో పరిశీలిస్తారు. అందులో మెరుగైన ప్రదర్శన చేసినవారికే అవకాశాలు లభిస్తాయి. కొలువు కొట్టటంలో వైఫల్యం చెందుతోన్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉమ్మడిగా ఉండే లోపాలూ, వాటిని అధిగమించే మెలకువలూ తెలుసుకుందామా?

సుమతి తెలివైన విద్యార్థిని. పది నుంచి పీజీ దాకా డిస్టింక్షన్‌. సుగుణకు పీజీ వరకు ప్రథమ శ్రేణి మార్కులున్నాయి. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ కలిసే చదువుకున్నారు. కార్పొరేట్‌ సంస్థ నియామక పరీక్షను ఇద్దరూ రాసి, అర్హత పొందారు. ఎంపికలో తర్వాత దశ.. బృంద చర్చ, ముఖాముఖిలోనూ పాల్గొన్నారు. ఫలితాల జాబితాలో అనూహ్యంగా సుమతి పేరు లేకుండా సుగుణ పేరుంది. ఏం జరిగి ఉంటుంది?

సుమతి లాంటి ఉద్యోగార్థుల్లో.. అకడమిక్‌ పరిజ్ఞానం, అవసరమైన స్కిల్స్‌ రెండూ బాగా ఉంటాయి. కానీ గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు వచ్చేసరికి తడబడుతుంటారు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమవడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైంది.. వారిలో ఆత్మవిశ్వాసం లోపించడమే.

ఏం మాట్లాడితే ఏమవుతుందోననే జంకు, భయం కొందరిదైతే, ఇంటర్వ్యూ అంటేనే ఒత్తిడికి గురై బెదిరిపోయేవాళ్లు ఇంకొందరు. సరైన సమాధానం తెలిసినప్పటికీ అది అవునో, కాదో అనే సందేహం, చొరవ తీసుకోవడంలో మీమాంస, ఆందోళన... తదితర కారణాలతో వీరంతా ఆఖరి అంకంలో వెనుదిరగాల్సివస్తోంది. ఉద్యోగానికి కావాల్సిన అన్ని యోగ్యతలూ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లోపించడంతో విఫలమవుతున్నారు. ఇంటర్వ్యూ చేసేవారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా ఉద్యోగ సాధనలో వెనుకబడుతున్నారు.

సామర్థ్యాన్ని అస్త్రంగా మార్చుకుని, వందశాతం ఉపయోగిస్తేనే ఫలితమొస్తుంది. చాలామంది విషయంలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రభావవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోవడం వల్ల విజయం  దూరమవుతోంది. దీంతో విషయపరంగా కాస్త వెనుకబడినప్పటికీ, ఆత్మవిశ్వాసం సమృద్ధిగా ఉన్నవాళ్లు వీరికి దక్కాల్సిన అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కారణాలు విశ్లేషించుకోకుండా.. ఎంపిక విధానంలోనే లోపం ఉందని సమర్థించుకునేవాళ్లూ ఎక్కువే. చేసిన తప్పులు, అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుంటే, తర్వాత ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మార్గం సులువవుతుంది.

నమ్మకం ఉంటేనే..

యద్భావం తద్భవతి. మనం ఆశించిన ఫలితమే మనకు దక్కుతుంది. నా వల్ల కాదు అనుకుంటే దాని ఫలితమూ అలాగే ఉంటుంది. నేను సాధిస్తాను.. సాధించగలను.. విజయం పొందగలను.. అనే నమ్మకంతో ముందడుగేస్తే విజయానికి దగ్గరవుతాం. ఎవరిని వాళ్లు నమ్మలేనప్పుడు ఇతరులు ఆ వ్యక్తులను నమ్ముతారని ఆశించడం వ్యర్థమే.  

పోల్చుకోవడం

ఎక్కువమంది ఇతరులతో పోల్చుకుంటారు. వాళ్ల దగ్గర ఉన్నదాన్ని చూసి, తమ వద్ద లేదని బాధ పడతారు. దీంతో ఒత్తిడికి గురవుతారు. ఆత్మవిశ్వాసం మీద దాని ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరితోనూ పోలిక వద్దు. మీ లక్ష్యం దిశగా అడుగులేయండి. నిన్నటి మిమ్మల్ని, ఈ రోజు మీతో బేరీజు వేసుకోండి. ఇతరుల సంగతి అనవసరమని భావించండి. మీరేం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని ఆ దిశలో ముందుకు కదలండి. వేరెవరి దగ్గరో ఉన్నది మీకు సొంతం కాదు. ఒకవేళ అది మీకు అవసరమైనదైతే ప్రయత్నం చేస్తే తప్పక మీ సొంతమవుతుందని గ్రహించండి. పోల్చుకుంటే సమయం వృథాతోపాటు మీపై మీరే నమ్మకం కోల్పోవచ్చు.

వాస్తవికతకు దగ్గరగా..

మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలు వాస్తవికతకు అనుగుణంగా ఉండాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవడం...దాన్ని అందుకోవడం అద్భుతమే. అయితే భారీ లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోలేకపోతే నిరాశ చెందుతారు. దాని ప్రభావం తర్వాత పెట్టుకునే లక్ష్యాలపైనా పడుతుంది. అందువల్ల లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విభజించుకోండి. ఒక్కో దానికి సరిపడా గడువు నిర్ణయించుకోండి. ఇలా చేయడం వల్ల సులువుగా ఒకదాని తర్వాత మరొకటి పూర్తిచేయడానికి అవకాశం కలుగుతుంది. వాస్తవికతకు అనుగుణంగా చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని అధిగమిస్తే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. దీంతో పెద్ద లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.

ప్రతికూలంగా..

కొంతమంది వాళ్లకు సంబంధించి ప్రతి విషయాన్నీ విమర్శనాత్మక ధోరణిలో చూస్తారు, వారిపై వాళ్లే ప్రతికూలంగా ఆలోచిస్తారు. దీంతో నియంత్రణ కోల్పోతారు. మాతో ఏమీ సాధ్యం కాదు అనే పరిస్థితికి చేరుకుంటారు. ఫలితంగా ఆత్మవిశ్వాసం ఆవిరవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు ప్రేమించడాన్ని మొదలు పెట్టండి. మీపై మీకు నమ్మకం కలిగేలా వ్యవహరించండి.

సమర్థతపై నమ్మకం

స్వశక్తిపై పూర్తి నమ్మకం ఉన్నవాళ్లే ఏదైనా సాధించగలరు. దేన్నైనా సాధించాలంటే పూర్తిస్థాయుల్లో మీ శక్తియుక్తులు, సామర్థ్యాన్ని ప్రదర్శించడం ముఖ్యం. మీపై మీకు నమ్మకం ఉండడం వల్ల సంతోషంగా ఉండటంతోపాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.

మీకోసం మీరు

మీపై మీరే పెట్టుబడి పెట్టుకోవాలి. అంటే ఉన్న సమయాన్ని మీకోసం మీరు వెచ్చించుకోవాలి. వీలైతే అదనపు సమయాన్నీ కేటాయించాలి. ఏదైనా అంశంలో ప్రావీణ్యం లేకపోతే అందులో అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి. కృషి ద్వారా సమర్థత, సమర్థతతో ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి. ఫలితంగా లక్ష్యానికి మార్గం సుగమమవుతుంది.

ఆ దిగులొద్దు..

నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకునేవాళ్లు ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లే. ఎవరి పనులతో వాళ్లు తీరిక లేకుండా ఉంటారు. ఒకరిని ఇంకొకరు పట్టించుకోవడం అన్ని సందర్భాల్లోనూ వీలుపడదు. మీరు కూడా ప్రతిసారీ వేరేవాళ్లను పట్టించుకోవడంలేదు కదా. కాబట్టి ఇతరుల స్పందన కోసం చూడకుండా చేసే పనిని మాత్రమే మీరు ప్రేమించండి. మీ ఆలోచనలకు గుర్తింపు, గౌరవం దక్కడం లేదని దిగులు చెందకండి.

గతం నుంచి ప్రేరణ

ఇప్పటిదాకా మీరు సాధించిన విజయాలు, అందుకు లభించిన ప్రశంసలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. వాటి నుంచి ప్రేరణ పొందండి. కొత్త లక్ష్యం దిశగా సానుకూలంగా ముందుకు వెళ్లండి. మరికొంచెం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాను అనే విశ్వాసంతో ప్రయత్నం దిశగా అడుగులేయాలి. ఒకవేళ గతంలో విఫలం చెందితే అందుకు కారణాలు తెలుసుకుని, లోపాలు అధిగమించండి. ఆ ఓటమిని మరిచిపోండి.

జ్ఞానమే ఆయుధం

ప్రతికూల ధోరణి తగ్గించుకుని, జ్ఞానం పెంచుకోవడానికి అధ్యయనంపై దృష్టి సారించండి. విస్తృతంగా చదవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, అవగాహన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి జ్ఞానానికి మించిన ఆయుధం లేదు. ఎంత ఎక్కువ పరిజ్ఞానం ఉంటే అంత మొత్తంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపూ దక్కుతుంది.

భయాలతో యుద్ధం..

భయమే అత్యంత క్రూరమైన శత్రువు. అది విశ్వాసాన్ని దెబ్బకొట్టి, నిస్సహాయుల్ని చేస్తుంది. లక్ష్యాలను చేరుకోకుండా వెనుక్కి లాగుతుంది. భయాల నుంచి దూరంగా పారిపోకుండా వాటితో యుద్ధం చేయాలి. భయానికి కారణాలు తెలుసుకుని, ప్రయత్నం ద్వారా అధిగమించాలి. ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇస్తే నెమ్మదిగా మన బుర్రంతా వాటితోనే నిండిపోతుంది. కాబట్టి వాటిని అక్కడితో ఆపి సానుకూలంగా ఆలోచించండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.

ఇవి పాటించండి!

  • సానుకూలంగా మాట్లాడేవాళ్లతో ఒక సమూహంగా ఏర్పడండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. ప్రతికూలంగా మాట్లాడేవారికి దూరంగా ఉండండి.
  • గతంలో మీకు ఎదురైన ప్రతికూల ఫలితాలను గుర్తుతెచ్చుని బాధ పడకుండా వాటిని వీలైనంత త్వరగా మర్చిపోండి. గత వైఫల్యాల ప్రభావం లేకుండా చూసుకోవడం ముఖ్యం.
  • మీకంటూ ఓ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో నిష్పాక్షికంగా మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోండి. ఎక్కడ వెనుకబడుతున్నారు, అందుకు కారణాలు ఏమిటి, అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా.. వీటిని విశ్లేషించుకోవాలి. అందరికంటే ఎక్కువగా మీ గురించి మీకే బాగా తెలుస్తుందని గుర్తించుకోండి.
  • ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం లేదా విభాగంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు. మీరు ఎందులో సమర్థులో తెలుసుకోండి. అందులో మరింత పట్టుకోసం కృషిచేయండి.
  • మనసుకు నచ్చిన పనినే చేయడం వల్ల నమ్మకం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు రావు. అందువల్ల మీ లక్ష్యాలు ఎప్పుడూ మీ ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. ఏమాత్రం ఇష్టంలేనివాటిని కర్తవ్యంగా భావించినప్పుడు విఫలమవ్వడమే కాకుండా, మీపై మీకు నమ్మకం పోతుంది. దాని ప్రభావం మిగిలిన అన్నింటిపైనా పడుతుంది.
  • ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణాలు తెలుసుకోండి. ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడలేకపోవడం మీ సమస్య అయితే ఆ భాషను నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆ విషయంలో మీకంటే మెరుగైన వ్యక్తుల సహాయం తీసుకోండి. ఇలా ప్రతి సమస్యను అధిగమించడానికి ఉండే పరిష్కారాలు తెలుసుకుని ఆచరించండి.

ఆత్మవిశ్వాసం లోపిస్తే ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అది వెలుగులోకి రాదు. అదే సమృద్ధిగా ఉంటే అవసరమైనంత ప్రతిభ లేకపోయినప్పటికీ విజయాన్ని అందుకోవచ్చని తెలుసుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని